Share News

గ్యారంటీ పథకాలు అందేదెలా....?

ABN , Publish Date - Mar 01 , 2024 | 10:37 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆరు గ్యారంటీ పథకాలు పొందేందుకు రేషన్‌ కార్డు తప్పనిసరి కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఆరు గ్యారంటీ పథకాలకు అర్హులైన వేల మంది ఆశగా చూస్తున్నారు. ఆధార్‌కార్డ్‌తో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించింది.

గ్యారంటీ పథకాలు అందేదెలా....?

బెల్లంపల్లి, మార్చి 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆరు గ్యారంటీ పథకాలు పొందేందుకు రేషన్‌ కార్డు తప్పనిసరి కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఆరు గ్యారంటీ పథకాలకు అర్హులైన వేల మంది ఆశగా చూస్తున్నారు. ఆధార్‌కార్డ్‌తో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించింది. ఇతర గ్యారంటీ పథకాల కోసం రేషన్‌ కార్డు నిబంధన తప్పనిసరి చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులను జారీ చేయలేదు. రేషన్‌ కార్డు కోసం జిల్లాలో వేల మంది దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్నారు.

- రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూపులు

2016లో రేషన్‌ కార్డులను అప్పటి ప్రభుత్వం జారీ చేసింది. ఆ తర్వాత నూతన రేషన్‌ కార్డులను జారీ చేయలేదు. అలాగే కొత్తగా వివాహం అయిన వారు సైతం రేషన్‌ కార్డులకు నోచుకోలేదు. ప్రస్తుతం జిల్లాలో 2,14,236 మందికి రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో అంత్యోదయ కార్డులు కలిగిన వారు 15,417 మంది ఉండగా, ఆహార భద్రత కార్డులు 1,98,649, అన్నపూర్ణ కార్డులు 170 ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు కొత్త రేషన్‌ కార్డుల ప్రకటన జారీ చేయడంతో జిల్లా వ్యాప్తం గా వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. బెల్లంపల్లి మండలంలో 2,620 మంది, భీమిని మండలంలో 488, కన్నెపల్లిలో 477, కాసిపేటలో 1249, తాండూర్‌లో 991, వేమనపల్లిలో 363, నెన్నెలలో 574, భీమారంలో 418, చెన్నూరులో 2966, దండేపల్లిలో 1382, హాజీపూర్‌లో 892, జైపూర్‌లో 1256, జన్నారంలో 1631, కోటపల్లిలో 959, లక్షెట్టిపేటలో 1360, మంచిర్యాలలో 3115, మందమర్రిలో 3581, నస్పూర్‌లో 2884 మంది రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి ఇప్పటి వరకు రేషన్‌ కార్డులు జారీ కాలేదు.

- గ్యారంటీల కోసం ఆందోళన

జిల్లా వ్యాప్తంగా 27,205 మంది రేషన్‌ కార్డు కోసం ఎదురు చూస్తు న్నారు. అలాగే వీరే కాకుండా కొత్తగా వివాహమైన వారు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు కొత్త రేషన్‌ కార్డులకు నోచుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలకు రేషన్‌ కార్డు తప్పనిసరి చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి రేషన్‌ కార్డు నిబంధన పెట్టలేదు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలు పెంచే పథకానికి మాత్రం రేషన్‌ కార్డు తప్పనిసరి చేసింది. ఇటీవల మరో రెండు గ్యారంటీ పథకాలను ప్రభుత్వం అమలు చేసేందుకు సంబంధిత శాఖలకు ఆదే శాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా కొనసాగు తుంది. రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాలకు ప్రభుత్వం రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకుంది. దీంతో రేషన్‌ కార్డులు లేని వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీ పథకాల కోసం రేషన్‌కార్డులు లేని వారు రేషన్‌ కార్డులకు కూడా దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో దరఖాస్తులు స్వీకరించారు. కానీ కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎలాంటి విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించకపోవడం, గ్యారంటీ పథకాలకు రేషన్‌ కార్డు తప్పనిసరి చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకుండా ఆరు గ్యారంటీలను అమలు చేస్తుండడం, గ్యారంటీ పథకాలకు రేషన్‌కార్డు తప్పనిసరి చేయడంతో అర్హులకు అందకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు.

- రేషన్‌కార్డు లేకపోవడంతో నష్టపోతున్నాం

సుమలత

రేషన్‌ కార్డు కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకు కార్డు రాలేదు. రూ. 500లకు గ్యాస్‌ సిలిండర్‌, ఉచిత విద్యుత్‌ రావాలంటే అధికారులు రేషన్‌ కార్డు తప్పనిసరి అంటున్నారు. ఈ పథకాలకు నాకు అర్హత ఉన్నప్పటికీ రేషన్‌ కార్డు లేకపోవడంతో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం రేషన్‌ కార్డులను మంజూరు చేయాలి.

-రేషన్‌ కార్డులను అందించాలి - నాగేష్‌

గత ప్రభుత్వ హయాంలో రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అర్హులైన వారందరికి రేషన్‌ కార్డులను వెంటనే అందించిన తర్వాతనే గ్యారంటీ పథకాలను అమలు చేయాలి. లేదా రేషన్‌ కార్డు సంబంధం లేకుండా పథకాలను అమలు చేయాలి. అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి.

Updated Date - Mar 01 , 2024 | 10:37 PM