Share News

సమస్య పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తాం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:10 PM

గ్రామ సమస్యలు పరిష్కరించే వరకు ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేయమని రాజారం గ్రామస్థులు తీర్మానించగా రెండో రోజు గురువారం అధికారులు వారితో చర్చలు జరిపారు. ఎంపీడీవో ఆకుల భూమన్న, ఎస్‌ఐ రాజేందర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ నవీన్‌, ఆర్‌ఐ రాజలింగు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులతో సమావేశమయ్యారు.

సమస్య పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తాం

కోటపల్లి, ఏప్రిల్‌ 25 : గ్రామ సమస్యలు పరిష్కరించే వరకు ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేయమని రాజారం గ్రామస్థులు తీర్మానించగా రెండో రోజు గురువారం అధికారులు వారితో చర్చలు జరిపారు. ఎంపీడీవో ఆకుల భూమన్న, ఎస్‌ఐ రాజేందర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ నవీన్‌, ఆర్‌ఐ రాజలింగు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చలు జరిపిన అధికారులు కలెక్టర్‌కు సమస్యలు తెలిపామని, ఇప్పటికే రోడ్డు నిర్మాణం మంజూరైనందున అటవీ అనుమతుల కోసం సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకువస్తామని, అనంతరం రహదారి నిర్మిస్తామని కలెక్టర్‌ చెప్పారని గ్రామస్థులకు అధికారులు వివరించారు. అయితే ఇందుకు గ్రామస్థులు ససేమిరా అన్నారు. ముందుగా రోడ్డు నిర్మాణం పూర్తయితేనే తాము ఎన్నికల్లో ఓట్లు వేస్తామంటూ తేల్చి చెప్పారు. అయితే దీనిపై అధికారులు తమకు బాండ్‌ పేపరు రాసివ్వాలని గ్రామస్థులు కోరగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున అలాంటి హామీలు ఇవ్వలేమని పేర్కొన్నారు. సుమారు గంటన్నరపాటు చర్చలు జరిపినా గ్రామస్థులు తమ సమస్యలు పరిష్కారం అయితేనే ముందుకు వెళ్తామని చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు.

Updated Date - Apr 25 , 2024 | 11:10 PM