Share News

గొర్రెల పంపిణీకి మోక్షమెప్పుడు

ABN , Publish Date - May 19 , 2024 | 10:41 PM

గొల్లకుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చిన గొర్రెల పంపిణీ కార్యక్రమం తీసుకొచ్చింది. కుల వృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చేందుకు 2017 జూన్‌లో కేసీఆర్‌ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.

గొర్రెల పంపిణీకి   మోక్షమెప్పుడు

కాసిపేట, మే 19: గొల్లకుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చిన గొర్రెల పంపిణీ కార్యక్రమం తీసుకొచ్చింది. కుల వృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చేందుకు 2017 జూన్‌లో కేసీఆర్‌ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. మంచిర్యాల జిల్లాలో మొదటి విడతలో 5833 మందికి గొర్రెలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ 5719 మందికి గొర్రెల పంపిణీ గ్రౌండింగ్‌ చేశారు. మొదటి విడతలో జరిగిన పొరపాట్లను అధిగమించేందుకు రెండో విడతను 2018 మార్చిలో రెట్టింపు ఉత్సాహంతో ప్రారంభించారు. 5786 మందికి గొర్రెలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన రెండో విడత పంపిణీ పక్కదారి పట్టింది. రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖ అధికారులు గొర్రెల కొనుగోలు చేసి ఇచ్చే ఏజెన్సీలు కుమ్మక్కై దళారులకు కాసుల పంట కురిపించారు. దీంతో గొర్రెల పంపిణీ ప్రారంభానికి ముందే విమర్శలు ఎదుర్కొంది. రెండో విడతలో 5786 మందికి గొర్రెలు పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని నిర్ధేశించగా కేవలం 2297 యూనిట్‌లు గ్రౌండింగ్‌కు నోచుకున్నాయి. మూలధనం వాటా చెల్లించిన లబ్ధిదారులకు ఐదేండ్లు గడిచినా గొర్రెలు రాక, ఇటు డబ్బులు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

-గొర్రెల పంపిణీ ఇలా...

మొదటి విడతలో లబ్ధిదారుని వాటా రూ.31,250 చెల్లిస్తే రూ.1.25 లక్షల విలువ గల 20 గొర్రెలు, ఒక పొట్టేలును లబ్ధిదారునికి అందజేశారు. రెండో విడతలో రూ.43,750 మూలధనం వాటాను లబ్ధిదారులు చెల్లిస్తే రూ.1.75 లక్షల విలువ గల 20 గొర్రెలు, ఒక పొట్టేలును కొందరికి అందజేశారు. లబ్ధిదారులకు ఇచ్చేందుకు సరిపడ గొర్రెలు లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకున్నారు. అయినప్పటికి లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు సరిపోకపోవడంతో ఇతర గొర్రెల మందలను చూపించి డబ్బులు డ్రా చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇలా రీసైకిల్‌ చేసినప్పటికీ గొర్రెల యూనిట్లు సరిపోకపోవడంతో పథకం పూర్తిస్థాయిలో విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి.

- ఆందోళనలో లబ్ధిదారులు

కేసీఆర్‌ ప్రభుత్వం ఆడంబరాలకు పారిపోయి విచ్చలవిడిగా యూనిట్లను మంజూరు చేసి లబ్ధిదారుల నుంచి మూలధనం వాటాలను డీడీల రూపంలో వసూలు చేసింది. ఒక్కో యూనిట్‌కు రూ.43,750 ప్రభుత్వ ఖాతాలో లబ్ధిదారులు జమ చేశారు. కానీ జిల్లాలో ఇప్పటివరకు ఐదేండ్లు గడిచినా గొర్రెల పంపిణీ జరక్కపోవడంతో లబ్ధిదారులు ఆందళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 1500 మంది రూ. 6.5 కోట్ల డబ్బులు చెల్లించి ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం చొరవ చూపి ఆదుకోవాలని లబ్ధిదారులను కోరుతున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ప్రకటించ లేదు.

అప్పులు తెచ్చి డీడీ కట్టిన - ముత్యాల రాజయ్య యాదవ్‌ , ధర్మారావుపేట

గొల్లకుర్మలకు గొర్రెల యూనిట్లు ఇస్తామంటే 2018లో రూ.43,750 అప్పులు తెచ్చి డీడీ కట్టిన. కానీ 5 ఏండ్లు అయినా గొర్రెలు రాలేదు. పైసలు ఇస్తలేరు. తెచ్చిన అప్పుకు వడ్డీ పెరిగిపోతుంది. మాలాంటి నిరుపేద కుటుంబాలకు ఆర్థికభారం పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి గొర్రెలను అందజేసి ఆదుకోవాలి.

గొర్రెల పంపిణీకి ప్రభుత్వం చొరవచూపాలి - కొమ్ము అశోక్‌ యాదవ్‌, గొర్రెల, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

లబ్ధిదారులందరికి గొర్రెల యూనిట్లు అందేలా ప్రభుత్వం చొరవ చూపాలి. గతంలో డీడీలు కట్టిన లబ్ధిదారులు నష్టపోకుండా ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. ప్రభుత్వాలు మారినప్పటికీ ప్రజలకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎక్కువ మంది గొల్లకుర్మలు అప్పులు తెచ్చి డీడీలు చెల్లించారు.్ట గొర్రెలను అందించేలా ప్రభుత్వం కృషి చేయాలి.

ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం - డాక్టర్‌ రమేష్‌, పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి

రెండో విడత గొర్రెల పంపిణీ కోసం లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వానికి నివేదికలను అందజేశాం. కొత్త ప్రభుత్వ సూచన మేరకు కార్యాచరణ ఉంటుంది. డీడీలు కట్టి గొర్రెలు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లాలో గొర్రెల పథకం పారదర్శకంగానే జరిగింది. మున్ముందు కూడా ప్రభుత్వ ఆదేశాలతో అర్హులైన లబ్ధిదారులందరికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం.

Updated Date - May 19 , 2024 | 10:41 PM