Share News

టీ-ఫైబర్‌.. నో సిగ్నల్‌

ABN , Publish Date - May 02 , 2024 | 10:55 PM

ఇంటింటికి ఇంటర్నెట్‌ సౌకర్యం అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన టీ-ఫైబర్‌ ప్రాజెక్టు పురోగతి ప్రశ్నార్థంగా మారింది. సత్వర సేవలు, పరిపాలన సౌలభ్యం కోసం పంచాయతీ కార్యాలయాలతోపాటు ప్రతీ ఇంటికి ఆన్‌లైన్‌ సేవలు అందించాలనే లక్ష్యం నెరవేరలేదు. 2015లో ప్రారంభమైన ఈ మెగా ప్రాజెక్టు 2022నాటికే పూర్తి కావాల్సి ఉంది.

టీ-ఫైబర్‌.. నో సిగ్నల్‌

నెన్నెల, మే 2: ఇంటింటికి ఇంటర్నెట్‌ సౌకర్యం అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన టీ-ఫైబర్‌ ప్రాజెక్టు పురోగతి ప్రశ్నార్థంగా మారింది. సత్వర సేవలు, పరిపాలన సౌలభ్యం కోసం పంచాయతీ కార్యాలయాలతోపాటు ప్రతీ ఇంటికి ఆన్‌లైన్‌ సేవలు అందించాలనే లక్ష్యం నెరవేరలేదు. 2015లో ప్రారంభమైన ఈ మెగా ప్రాజెక్టు 2022నాటికే పూర్తి కావాల్సి ఉంది. నిధుల కొరత, అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పల్లెల్లో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా గ్రామాల్లో డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రావడం లేదు.

-నత్తనడకన పనులు

గ్రామాల్లో ఇంటింటికి 20 ఎంబీపీఎస్‌, విద్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలకు ఒక జీబీపీఎస్‌ కనీస వేగం కలిగిన బ్రాడ్‌బ్యాండ్‌ సేవ లను తక్కువ ధరకే అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకం భారత్‌ నెట్‌లో భాగంగా జిల్లాలో స్టెర్‌లైట్‌ సంస్థ పను లను చేపట్టింది. జిల్లాలోని 18 మండలాల్లోని 311 గ్రామ పంచాయతీలకు ఇంటెర్‌నెట్‌ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు వందల కిలోమీటర్ల మేర గ్రామాల్లో మిషన్‌ భగీరథ పైపులైన్లతోపాటు అండర్‌గ్రౌండ్‌లో ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ (ఓఎఫ్‌సీ) నిర్మాణం పనులు చేపట్టారు. మండల కేంద్రాల్లో ఆప్టికల్‌ లింక్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి అక్కడి నుంచి గ్రామాలకు అనుసం ధానం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు ఉన్న చోట ఎంఐ బాక్సులను ఏర్పాటుచేశారు. విద్యుత్‌ సమస్య తలెత్త కుండా ఉండేందుకు సోలార్‌ ఇన్వర్టర్లు కూడా ఏర్పాటు చేశారు. కాని కనెక్షన్‌ ఇచ్చేందుకు టెక్నికల్‌ పనులు మిగిలి ఉన్నాయి. పెండింగ్‌ పనులను పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఇంటింటికి దేవుడెరుగు గ్రామ పంచాయతీ కార్యా లయాలకే నెట్‌ కనెక్షన్‌ ఇవ్వడం లేదు. దీంతో కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తి చేసిన పనులు వృథాగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

-క్లస్టర్‌ వ్యవస్థకు మంగళం

గ్రామాలకు ఇంటర్‌ నెట్‌ సౌకర్యం లేక క్లస్టర్ల విధానం కనుమరుగైంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల వివరాలు, ఆదాయ వ్యయాల సమా చారాన్ని పంచాయతీల వారీగా ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు ప్రభుత్వం క్లస్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయిదు నుంచి ఏడు గ్రామాలను కలిపి క్లస్టర్లుగా విభజించారు. వాటికి అవసరమైన కంప్యూటర్లు ఇతర సామగ్రి, కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించారు. వారికి ఆన్‌లైన్‌ విధానం, ఈ-పాలనపై శిక్షణ ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం లేదనే సాకుతో ఈ విధానానికి మంగళం పాడారు. అందరికీ పంచాయతీ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన క్లస్టర్ల వ్యవస్థ నిర్వీర్యం కావడంతో గ్రామాల ప్రజలకు పంచాయతీ పాలన విధానం దూరమైంది. ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు పంచాయతీల వివరాలను పొందుపర్చడానికి మండల పరి షత్‌ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రజలకు ఏదైన అవసరం ఏర్పడితే మండల కేంద్రానికి వెళ్ళాల్సి వస్తోంది.

-మాన్యువల్‌గానే పనులు

గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఇప్పటికీ మాన్యువల్‌ పద్ధతిలోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గ్రామానికి సంబంధించిన ఏదైన సమాచారం కావాలంటే రికార్డులు వెతకాల్సిన పరిస్థితి ఉంది. ఇంటిప న్నులు, వివిధ అనుమతి పత్రాలు, లైసెన్సు, జనన మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, పంచాయతీ ఆదాయం, ఆమోదించిన చెక్కులు, జీతాల రసీదు పనులు మాన్యువల్‌ పద్ధతిలోనే కొనసాగిస్తున్నారు. నెలనెల పంచాయతీల ఆదాయ, వ్యయాలను ఆన్‌లైన్‌ ఆడిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నింటికి ఇంటర్‌నెట్‌ సిగ్నల్‌ అడ్డంకిగా మారింది.

-ప్రారంభమైతే సేవలు

గ్రామాల్లో సైతం ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ వినియోగం పెరిగింది. ప్రైవేటు కంపెనీలు పెద్ద గ్రామాల్లో టవర్లు ఏర్పాటు చేస్తున్నప్పటికి ఇంటర్నెట్‌ సౌకర్యం లేని పల్లెలు ఇప్పటికి చాలా ఉన్నాయి. గిరిజన గ్రామాలు, అటవీ ప్రాంతాల్లోని పల్లెల్లో మొబైల్‌ సిగ్నల్‌ అందక ఇక్కట్లకు గురవుతున్నారు. రేషన్‌ డీలర్లు, పోస్టల్‌ ఉద్యోగులు, ఉపాధిహామీ సిబ్బంది సిగ్నల్‌ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ-బ్యాంకింగ్‌, ఈ-గవర్నెస్‌, సోషల్‌ వైఫై, టెలి-మెడిసిన్‌, వీడియో కాన్ఫరెన్స్‌లు, ఈ-క్లాస్‌ లాంటి సేవలు టీ-ఫైబర్‌ ప్రారంభమైతే గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.

పనులు పూర్తి చేయాలి

గాజు మహేందర్‌, మన్నెగూడం, నెన్నెల మండలం

ప్రతీ విషయం ఇంటర్‌నెట్‌తో ముడిపడి ఉంది. టీ-ఫైబర్‌తో ఇంటింటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యం మంచిదే. పనులు ప్రారం భించి ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. పెండింగ్‌లో ఉన్న పను లు పూర్తి చేస్తే గ్రామ పంచాయతీల్లో ఈ-సేవలు అందుబాటులోకి తేవాలి.

Updated Date - May 02 , 2024 | 10:55 PM