Share News

బల్దియా ఆదాయానికి ‘టెండర్‌’

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:04 PM

మున్సిపాలిటీలో నిబంధనలు పాటిస్తూ బల్దియా ఆదాయం పెంచేందుకు కృషి చేయాల్సిన అధికారులు, పాలకవర్గ సభ్యులు తప్పుడు మార్గాలు అవలంభిస్తున్నారు. అధికారుల వైఖరి కారణంగా బల్దియా ఆదాయానికి గండి పడుతుండగా, ప్రైవేటు వ్యక్తులు కోట్లు గడిస్తున్నారు.

బల్దియా ఆదాయానికి ‘టెండర్‌’

మంచిర్యాల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీలో నిబంధనలు పాటిస్తూ బల్దియా ఆదాయం పెంచేందుకు కృషి చేయాల్సిన అధికారులు, పాలకవర్గ సభ్యులు తప్పుడు మార్గాలు అవలంభిస్తున్నారు. అధికారుల వైఖరి కారణంగా బల్దియా ఆదాయానికి గండి పడుతుండగా, ప్రైవేటు వ్యక్తులు కోట్లు గడిస్తున్నారు. రూ.లక్ష దాటిన ప్రతీ పనికి ఓపెన్‌ టెండర్లు ఆహ్వానించి పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉండగా, మంచిర్యాల మున్సిపాలిటీలో దశాబ్దాలుగా ఏకపక్ష నిర్ణయాలతో పనులు అప్పగించడం అనవాయితీగా వస్తోంది.

చికెన్‌ వ్యర్థాలకు టెండర్లు జరిగేనా...?

మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చికెన్‌ సెంటర్ల నుంచి వ్యర్థాలను సేకరిం చేందుకు విధిగా టెండర్లు ఆహ్వానించవలసి ఉంది. అయితే మంచిర్యాల మున్సిపాలిటీ చరిత్రలోనే చికెన్‌ వ్యర్థాలకు టెండర్లు పిలిచిన దాఖలాలు లేవు. టెండర్లు నిర్వహించకుండానే తమ అనుయాయులకు కాంట్రాక్టు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఇదే తంతు కొనసాగు తుండటంతో టెండర్ల రూపంలో మున్సిపాలిటీ పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోతుండగా, ప్రైవేటు వ్యక్తుల జేబులు నిండుతున్నాయి. అందుకు ప్రతిఫలంగా అధికారులు, పాలకవర్గం, ప్రజాప్రతినిధులకు కాంట్రాక్టరు నగదు బహుమతులు అందజేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆన్‌లైన్‌ టెండర్లు నిర్వహిస్తే ఎక్కువ కోట్‌ చేసిన ఏజెన్సీకి పనులు అప్పగించడం ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం దక్కేది. ఇదిలా ఉండగా పొరుగున ఉన్న రామగుండం కార్పొరేషన్‌లో చికెన్‌ వ్యర్థాల సేకరణకు ఇటీవల వేలం నిర్వహించారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపాలిటీలోనూ ఇటీవల వేలం నిర్వహించగా రూ.30 లక్షలకు కాంట్రాక్టర్‌ పని దక్కించు కోగా, మున్సిపాలిటీకి ఆ మొత్తం ఆదాయం సమకూరినట్లయింది. వివిధ మున్సిపాలిటీల్లో వేలం ద్వారానే చికెన్‌ వ్యర్థాలను అప్పగిస్తుండగా మంచిర్యాలలోనే ఏకపక్ష నిర్ణయాలతో వ్యవహరించడం గమనార్హం.

కాంట్రాక్టు కోసం రూ. 10 లక్షలు ఆఫర్‌...?

మంచిర్యాల మున్సిపాలిటీలో ఓపెన్‌ టెండర్లు లేకపోవడంతో అనధికా రికంగా కాంట్రాక్టు దక్కించుకొనేందుకు పలువురు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌ తనకు పనులు అప్ప గిస్తే ఏకంగా రూ.10 లక్షలు ఆఫర్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కొన్నేళ్ళుగా అనధికార కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఒకరు ఈ ఏడాది కూడా పనులు దక్కేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. చికెన్‌ వ్యర్థాలు తరలించే పని దక్కించుకొనేందుకు ఇతర కాంట్రాక్టర్లు కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 120 చికెన్‌ షాపులు ఉన్నట్లు అంచనా. వాటి నుంచి రోజుకు వందల క్వింటాళ్ల చికెన్‌ వ్యర్థాలు వెలువడుతుంటాయి. వాటిని సేకరించే కాంట్రాక్టర్‌ చేపల పెంపకం దారులకు విక్రయిస్తారు. మున్సిపాలిటీకి పైసా ఖర్చులేకుండా సంవత్సరానికి లక్షల ఆదాయం సమకూర్చే చికెన్‌ వ్యర్థాల పనులు ఈ ఏడాదైనా నిబంధనల మేరకు టెండర్లు నిర్వహించి అప్పగిస్తారో లేదో వేచి చూడాలి.

జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు....

జిల్లా వ్యాప్తంగా ఏడు మున్సిపాలిటీల్లోనూ చికెన్‌ వ్యర్థాల టెండర్లు ఆహ్వానించడం లేదు. ప్రధాన పట్టణాలైన మంచిర్యాలతోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, లక్షెట్టిపేట, మందమర్రిలలోనూ టెండర్లు ఆహ్వానించకపోవడం గమనార్హం. అన్ని చోట్లా ఏకపక్ష నిర్ణయాలతోనే పనులు అప్పగిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లోనూ ప్రస్తుతం చికెన్‌ సెంటర్లు వెలుస్తున్నాయి. టెండర్లు ఆహ్వానించకపోవడంతో ఆయా మున్సిపాలిటీలు, మండలాలు పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోతున్నాయి. చికెన్‌ వ్యర్థాలకు ఆన్‌లైన్‌ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి సర్కులర్‌ జారీ అయినప్పటికీ ఆ దిశగా పాలకవర్గాలు, అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చికెన్‌ వ్యర్థాల సేకరణకు ఆన్‌లైన్‌ టెండర్లు నిర్వహించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

టెండర్లు ఆహ్వానిస్తాం

మారుతిప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌

చికెన్‌ వ్యర్థాల సేకరణ టెండర్ల విషయమై దృష్టి సారించలేదు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ టెండర్లు ఆహ్వానించాల్సి ఉంది. ఈ విషయమై చైర్మన్‌తో సంప్రదింపులు జరిపి నిబంధనల మేరకు టెండర్లు ఆహ్వానిస్తాం.

Updated Date - Jul 05 , 2024 | 11:04 PM