Share News

కుదేలవుతున్న మట్టి పైపుల పరిశ్రమ

ABN , Publish Date - Apr 21 , 2024 | 10:32 PM

మట్టి పైపుల పరిశ్రమ మసకబారుతోంది. ఆధునిక కాలంలో గృహ నిర్మాణంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. త్వరిత గతిన పనులు పూర్తయ్యేలా నిర్మాణంలో సరికొత్త వస్తు సామగ్రిని ఉప యోగిస్తున్నారు.

కుదేలవుతున్న  మట్టి పైపుల పరిశ్రమ

ఏసీసీ, ఏప్రిల్‌ 21: మట్టి పైపుల పరిశ్రమ మసకబారుతోంది. ఆధునిక కాలంలో గృహ నిర్మాణంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. త్వరిత గతిన పనులు పూర్తయ్యేలా నిర్మాణంలో సరికొత్త వస్తు సామగ్రిని ఉప యోగిస్తున్నారు. ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం చేపట్టే పనుల్లో గతంలో మట్టి పైపులను వాడేవారు. ప్రస్తుతం గృహ నిర్మాణం, అపార్టుమెంట్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, లే అవుట్‌ వెం చర్‌ డ్రైనేజీ పనుల్లో మట్టి పైపులకు బదులుగా ప్లాస్టిక్‌ పైపులను వినియోగిస్తున్నారు. దీంతో మట్టి పైపుల పరిశ్రమ కుదేలవుతోంది.

-జిల్లాలో 26 మట్టి పరిశ్రమలు

మంచిర్యాల జిల్లాలో 26 మట్టి పైపుల పరిశ్రమలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 36 పరిశ్రమలు ఉంటే అందులో జిల్లాలోనే అధికంగా ఉన్నా యి. పైపులు తయారు చేయడానికి ఉపయోగించే నాణ్యమైన మట్టి జిల్లా చుట్టు పక్కల ప్రాంతాల్లో లభిస్తోంది. పైపులను కాల్చడానికి వాడే బొగ్గు అందుబాటులో ఉంది.

-ప్లాస్టిక్‌ పైపుల వాడకంతో మందగించిన అమ్మకాలు

ప్లాస్టిక్‌ పైపుల వాడకంతో మట్టి పైపుల అమ్మకాలు మందగించాయి. మట్టి పైపులతో పోల్చితే ప్లాస్టిక్‌ పైపులను భూమిలో వేయడం (లేయింగ్‌ ) సులువు. ప్లాస్టిక్‌ పైపులు మట్టి పైపుల కంటే పొడవుగా ఉండడంతో పని త్వరగా పూర్తవుతుంది. బరువు కూడా తక్కువగా ఉండడంతో ఫంబర్‌లకు సులువుగా అమర్చవచ్చు. మట్టి పైపులతో పోల్చితే ప్లాస్టిక్‌ పైపుల మన్నిక కాలం తక్కువగా ఉంటుంది. మట్టి పైపులు భూమిలో వేశాక వంద సంవత్సరాలు అయినా చెక్కు చెదరవు.

ప్లాస్టిక్‌ పైపులకు వెచ్చించే ధరలో సగం ధరకే మట్టి పైపులు వస్తాయి. మట్టి పైపులను ఎలుకలు, పంది కొక్కులు, చెదలు మరే ఇతర సూక్ష్మ క్రీములు కూడా పాడుచేయలేవు. డ్రైనేజీ నీటిలో ఉండే క్షారాలు కూడా మట్టి పైపులను పాడు చేయలేవు.

- పర్యావరణానికి కీడు చేయవు

మట్టి పైపుల తయారీ విధానం పూర్తిగా పర్యావరణహితంగా ఉం టుంది. బంకమట్టిని మెత్తగా గ్రైండింగ్‌ చేసి నీటితో కలిపి పైపులను తయారు చేస్తారు. పైపులను ఆరబెట్టిన తర్వాత కిలన్‌లో 1050 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వేడిలో కాలుస్తారు. దాని వల్ల మట్టి పైపుల్లో రసాయన చర్య జరిగి ధృఢంగా తయారవుతాయి. ఈ పైపులను డ్రైనేజీ నీరు, ఇతర వ్యర్ధాలను పంపేందుకు వాడుతారు. పైపులను భూమిలో వేశాక రంధ్రాలు పడడం, పగుళ్లు ఏర్పడడం జరగదు.

-మూసివేత దిశగా పరిశ్రమలు

మట్టి పైపుల అమ్మకాలు మందగించడంతో పరిశ్రమలు మూసివేసే స్థితికి చేరుకున్నాయి. మట్టి పైపుల పరిశ్రమలన్నీ చిన్న తరహా పరిశ్రమలుగా ఎక్కువ మంది కార్మికులు తక్కువ మిషనరీతో శ్రమ శక్తిపై ఆధారపడి నడుస్తున్నాయి. జిల్లాలో ఈ పరిశ్రమలపై ఆధారపడి ప్రత్యక్షంగా 4 వేల మంది, పైపుల లోడింగ్‌, అన్‌లోడింగ్‌, పైపులను ఫ్యాక్టరీ నుంచి వినియోగదారులకు చేరవేయడం, ముడి సరుకులను ఫ్యాక్టరీకి రవాణా తదితర పనుల్లో పరోక్షంగా 15 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వానికి విద్యుత్‌ బిల్లులు, పన్నుల రూపేణా ఆదాయం సమకూరుతుంది.

ఉత్పత్తి నిలిపివేసిన పరిశ్రమలు

జనవరి వరకు జిల్లాలో మట్టి పైపుల విక్రయాలు నెలకు రూ. 10 కోట్ల టర్నోవర్‌ నమోదు కాగా, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ. 2 కోట్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. ఏప్రిల్‌ నెలలో ఒక కోటి రూపాయల వరకు మాత్రమే అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో పైపుల ఉత్పత్తిని నిలిపివేశారు. పాత స్టాక్‌ను మాత్రమే విక్రయిస్తున్నారు. ఉత్పత్తిని నిలిపివేయడంతో 80 శాతం మంది కార్మికులు ఇంటి బాట పట్టారు. పని చేస్తున్న కొద్దిమందికి కూడా సమయానికి జీతాలు ఇవ్వలేని స్థితిలో యాజమాన్యాలు ఉన్నాయి.

ప్రభుత్వం ఆదుకోవాలి

- పి.వరప్రసాదరావు, మట్టి పైపుల ఉత్పత్తిదారుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

మట్టి పైపుల పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి. పర్యావరణానికి ఎలాంటి హానీ చేయని మట్టి పైపులను ఉపయోగించేలా ఆదేశాలు జారీచేయాలి. జీహెచ్‌ఎంసీ, కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, గ్రామపంచా యతీలు, అనుమతి పొందిన లే అవుట్‌ వెంచర్లలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు మట్టి పైపులను వినియోగించాలి. చిన్న తరహా పరిశ్రమ అయిన మట్టి పైపుల పరిశ్రమలు మూతపడకుండా ప్రభుత్వం కాపాడాలి.

Updated Date - Apr 21 , 2024 | 10:32 PM