Share News

నకిలీ విత్తనాలు అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు

ABN , Publish Date - Feb 15 , 2024 | 10:14 PM

వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సం క్షేమం, భూకమతాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని, జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడంలో క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు.

నకిలీ విత్తనాలు అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 15: వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సం క్షేమం, భూకమతాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని, జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడంలో క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయాధికారులు, విస్తరణ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ మండల విస్తరణ అధికారులు వారి పరిధిలో భూకమతాలను నిరంతరం పర్య వేక్షిస్తూ వ్యవసాయ రంగంలో రైతులకు తగిన మెలకువలు అందించాలని, నకిలీ విత్తనాల నియంత్రణపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పంటలు, ఫర్టి లైజర్‌ షాపులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, స్టాక్‌ నిల్వల రిజిష్టర్‌లు, నిల్వలను పరిశీలించాలని, పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అధిక ధరలకు విక్రయించినా, నిర్వహణ సక్రమంగా లేకపోయినా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు సస్పెండ్‌ చేస్తామన్నారు. జిల్లా వ్యవసాయా ధికారి కల్పన, మండల వ్యవసాయాధికారులు, విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలి

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. బదిలీల్లో భాగంగా జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన అధికారులు, ఉద్యోగులు మర్యాద పూర్వకంగా కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బదిలీపై జిల్లాకు వచ్చిన అధికారులు, ఉద్యోగులు విధుల్లో నిబద్దత కలిగి ఉండాలని, ప్రజలతో జవాబుదారితనంగా వ్యవహరించాలన్నారు. వివిధ సమస్యల పరిష్కా రానికి వచ్చే ఆర్జీదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, స్వీకరించిన ఆర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 10:14 PM