Share News

మొదలైన నామినేషన్ల పర్వం

ABN , Publish Date - Apr 18 , 2024 | 10:59 PM

పార్లమెంట్‌ ఎన్నికలకు సం బంధించి గురువారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి నలుగురు స్వతంత్ర అభ్య ర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్నికలకు సంబంధించి గత నెల 16న కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేయగా, ప్రధాన పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి.

మొదలైన నామినేషన్ల పర్వం

మంచిర్యాల, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ ఎన్నికలకు సం బంధించి గురువారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి నలుగురు స్వతంత్ర అభ్య ర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్నికలకు సంబంధించి గత నెల 16న కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేయగా, ప్రధాన పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. షెడ్యూల్‌ ప్రకారం గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రి య ప్రారంభం కాగా, ఈ నెల 25 వరకు రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించనున్నారు. మే 13న లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనుండగా, జూన్‌ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

నేడు ప్రధాన పార్టీల అభ్యర్థులు దాఖలు

పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులు గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్‌), గొమాసే శ్రీనివాస్‌ (బీజేపీ), కొప్పుల ఈశ్వర్‌ (బీఆర్‌ఎస్‌)లు తమ నామినేషన్ల దాఖలుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ముగ్గురు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు శుక్రవారం తొలి సెట్‌ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అలాగే ఈ నెల 21, 24 తేదీలలో మరో సెట్‌ నామినేషన్లను దాఖలు చేయనున్నట్లు ప్రధాన పార్టీల అభ్యర్థులు తెలిపారు.

నిఘా ముమ్మరం...

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల కమిషన్‌ నిఘా ముమ్మరం చేసింది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎన్నికల ప్రచారం సరళిపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు. నగదు, బహుమతుల పంపకం, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను అడ్డుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై ఎన్నికల నియమావళి కింద కేసులు నమోదు చేయనున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం కేంధ్ర ఎన్నికల కమిషన్‌ అజమాయిషీ కిందకు వెళ్లడంతో ఆంక్షలు పటిష్టంగా అమలు చేయనున్నారు.

పోలింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు...

లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు గేటెడ్‌ కమ్యూనిటీలు, ఆర్‌డబ్ల్యుఏల ప్రతినిధులతో ఓటింగ్‌పై అవగాహన, 22 నుంచి 28 వరకు సహాయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే 29 నుంచి మే 5 వరకు వాక్‌ టూ పోలింగ్‌ స్టేషన్‌, 5కే రన్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 6 నుంచి 12వ తేదీ వరకు ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌తో విద్యార్థులు, వాట్సాప్‌ గ్రూపులు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌తో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు కృషి చేయనున్నారు.

పూర్తయిన సిబ్బంది నియామకం

లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లాలో అవసరమైన సిబ్బంది నియామకం పూర్తయింది. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల శాసనసభ నియోజక వర్గాల పరిధిలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం మొత్తం 4429 మంది సిబ్బంది నియామకం పూర్తి చేశారు. వీరిలో 1131 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 1111 మంది సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, 2187 మంది ఇతర ప్రిసైడింగ్‌ అధికారులను నియమించారు. పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన శిక్షణను ఇప్పటికే పూర్తి చేశారు.

Updated Date - Apr 18 , 2024 | 10:59 PM