Share News

చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Jan 30 , 2024 | 10:28 PM

జిల్లాలోని మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపాలిటీల చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమమైంది. ఫిబ్రవరి 9న సమావేశం నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్‌ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లయింది.

చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

మంచిర్యాల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపాలిటీల చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమమైంది. ఫిబ్రవరి 9న సమావేశం నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్‌ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లయింది. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముందుగా మున్సిపాలిటీలను కైసవం చేసుకోవడమే లక్ష్యంగా ఎమ్మెల్యే చేరికలను ప్రోత్సహించడంతో బల్దియాల్లో కాంగ్రెస్‌ సభ్యుల మెజార్టీ పెరిగింది.

అవిశ్వాస పరీక్షలో నెగ్గడంతో...

మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస పరీక్షలో నెగ్గడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. మంచిర్యాలలో ఈ నెల 11న అవిశ్వాసం ప్రవేశపెట్టగా, నస్పూర్‌లో 12వ తేదీన అవిశ్వాస తీర్మానం చేశారు. రెండు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం నెగ్గిన కారణంగా మంచిర్యాల మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ గాజుల ముకేష్‌ గౌడ్‌, నస్పూర్‌ చైర్మన్‌ ఈసంపెల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌లు పదవీచ్యుతులు కాగా వారి స్థానంలో కొత్తవారిని ఎన్ను కోవలసి ఉంది. రెండు మున్సిపాలిటీల్లో అవిశ్వాసం నెగ్గడంతో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అఽధికారి బదావత్‌ సంతోష్‌ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎలక్షన్‌ కమిషన్‌కు సమాచారం అందించారు. దీంతో ఫిబ్రవరి 9న రెండు మున్సిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల పదవులకు ఎన్నికలు నిర్వహించేలా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది.

ముందస్తు రాజీనామాలు....

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య పెరగడంతో బల నిరూపణ పరీక్షల్లో ఓటమి తప్పదని గ్రహించిన మంచిర్యాల చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు ప్రత్యేక సమావేశానికి ముందే వారి పదవులకు రాజీనామా చేశారు. నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ప్రభాకర్‌ తన పదవికి రాజీనామా చేయకపో వడంతో అవిశ్వాస పరీక్షలో ఓటమి పాలుకావడంతో పదవీచ్యుతుడ య్యారు. అక్కడి వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే సూచనల మేరకు ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో అవిశ్వాస తీర్మానం నుంచి తప్పించుకున్నారు.

హస్తగతం లాంఛనమే....

మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపాలిటీల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి కాంగ్రెస్‌ సభ్యుల మెజార్టీ ఎక్కువగా ఉండటంతో రెండు మున్సిపాలిటీలు హస్తగతం కావడం లాంఛనమే కానుంది. మంచిర్యాల మున్సిపల్‌ చైర్మన్‌గా 30వ వార్డు కౌన్సిలర్‌ డాక్టర్‌ రావుల ఉప్పలయ్య, వైస్‌ చైర్మన్‌గా 2వ వార్డు కౌన్సిలర్‌ సల్ల మహేష్‌లు, నస్పూర్‌ మున్సిపాలిటీలో చైర్మన్‌గా సురిమిల్ల వేణు, వైస్‌ చైర్‌పర్సన్‌గా గెల్లు రజిత ఎన్నికయ్యే అవకాశం ఉంది.

మిగతా చోట్లా అవిశ్వాసాలు...

మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపాలిటీలతో పాటు లక్షెట్టిపేట, క్యాతనపల్లి, బెల్లంపల్లిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లపై సభ్యులు అవిశ్వాసం కోసం నోటీసులు ఇచ్చారు. వీటిలో మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాగా, మిగతా చోట్ల త్వరలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి. లక్షెట్టిపేటలో కాంగ్రెస్‌ సభ్యులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లపై అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వగా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ సభ్యులే అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ లను గద్దె దించేందుకు ఆ పార్టీ కౌన్సిలర్లే రంగం సిద్ధం చేయగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా, ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యులు ఉండేవారు. ఇటీవల 11 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 13కు పెరిగింది. మున్సిపాలిటీలో ఇప్పటికే అవిశ్వాస నోటీసు ఇచ్చిన కారణంగా ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయితే మెజార్టీ సభ్యులు కాంగ్రెస్‌లో ఉన్నందున క్యాతనపల్లి కూడా హస్తగతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. లక్షెట్టిపేట, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌ జెండా ఎగిరే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Jan 30 , 2024 | 10:28 PM