Share News

వానాకాలం పంటల ప్రణాళిక ఖరారు

ABN , Publish Date - May 23 , 2024 | 10:30 PM

ఈ ఏడాది వానాకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధంచేశారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో సాగు విస్తీర్ణం పెరగనుంది. గతేడాది 3,35,517 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా.. ఈ సారి జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం 3.42 లక్షల ఎక రాలకు పెరగుతుందని అంచనా వేశారు.

వానాకాలం పంటల ప్రణాళిక ఖరారు

నెన్నెల, మే 23: ఈ ఏడాది వానాకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధంచేశారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో సాగు విస్తీర్ణం పెరగనుంది. గతేడాది 3,35,517 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా.. ఈ సారి జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం 3.42 లక్షల ఎక రాలకు పెరగుతుందని అంచనా వేశారు. 40,454 క్వింటాళ్ల రాయితీ విత్త నాలు, 1,18,997 టన్నుల ఎరువులు అవసరంగా గుర్తించారు. కావాల్సిన ఎరువుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. రూ. 1970 కోట్లు పంట రుణ పరిమితిగా నిర్ణయించారు.

-సన్నాహక పనులు జోరు

వానాకాలం సీజన్‌ కోసం రైతులు సన్నద్ధమయ్యారు. అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో సాగు పనులు మొదలవుతున్నాయి. ఇన్నాళ్లు దుక్కిదున్నే పనులు మొదలయ్యాయి. శుభ్రం చేసుకున్న చేలు, పొలాల్లో సేంద్రియ ఎరువులను చల్లుకుంటున్నారు. వరి పొలాల్లో పచ్చి రొట్ట ఎరువుల కోసం జనుము, జీలుగ విత్తనాలు చల్లుకునేందుకు కల్టివేటర్‌తో దున్నుకుంటున్నారు. పత్తి, వరి విత్తనాలు ఎరువులు, కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. వర్షాలు కురిస్తే మే ఆఖరు వారంలో పత్తి విత్తనాలు వేయడం ప్రారంభిస్తామని రైతులంటున్నారు. పొడి దుక్కుల్లో విత్తనాలు వేసుకుంటే తొలకరి జల్లులకే మొలుస్తాయని రైతులు పేర్కొన్నారు.

-వరి, పత్తి.. ప్రధాన పంటలు

జిల్లాలో వానకాలంలో వరి, పత్తి ఎక్కువగా సాగు చేస్తారు. బెల్లంపల్లి, భీమిని, చెన్నూరు, మంచిర్యాల వ్యవసాయ డివిజన్‌లలో 3,42,895 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనాకొచ్చారు. వరి 1,61,958 ఎకరాలు, పత్తి 1,62,094 ఎకరాలు, పెసర 231 ఎకరాలు, కందులు 1,787 ఎకరాలు, మక్క 413 ఎకరాలు, ఇతర పంటలు 16,351 ఎకరాల్లో సాగవు తాయని అంచనాలు రూపొందించారు. సీజన్‌లో వరి పంట అంచనాలకు మించి సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వరికి క్వింటాలుకు రూ.500 బోనస్‌గా ఇస్తామని ప్రకటించడంతో వరి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధరకు అదనంగా మరో రూ. 500లు బోనస్‌గా కలిస్తే గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. వరికి బదులు అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ దృష్ట్యా పత్తి పంట వేయాలని అధికారులు సూచిస్తున్నారు.

- అందుబాటులో విత్తనాలు..

జిల్లాలో అవసరమైన విత్తనాల కోసం అధికారులు అంచనాలు రూపొం దించారు. వివిధ పంటల విత్తనాలు మొత్తం 34,967 క్వింటాళ్లు అవ సరంగా గుర్తించారు. పత్తి 3,78,305 ప్యాకెట్లు, వరి 34,854 క్వింటాళ్లు, పెసర 23 క్వింటాళ్లు, కందులు 62 క్వింటాళ్లు, మక్కలు 24 క్వింటాళ్లు అవసరం అవతాయని అంచనాకు వచ్చారు. జిల్లాలో 80 శాతం రైతులు వరిలో సన్నాలైన సూపర్‌ ఫైన్‌ రకాలనే పండిస్తారు. దొడ్డు రకాలతో పాటు, బతుకమ్మ లాంటి సన్నాల విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. పచ్చిరొట్ట విత్తనాలు 60 శాతం రాయితీపై అందుబాటులో ఉన్నాయి. ఈ పాటికే జీలుగ, జనుము విత్తనాలను కావాల్సిన వారికి వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీ చేస్తున్నారు.

-ఎరువుల అవసరం ఇలా

వానాకాలం పంటలకు జిల్లాకు 1,18,947 మెట్రిక్‌ టన్నుల ఎరువుల వినియోగం ఉంటుందని అంచనా వేశారు. యూరియా 41,661 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 21,901 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 38,504 మెట్రిక్‌ టన్నులు, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ 9,623 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 5,476 మెట్రిక్‌ టన్నులు, జింక్‌ సల్ఫేట్‌ 1,832 మెట్రిక్‌ టన్నులకు ఇండెంట్‌లు పెట్టారు. సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా ఇప్పటి నుంచే గ్రామాలకు ఎరువులను తరలిస్తున్నారు. నానో ఫర్టిలైజర్స్‌ వినియోగం పెరిగేలా అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. ద్రవ రూపంలో వస్తున్న నానో ఎరువులతో తక్కువ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణంలో చల్లుకోవచ్చని అధికారులు అంటున్నారు.

Updated Date - May 23 , 2024 | 10:30 PM