Share News

ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:14 PM

వేసవి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గత ఏడాదితో పోల్చితే సుమారు 20 రోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభిం చారు. దీంతో గతంలో లాగా రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాయా ల్సిన అవసరం లేకుండా పోయింది.

ఊపందుకున్న   ధాన్యం కొనుగోళ్లు

మంచిర్యాల, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): వేసవి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గత ఏడాదితో పోల్చితే సుమారు 20 రోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభిం చారు. దీంతో గతంలో లాగా రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాయా ల్సిన అవసరం లేకుండా పోయింది. కోసిన వరి పంటను ఆరబెట్టి, కల్లాల కు తరలించిన వెంటనే నిర్వాహకులు జాప్యం లేకుండా కాంటా ఏర్పాటు చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంటను సాగు చేయడం ఒకెత్తయితే... దాన్ని అమ్ముకోవడం రైతులకు శాపంగా మారేది. అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కల్లాలకు తరలిస్తే 20 రోజులకు మించి పడిగాపులు కాసేవారు. కల్లాల్లో ఉంచిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇంటిల్లిపాది శ్రమించే వారు. ఈ యేడు అధికారుల ముందస్తు ప్రణాళికలతో రైతులకు ఇబ్బం దులు తొలగిపోగా, ఐదారు రోజులలోపే నగదు ఖాతాలో జమ అవుతోంది.

ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

జిల్లా వ్యాప్తంగా 262 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారులు ముందస్తు ప్రణాళికలతో 20 రోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో గతంలో ఉన్న డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలను తొలగించిన అధికారులు పూర్తిగా ఐకేపీ మహిళలకే నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. నియోజ కవర్గంలో ఏర్పాటు చేసిన 77 ఐకేపీ కేంద్రాల్లో మహిళలు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాల్లోనూ ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తూకంలో అవకతవకలకు చెక్‌

కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడంలో అవకతవకలకు చోటు లేకుండా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అవసరమైన చర్యలు చేపడుతు న్నారు. గతంలో డీసీఎంఎస్‌ కేంద్రాల్లో 40 కేజీల గన్నీ బ్యాగుపై అద నంగా రెండు మూడు కిలోల ధాన్యాన్ని నిర్వాహకులు తూకం వేశారు. అలా అదనంగా తూకం వేసిన ధాన్యం నిర్వాహకుల ఖాతాల్లోకి వెళ్లేది. 40 కిలోలపై రైతుకు సుమారు రూ. 100 నష్టం వాటిల్లేది. ప్రస్తుతం 40 కేజీల బ్యాగుపై కేవలం ఒక కిలో మాత్రమే అదనపు తూకం వేస్తున్నారు. గన్నీ సంచి బరువు కింద కిలో తూకం వేస్తుండటంతో రైతుకు 40 కిలోల దాన్యమే లెక్కలోకి వస్తుంది. రైతుకు నష్టం కలుగకుండా చర్యలు చేపడుతున్నారు. ధాన్యంలో తాలు అధికంగా ఉన్నచోట 100 నుంచి 500 గ్రాముల వరకు అదనంగా తూకం వేస్తున్నప్పటికీ, రైతులు తూర్పారబట్టి తీసుకొస్తే నష్టం వాటిల్లకుండా ఉండే అవకాశం ఉంది. రైస్‌మిల్లులో ్లనూ ధాన్యం అన్‌లోడింగ్‌ సందర్భంగా నిర్వాహకులు ఎలాంటి కోతలు విధించడం లేదు.

మిల్లర్లతోనే అసలు సమస్య

ధాన్యాన్ని కల్లాలకు తరలించి, విక్రయించడం వరకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, కల్లాల నుంచి రైస్‌ మిల్లులకు తరలించడంలోనే అసలు సమస్య తలెత్తుతోంది. రైస్‌ మిల్లుల్లో అవసరం మేరకు కూలీలు లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడుతోంది. కల్లాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని లారీల్లో రైస్‌మిల్లులకు తరలించి నిలువ చేస్తారు. అలా మిల్లులకు తరలించిన ధాన్యాన్ని త్వరగా అన్‌లోడ్‌ చేయ డం లేదు. ఒక్కోసారి 24 గంటల పాటు లారీలు పదుల సంఖ్యలో మిల్లుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కల్లాల్లో కాంటా వేసిన ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోంది. కల్లాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి, సరియైన సమయంలో నిర్వాహకులు తూకం వేయలేకపోతున్నారు. ఈ విషయమై అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ గురువారం మంచిర్యాల నియోజక వర్గంలోని పలు కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లుల్లో చేపట్టిన క్షేత్రస్థాయి తనిఖీల్లో వెల్లడైంది. ధాన్యం తూకం వేయడం, మిల్లుల్లో అన్‌లోడింగ్‌ సమయంలోనూ అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని అదనపు కలెక్టర్‌ నిర్వాహకులను హెచ్చరించారు. అన్‌లోడింగ్‌ సమయంలో అవసరం మేరకు కూలీలను అందుబాటులో ఉంచాలని మిల్లర్లకు సూచించారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

మోతీలాల్‌, అదనపు కలెక్టర్‌

కల్లాలకు తరలించి, తూకంలో జాప్యం కారణంగా అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే ప్రభుత్వపరంగా పూర్తి బాధ్యత వహిస్తాం. వర్షాలకు తడిసిన ధాన్యానికి గ్రేడును బట్టి పూర్తి స్థాయి ధరలు చెల్లించి కొనుగోలు చేస్తాం. ఈ విషయంలో రైతులు ఎలాంటి అభద్రతా భావానికి లోను కావలసిన అవసరం లేదు. తడిసిన ధాన్యాన్ని సేకరించి, వెంటనే బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు తరలిస్తాం. ఏదైనా సమస్య తలెత్తితే సమాచారం ఇస్తే తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటాం.

Updated Date - Apr 25 , 2024 | 11:14 PM