Share News

పొగాకు ఉత్పత్తుల్లో భారీ కల్తీ

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:36 PM

జిల్లాలో నకిలీ దందా జోరుగా సాగుతోంది. నిత్యావసర సరుకులతోపాటు పొగాకు ఉత్పత్తులను భారీగా కల్తీ చేస్తున్న అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారు. జీరో వ్యాపారం కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుండగా, పొగాకు ఉత్పత్తులకు అలవాటైన ప్రజల ఆరోగ్యం, జేబులు గుళ్ల అవుతున్నాయి.

పొగాకు ఉత్పత్తుల్లో భారీ కల్తీ

మంచిర్యాల, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నకిలీ దందా జోరుగా సాగుతోంది. నిత్యావసర సరుకులతోపాటు పొగాకు ఉత్పత్తులను భారీగా కల్తీ చేస్తున్న అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారు. జీరో వ్యాపారం కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుండగా, పొగాకు ఉత్పత్తులకు అలవాటైన ప్రజల ఆరోగ్యం, జేబులు గుళ్ల అవుతున్నాయి. జిల్లాలో నిత్యం కోట్ల రూపాయల అక్రమ దందా జరుగుతుండగా అధికారులు, అనధికారులకు పెద్ద మొత్తంలో వాటాలు అందుతున్నట్లు తెలుస్తోంది.

చట్టబద్దత చేసినప్పటి నుంచి

ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులైన అంబార్‌, గుట్కాల విక్రయాలకు గతంలో నిషేధం ఉండేది. దీంతో ఒరిజినల్‌ ఉత్పత్తులను బహిరంగంగా విక్రయించేందుకే అష్టకష్టాలు పడాల్సివచ్చేది. మూడేళ్లుగా ఆయా ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేయడంతో అక్రమార్కులకు కలిసి వచ్చినట్లయింది. అక్రమార్కులు ఆయా ఉత్పత్తులను కల్తీ చేస్తూ జీరో దందాకు తెరలేపారు. జిల్లా వ్యాప్తంగా ఈ అక్రమ వ్యాపారం ప్రస్తుతం నలుమూలలా విస్తరించింది. అసలు ఉత్పత్తులతో పోలిస్తే, ఏ మాత్రం తేడా ఉండని నకిలీ సరుకులను రిటైల్‌ షాపులకు తరలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అక్రమ దందా కారణంగా ప్రభుత్వ ఖజనాకు భారీ గండి పడుతుండగా, వినియోగదారులు నిలువునా మోసపోతున్నారు.

నకిలీ ఉత్పత్తులతో వ్యాపారం...

సిగరెట్‌, అంబార్‌, తదితర బ్రాండ్లను పోలిన నకిలీ ఉత్పత్తులను ఇతర ప్రాంతాల నుంచి రహస్యంగా దిగుమతి చేసుకుంటున్న వ్యాపా రులు, వాటిని గుట్టుచప్పుడు కాకుండా మార్కెటింగ్‌ చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టాణాలు, జనసంచారం కలిగిన ప్రాంతాలను ఎంచుకుంటున్న వ్యాపారులు అసలు వాటితో కలిపి నకిలీ సరుకులను చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో బాగా నడిచే పాన్‌ షాపులు, చాయ్‌ కొట్లు, కిరాణా షాపులను ఎంచుకుంటూ వాటి ద్వారా నకిలీ ఉత్పత్తుల విక్రయాలు జరుపుతున్నారు. మార్కెట్లో విరివిగా అమ్ముడయ్యే కింగ్స్‌, లైట్స్‌, గోల్డ్‌ఫ్లాక్‌ సిగరెట్లతోపాటు అంబార్‌, అనార్‌, తదితర రకాలలో అధికంగా నకిలీ సరుకులు అంటగడుతున్నట్లు సమా చారం. ప్యాకెట్లపై లోగో, క్యాప్షన్‌, లోపలి సరుకు అచ్చం ఒరిజినల్‌ లాగే కనపడుతుండగా ప్యాకెట్లు, వాటిపై తయారీ తేదీలు ముద్రించడంలో తేడాలుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నకిలీ సిగరెట్లలో వాడే పొగాకు పూర్తిగా నాసిరకం ఉపయోగిస్తున్నట్లు సమాచారం. దీంతో వ్యస నపరులు అనారోగ్యం పాలు అవుతుండగా, జేబులు గుళ్ల చేసుకుంటున్నారు.

నకిలీ ఉత్పత్తులపై అధిక కమీషన్‌....

నకిలీ ఉత్పత్తులను వినియోగదారులకు అంటగట్టే పాన్‌షాపులు, కిరాణ దుకాణాల నిర్వాహకులకు అధిక మొత్తంలో కమీషన్లు అందజేస్తు న్నట్లు తెలుస్తోంది. ఒరిజినల్‌ సిగరెట్‌ పెట్టెపైౖ విక్రేతలకు గరిష్టంగా రూ.1.50 పైసలు లాభం ఉండగా, నకిలీ ఉత్పత్తులపై ఐదారు రూపా యలు లాభాలు ఉంటాయని సమాచారం. ఒక్కో పాన్‌షాపు, కిరాణా దుకాణం, టీ కొట్లలో తక్కువలో తక్కువ నిత్యం సగటున రూ. 20వేల వరకు పొగాకు ఉత్పత్తుల విక్రయాలు సాగిస్తుంటారని అంచనా. అలా అధిక లాభాలకు అలవాటుపడ్డ కొందరు పాన్‌షాపులు, కిరాణా దుకా ణాల నిర్వాహకులు అసలు స్థానంలో నకిలీలు అంటగడుతున్నట్లు తెలు స్తోంది. కేవలం పొగాకు ఉత్పత్తులు విక్రయించేందుకే ప్రధాన పట్టణాల్లో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారంటే అతశయోక్తికాదు. టీ కొట్ల పేరుతో అడ్డాలు నెలకొల్పుతూ లోపల ప్రత్యేక గదులు, పొగ తాగేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో నిత్యం వందలాది మంది కేవలం సిగరెట్లు తాగేందుకు వెళ్తుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

మంచిర్యాల కేంద్రంగా....

మంచిర్యాల పట్టణ కేంద్రంగా నకిలీ పొగాకు ఉత్పత్తుల వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రంలోనే నకిలీ ఉత్పత్తులు లభ్యమయ్యే దాదాపు పది వరకు అడ్డాలున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే మార్కెట్‌ రోడ్‌లో గల ఓ బడా టేడ్రర్స్‌లో ఈ అక్రమ దందా జోరుగా సాగుతుండగా, స్టేషన్‌ రోడ్డులోనూ మరో ట్రేడర్స్‌లో జీరో వ్యాపారం యథేచ్ఛగా నడుస్తోంది. అలాగే ఎలాంటి బోర్డులు పెట్టకుండా నేరుగా పాన్‌షాప్‌లే లక్ష్యంగా పొగాకు ఉత్పత్తులు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తి నకిలీ సరుకును పెద్ద మొత్తంలో అంటగడు తున్నట్లు సమాచారం. ఒరిజినల్‌ పేరిట బహిరంగంగా నకిలీ సరుకులు విక్రయిస్తున్నా అడిగేవారు కరువయ్యారు. జీరో బిజినెస్‌ చేసే వారు తమ సంపాదనలో ఎవరి వాటాలు వారికి ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పాన్‌ షాపు నుంచి నెలకు రూ.10వేలు మామూళ్ల పేరిట వసూలు చేస్తున్నట్లు బహిరంగంగా ప్రచారం జరుగుతోంది. అధికారులు చొరవ చూపి అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతున్నారు.

Updated Date - Apr 12 , 2024 | 10:36 PM