Share News

Kumaram Bheem Asifabad: విత్తన మాఫియాకు అడ్డుకట్ట పడేనా?

ABN , Publish Date - Apr 06 , 2024 | 10:29 PM

బెజ్జూరు, ఏప్రిల్‌ 6: జిల్లాలో కొన్నేళ్లుగా నకిలీ విత్తనాల వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. దాన్ని అరికట్టే చర్యలు లేని కారణంగా నకిలీ విత్తన మాఫియా చెలరేగిపోతోంది. దీంతో రైతులు వారు చెప్పే మాటలు నమ్మి నిలువునా మోసపోతున్నారు.

Kumaram Bheem Asifabad: విత్తన మాఫియాకు అడ్డుకట్ట పడేనా?

- పొరుగు రాష్ర్టాల నుంచి నకిలీ పత్తి విత్తనాలు

- ఏటా సీజన్‌లో ఇదే తంతు

- అప్రమత్తంగా లేకపోతే మళ్లీ గతేడాది పరిస్థితే

- కొత్త ప్రభుత్వమైనా దృష్టిసారిస్తే రైతులకు మేలు

బెజ్జూరు, ఏప్రిల్‌ 6: జిల్లాలో కొన్నేళ్లుగా నకిలీ విత్తనాల వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. దాన్ని అరికట్టే చర్యలు లేని కారణంగా నకిలీ విత్తన మాఫియా చెలరేగిపోతోంది. దీంతో రైతులు వారు చెప్పే మాటలు నమ్మి నిలువునా మోసపోతున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొన్న సీడ్‌ మాఫియా వారికి నకిలీ విత్తనాలు అంటగట్టి లక్షలు గడిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారన్న చందంగా విత్తన మాఫియాపై టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో చర్యలకు శ్రీకారం చుట్టిన అధికారులు కేవలం దాడులకే పరిమితమవుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఫెయిల్యూర్‌, నకిలీ, నాణ్యత లేని విత్తనాలకు సంబంధించి తయారీదారులు, అమ్మకందారులు, రవాణాదారులపై కేవలం చీటింగ్‌ కేసులతోనే సరిపెడుతుండటంతో దళారులు ఏటా రెచ్చిపోతున్నారు. కొన్నేళ్లుగా జిల్లాలో నకిలీ పత్తివిత్తనాలను రైతులకు అంటగట్టి లక్షలు ఆర్జిస్తున్నారు. నకిలీ పత్తివిత్తనాలు సరఫరా చేసే వ్యక్తులపై మామూలు కేసులే బనాయిస్తుండటంతో అక్రమార్కులు ఒక్కరోజులోనే బెయిల్‌పై విడుదలై యథేచ్ఛగా తిరుగుతూ యథావిధిగా అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు అధికారులు చేస్తున్న దాడుల్లో అక్రమార్కులు పట్టుబడ్డా కేవలం చిన్నాచితక వ్యాపారులే దొరకడం వారిపైన చిన్న కేసులు నమోదు చేయడమే తప్ప పెద్ద కేసులు లేకపోవడంతో వారు వ్యాపారాన్ని ఆపడం లేదు. సీడ్‌మాఫియా నడుపుతున్న అసలు సూత్రదారులపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఈ దందా విచ్చలవిడిగా సాగుతోంది.

ఈ ఏడాదైనా దృష్టి సారించేనా..

మరో రెండు నెలలు గడిస్తే వానాకాలం సీజన్‌ ప్రారంభమవుతుంది. ఇదే అదునుగా భావించి అక్రమార్కులు రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నకిలీ విత్తనాలు అంటగట్టి నిలువునా ముంచుతున్నారు. ఏటా ఏప్రిల్‌, మే మాసాల్లోనే విత్తనాలను ఈ ప్రాంతానికి చేర్చి నిల్వ పెడుతున్నారు. అక్రమార్కులకు ఇక్కడి వారి అండదండలు పుష్కలంగా ఉండటంతో వారు ఆడిందే ఇట పాడిందే పాటగా కొనసాగుతోంది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యవసాయం పేరుతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భూములను కౌలుకు తీసుకొని ఇక్కడే ఉంటూ నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు ఏటా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా నకిలీ విత్తనాలు నాటడం మూలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నకిలీ పత్తి విత్తనాలపై దృష్టిసారిస్తారా? అని వేచిచూస్తున్నారు. నకిలీ విత్తన దందాపై దృష్టి వహించినట్లయితే రైతులకు మేలు చేకూరే అవకాశం ఉంది.

మాఫియాకు అడ్డేది..?

కొన్నేఽళ్లుగా జిల్లా వ్యాప్తంగా జరిపిన పోలీసుల దాడుల్లో అనేకమంది అక్రమార్కులు పట్టుబడినా దందా మాత్రం ఆగడం లేదు. టాస్క్‌ఫోర్స్‌, పోలీసు, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నా అదే పరిస్థితి. కొంత మంది అక్రమార్కులు పోలీసులు దాడులు చేస్తారని భావించి పొరుగున ఉన్న మహారాష్ట్రలో నిల్వలు పెడుతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి ఎన్ని దాడులు నిర్వహించినా వారి వ్యాపారం మాత్రం ఆగడం లేదు. కల్తీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపాలి. కల్తీ విత్తన ముఠాలతో అధికారులు కుమ్మక్కైనట్లు తేలితే ఉపేక్షించొద్దు. అలాంటి వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు అప్పటి ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండేళ్ల క్రితం ఆదేశాలు జారీచేసినా నకిలీ మాఫియా మాత్రం ఆగడం లేదు. కల్తీవిత్తనాలపై కలెక్టర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి మాఫియాపై ఉక్కుపాదం మోపాలని చెప్పినా అక్రమార్కులు మాత్రం వారి వ్యాపారాన్ని వీడటం లేదు. కొన్ని చోట్ల అధికారులే వారికి వంతు పాడుతున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి. దీంతో వారి వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోందన్న అభిప్రాయా లున్నాయి.

Updated Date - Apr 06 , 2024 | 10:29 PM