Share News

Kumaram Bheem Asifabad: జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి వరించేదెవరినో?

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:03 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం నామినేటెడ్‌ పదవుల భర్తీకోసం కసరత్తు ప్రారంభించడంతో ఆ పదవిని ఆశించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

Kumaram Bheem Asifabad:  జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి వరించేదెవరినో?

- తీవ్రమవుతున్న పోటీ

- జోరందుకున్న పైరవీలు

- టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో గిరిజనేతర

బీఆర్‌ఎస్‌ హయాంలో గిరిజన నాయకులకు పదవి

కాంగ్రెస్‌ ప్రభుత్వం నామినేటెడ్‌ పదవుల భర్తీకోసం కసరత్తు ప్రారంభించడంతో ఆ పదవిని ఆశించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవల కాగజ్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని ప్రభుత్వం భర్తీ చేయడంతో జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవికోసం పైరవీలు జోరందుకున్నాయి. నాయకులు ఎవరికి వారు కాంగ్రెస్‌ పార్టీ అధినేతలను సంప్రదిస్తూ తమకు జైనూర్‌ మార్కెట్‌ కమిటీచైర్మన్‌ పదవి కట్టబెట్టాలని అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తోంది.

- జైనూర్‌

జైనూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి కోసం ఆశావహులు పోటీపడుతున్నారు. ప్రప్రథమంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలంలో నామిటేడ్‌ పదవులను గిరిజనేతరులతో భర్తీ చేశారు. దీంతో ప్రథమంగా జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి జైనూరుకు చెందిన అప్పటి టీడీపీ మండల అధ్యక్షుడు స్వర్గీయ సర్ఫరాజ్‌ఖాన్‌, కాంగ్రెస్‌ హయాంలో ఉట్నూరుకు షేక్‌ అహ్మద్‌కు అప్పగించారు. ఆ తర్వాత అదే మండలానికి చెందిన పూజారీ శివాజీని చైర్మన్‌ పదవి వరించింది. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత నామిటేడ్‌ పద వులు గిరిజనే తరులకు దక్కలేదు. ఈ పదవిని గిరిజనులతోనే భర్తీ చేశారు. దీంతో గడిచిన పదేళ్లకాలం నుంచి జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సీటు మండలంలోని జంగాంకు చెందిన కుంర భగ్వంత్‌రావ్‌, సిర్పూర్‌(యు)కు చెందిన మాజీఎంపీపీ ఆత్రం భగ్వంత్‌రావ్‌ను వరించింది. వారి పదవీకాలం పూర్తవ్వడంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న చైర్మన్‌ సీటును ఎలాగైనా భర్తీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు ఉట్నూరు, జైనూరు మండలాల నాయకులకే పదవి..

అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ హవా ఉండటంతో అటు ఖానాపూర్‌, ఇటు ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పెద్దగా వాటిని పట్టించుకోలేదు. ఎవరికి వచ్చినా తమ పార్టీ వారే కదా అనిపించుకున్నారు. వారు తమకు తోచిన నాయకు లకు, అనుచరులకు పదవులను కట్టబెట్టారు. అదేవిధంగా జైనూరు మార్కెట్‌ పరిధిలో ఉట్నూరు, జైనూరు, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉట్నూరు, జైనూరు మండ లాల నాయకులు మాత్రమే చైర్మన్‌ పదవులను అనుభవించారు. మిగిలిన లింగాపూర్‌ మండల నాయకుల కన్ను సైతం ఈసారి జైనూర్‌ మార్కెట్‌ చైర్మన్‌ సీటుపై పడినట్లు చర్చ కొనసాగుతోంది. దీంతో మూడు మండలాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చైర్మన్‌ పదవికోసం ఎవరికి వారు ప్రయత్నాలు మమ్మురం చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు గిరిజనేతరులు ముగ్గురు, గోండు తెగల వారు ఇద్దరేసి పదవులను అనుభవించారు. ఇంకా గిరిజనుల్లో కొలాం, అంద్‌, లంబాడా, పర్దాన్‌, ఽథోటి తదితర కులాల వారు చైర్మన్‌ సీటును ఇప్పటివరకు ఆశించలేదు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజనుల్లో కుల సమీకరణను దృష్టిలో పెట్టుకొని నామినేటెడ్‌ పదవులను గిరిజనులతో భర్తీ చేస్తుందా లేక తిరిగి గిరిజనేతరులతో భర్తీ చేయనుందాననే అనుమానాలు లేక పోలేదు.

రేసులో పలు మండలాల నాయకులు..

ప్రస్తుతం జైనూర్‌మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేసులో సిర్పూర్‌(యు)కు చెందిన సీనియర్‌ నేత కుడ్మెత విశ్వనాథ్‌, డుక్రె సుభాష్‌, జైనూరు మండలానికి చెందిన సీనియర్‌ నాయకులు పెందుర్‌ ప్రకాష్‌, పంద్ర షేకుతోపాటు ఉట్నూరుకు చెందిన మరి కొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జైనూరు, లింగాపూర్‌, సిర్పూర్‌(యు) మండలాలు ఆసిఫాబాద్‌ నియోజకవర్గం పరిధిలో ఉండగా ఉట్నూరు మండలం ఖానాపూర్‌ నియోజకవర్గంలోకి వస్తుంది. చైర్మన్‌ పదవిని తమ నియోజకవర్గం పరిధిలోకి ఉండేలా ఇటు ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అటు మంత్రి సీతక్క ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జోరందుకోగా ఈ సారి తమకు చైర్మన్‌ పదవి దక్కేలా కృషి చేయాలని ఉట్నూరు మండలం నాయ కులు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును వేడుకుంటున్నట్లు సమా చారం. చివరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం కృషిఫలితంగా ఏ నియోజక వర్గం ఖాతాలోకి చైర్మన్‌ పదవి వచ్చి పడుతుందో వేచి చూడాలి మరి.

Updated Date - Jun 17 , 2024 | 11:03 PM