Share News

Kumaram Bheem Asifabad: వంతెనలు పూర్తయ్యేదెప్పుడు?

ABN , Publish Date - May 15 , 2024 | 10:19 PM

ఆసిఫాబాద్‌, మే 15: ఆసిఫాబాద్‌ జిల్లా ఏజెన్సీలో వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ప్రత్యక్ష నరకమే. గూడేల నుంచి ప్రధానపట్టణాలకు రావాలంటే భగీరథ ప్రయత్నం చేయాల్సిందే.

Kumaram Bheem Asifabad:  వంతెనలు పూర్తయ్యేదెప్పుడు?

- ముంచుకొస్తున్న వానాకాలం

- ఇంకా పూర్తి కాని ప్రధాన వంతెనలు

- దశాబ్దాలు గడుస్తున్నా ఎక్కడి పనులు అక్కడే

- ఈ ఏడాదీ తప్పని తిప్పలు

ఆసిఫాబాద్‌, మే 15: ఆసిఫాబాద్‌ జిల్లా ఏజెన్సీలో వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ప్రత్యక్ష నరకమే. గూడేల నుంచి ప్రధానపట్టణాలకు రావాలంటే భగీరథ ప్రయత్నం చేయాల్సిందే. జిల్లాలోని 335పైగా ఆవాసాలకు నేటికీ అసలు రహదారి సౌకర్యమే లేదంటే ఉన్న గ్రామాలకు వాగులు, వంకల రూపంలో వర్షాకాలమంతా అష్టదిగ్బందనమే. ఇటు ఆసిఫాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అయిదు ఏజెన్సీ మండలాలతో పాటు కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, పెంచికలపేట, కాగజ్‌నగర్‌ వరకు అన్ని మండలాల్లో ప్రజలు ఒకే రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో చిన్నచిన్న వాగులు మొదలుకుని ఎర్రవాగు, పెద్దవాగు, ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని వంకలపై నేటికీ వంతెనలు లేవు. దీంతో ప్రజానీకం బయట ప్రపంచానికి చేరుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. జిల్లాలో ఇలా చిన్నా చితక కల్వర్టు మొదలుకుని భారీ వంతెనల వరకు ఏవీ పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది కూడా ప్రజానీకం ఇక్కట్లు పడే పరిస్థితి నెలకొంది. పనులను వేగిరం చేయాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ప్రతీ వర్షాకాలంలో ఈ సమస్యలు తప్పడం లేదని వివిధ మండలాలకు చెందిన ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి జిల్లాలో నెలకొంది. ప్రధాన వంతెనల నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో ఈ ఏడాది కూడా ఆయా గ్రామాల ప్రజలు తిప్పలు పడాల్సిందే.

ఏళ్లుగా సా...గుతున్న వంతెనల నిర్మాణాలు..

గ్రామాలకు రవాణా కష్టం తీర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి పూర్తిస్థాయిలో చేరడం లేదు. మారుమూల గ్రామాల ప్రజలు ఇప్పటికీ కష్టాలు పడుతున్నారు. కాలంతో కుస్తీ పడుతూ సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలోని పెద్దవాగుపై గుండి వంతెన నిర్మాణ పనులు దశాబ్దన్నరగా కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుండి గ్రామానికి వర్షాకాలంలో వెళ్లడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కెరమెరి మండలంలోని ఉమ్రివంతెన అసంపూర్తిగా ఉండడం వల్ల మహారాష్ట్రలోని 12గ్రామాల ప్రజలకు రాకపోకలు వర్షాకాలంలో నిలిచిపోతాయి. అదేవిధంగా మండలంలోని అనార్‌పల్లి-కరంజివాడ, లక్మాపూర్‌ వంతెనల నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. కాగజ్‌ నగర్‌-వాంకిడి మండలాల మధ్య కనర్‌గాం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు 15సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ అసంపూర్తిగానే ఉంది. దీంతో ఆయాగ్రామాల ప్రజలు వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.

అకాల వర్షానికి కొట్టుకుపోయిన గుండివాగు తాత్కలిక వంతెన..

ఇటీవల కురిసిన అకాలవర్షానికి గుండివాగుపై నిర్మించిన తాత్కలికవంతెన కొట్టుకుపోయింది. దీంతో గుండి ,కన్నర్‌గాం, నందూప, చోర్‌పల్లి గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. గుండి వంతెన నిర్మాణ పనులు దశాబ్దన్నర కాలం పాటు కొనసాగుతుండటంతో ప్రతియేటా వర్షకాలంలో ఆయా గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. చిన్నపాటి వర్షం కురుసిన తాత్కలికవంతెన కొట్టుకుపొతుడటంతో వాగు దాటుకుంటూ పోవాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళలు, పిల్లలు, ద్విచక్రవాహనదారులు, చంటిపిల్లల తల్లులు ప్రమాదకరంగా నీటిలోనుంచి వాగును దాటుతున్నారు. వంతెన నిర్మాణపనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

వంతెన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి..

- నానాజీ, గ్రామస్తుడు, గుండి

గుండి పెద్దవాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు 15ఏళ్లుగా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రతిఏటా వర్షాకాలంలో గుండి ఆయాగ్రామాల ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో జిల్లాకేంద్రానికి రావాలంటే వాంకిడి మండలం ఖమాన మీదుగా రావాల్సిన పరిస్థితి నెలకొంది.

యేటా ఇవే ఇబ్బందులు..

- మునిశ్వర్‌, గ్రామస్తుడు, గుండి

వర్షాకాలం వచ్చిందటే చాలు యేటా ఇవే ఇబ్బందులు. వంతెన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. అకాల వర్షాలకు తాత్కలిక వంతెన సైతం కొట్టుకుపోయింది. దీంతో వాగు దాటి గ్రామానికి చేరుకోవాల్సి వస్తోంది. అధికారులు దృష్టిసారించి వంతెన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి.

Updated Date - May 15 , 2024 | 10:19 PM