Share News

Kumaram Bheem Asifabad: వేతనం పెంచారు.. వసతులు మరిచారు

ABN , Publish Date - Apr 05 , 2024 | 10:54 PM

వాంకిడి, ఏప్రిల్‌ 5: ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న వారికి ప్రభుత్వం దినసరి కూలి పెంచింది. ఏప్రిల్‌1 నుంచి చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Kumaram Bheem Asifabad:   వేతనం పెంచారు.. వసతులు మరిచారు

- దినసరి కూలి రూ.300 పెంపు

- పనిప్రదేశంలో వసతులు లేక కూలీల ఇక్కట్లు

వాంకిడి, ఏప్రిల్‌ 5: ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న వారికి ప్రభుత్వం దినసరి కూలి పెంచింది. ఏప్రిల్‌1 నుంచి చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత ఏడాది ఏప్రిల్‌1 నుంచి ఈ ఏడాది మార్చి31 వరకు రూ.272 చెల్లిస్తుండగా ఇప్పుడు మరో రూ.28 పెంచింది. దీంతో దినసరి కూలి రూ.300లకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 15మండలాల్లో 93వేల జాబ్‌కార్డులు ఉండగా 1.73లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు. 2005లో ఉపాధి హామీ పథకం ప్రారంభమైంది. అప్పుడు కేవలం రూ. 87.50మాత్రమే చెల్లించేవారు. క్రమంగా పెంచుతూ ఉండడంతో ప్రస్తుతం రూ.300లకు చేరింది. ప్రభుత్వం ఉపాధి కూలీలకు రోజు కూలి రూ.300 పెంచినప్పటికీ పని ప్రదేశాల్లో మాత్రం ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

-నిబంధనలు బేఖాతరు

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో అధికారులు నిబంధన లను బేఖాతరు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పనిప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలి. కూలీలకు నీడకోసం టెంట్లు ఏర్పాటు చేయడంతోపాటు మెడికల్‌కిట్లు, తాగునీరు మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ పాకెట్లను అందుబాటులో ఉంచాలి. కానీ ఐదేళ్లలో జిల్లాలో ఎక్కడా ఈ సౌకర్యాలు కల్పించడంలేదు. దీంతో ప్రతి సంవత్సరం 44,45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల్లోనూ కూలీలు ఉపాధి పనులు చేస్తూ అవస్థలు పడాల్సి వస్తోంది. నీడ లేకపోవడంతో కూలీలు చెట్ల కిందనే సేదతీరుతున్నారు. గతంలో వేసవిలో కొందరు కూలీలు వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురైన, మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. ఉదయం 8గంటలలోపే పనులకు వెళ్లే ఉపాధి కూలీలు మధ్యాహ్నం 12గంటలవరకు పనులు ముగించుకుని ఇంటికి వస్తుంటారు. వీరికి కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో తమతోపాటు క్యాన్లల్లో నీరు తీసుకువెళ్తుం టారు. పనులకు ఉపయోగించే పలుగు, పారలకు రోజువారీ అలవెన్సులు, మంచినీటికి రూ.5 చొప్పున చెల్లిస్తున్నామని చెబుతున్నా అవి కూడా సకాలంలో అందిన సందర్భాలు లేవు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చ రించిన నేపథ్యంలో అధికారులు ఈ సారైనా పనిప్రదేశాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ఉపాధిహామీ కూలీలు కోరుతున్నారు.

- నిరాశలో కూలీలు

2022లో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు కేంద్రం రూ.12 పెంచింది. 2023లో రూ.15అదనంగా చెల్లించారు. ఇప్పుడు రూ.28 పెంచగా రూ. 300లకు చేరింది. అయినా కూలీలు నిరాశతో ఉన్నారు. గతంలో ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు దినసరి కూలితో పాటు వేసవి భత్యం చెల్లించేవారు. ఆ సమయంలో 15నుంచి 30శాతం వరకు అధికంగా ఉండేది. రెండేళ్ల నుంచి దీనిని తొలగించారు. పలుగు, పార భత్యాలు కూడా వారానికి ఒకసారి చెల్లించేవారు. దానిని కూడా ఆపేశారు.

- సద్వినియోగం చేసుకోవాలి

శ్రావణ్‌- ఏపీఎం, వాంకిడి

ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం రూ.28పెంచింది. దీంతో దినసరి కూలీ రూ.300లకు చేరుకుంది. కూలీలు పెరిగిన వేతనాన్ని సద్విని యోగం చేసుకోవాలి. ఉపాధి కూలీల హాజరు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పనిప్రదేశాల్లో కూలీలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Apr 05 , 2024 | 10:54 PM