Share News

Kumaram Bheem Asifabad: బహు కష్టంగా.. బస్సు ప్రయాణం..

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:43 PM

కాగజ్‌నగర్‌, జనవరి 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. బస్సుల సంఖ్య పెంచకపోవటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ కూడా బస్సులను నడిపించటం లేదు.

Kumaram Bheem Asifabad: బహు కష్టంగా.. బస్సు ప్రయాణం..

- ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ

- దహెగాంకు రోడ్డు సౌకర్యం ఉన్నా బస్సు రాదు

- విద్యార్థులకు తప్పని తిప్పలు

కాగజ్‌నగర్‌, జనవరి 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. బస్సుల సంఖ్య పెంచకపోవటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ కూడా బస్సులను నడిపించటం లేదు. దీంతో నిత్యం ఆటోలు, జీపుల ద్వారా ప్రయాణిస్తున్నారు. కాగజ్‌నగర్‌-దహెగాంకు, రెబ్బెన మండల కేంద్రం నుంచి తుంగెడకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ బస్సులు వేయటం లేదు. కాగజ్‌నగర్‌-కౌటాలకు ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు నడుస్తున్నా ప్రయాణికులకు సరిపోవడం లేదు. అదనంగా బస్సులు వేయాలని ప్రయాణికులు మండిపడుతున్నారు. బస్సు సామర్థ్యంకు మించి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని పేర్కొంటున్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళల ప్రయాణాలు టార్గెట్‌కు మించి వస్తుండటంతో బస్సుల్లో ప్రయాణికులు ఫుట్‌బోర్డుపై నిల్చుని ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బస్టాండులో కిట కిట..

ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ బస్టాండులు ప్రయాణీకులతో రద్దీగా ఉంటున్నాయి. జిల్లాకేంద్రం నుంచి మంచిర్యాల, ఆసిఫాబాద్‌కు నిత్యం 20 బస్సులు నడుపుతున్నారు. బెజ్జూరు, కౌటాల, సిర్పూరు(టి) మండలాల నుంచి కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలలకు విద్యార్థులు ప్రయాణం చేస్తుంటారు. దీంతో ఉదయం, సాయంత్రం విద్యార్థులతోనే బస్సులు నిండిపోతున్నాయి. ఈ మార్గం గుండా అదనంగా మరి ట్రిప్పులు నడిపించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం సెలవుల సీజన్‌ కాబట్టి విద్యార్థులు తప్పకుండా వెళ్లాల్సి ఉంటోంది. ఒకవైపు బస్సులు మహిళలతో నిండి పోతుండటం, మరో వైపు విద్యార్థులు ఉండటంతో బస్సులు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. రెండ్రోజుల క్రితం ఓ బస్సు కూడా ఫెయిల్‌ అయింది. ప్రయాణికుల రద్దీతో బస్సుల కండీషన్‌ దెబ్బతింటోందని సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సుల సంఖ్యను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని బస్సులను నడిపించాలి..

-విష్ణు, కౌటాల

మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలి. తాము నిత్యం కళాశాలకు వెళుతాం. మహిళా ప్రయాణికులతో ఇబ్బందిగా ఉంది. బస్సులో ఫుట్‌ బోర్డుపై ప్రయాణం చేయాల్సి వస్తోంది.

గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని బస్సులు నడిపించాలి..

-శ్రావణ్‌, కౌటాల

గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని బస్సులు నడిపించాలి. మహాలక్ష్మి పథకంతో మహిళలతో రద్దీ అధికంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలు, జీపులను ఆశ్రయించాల్సి వస్తోంది. కాగజ్‌నగర్‌-కౌటాల, కాగజ్‌నగర్‌-దహెగాం మండలాలకు బస్సు సౌకర్యం కలిపించాలి. చాలా రద్దీగా ఉండే ప్రాంతాలు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి.

Updated Date - Jan 12 , 2024 | 10:43 PM