Share News

Kumaram Bheem Asifabad: కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో భర్తీ కాని కీలకపోస్టులు

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:34 PM

కాగజ్‌నగర్‌ ఏప్రిల్‌ 12: కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో కీలక పోస్టులు భర్తీ కావటం లేదు. దీంతో ఉన్న ఉద్యోగులపైనే అదనపు భారం పడుతోంది. మున్సిపాల్టీలో ఇంజనీరింగ్‌ విభాగం, ఎకౌంట్స్‌ విభాగం, టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఎంతో కీలకం.

Kumaram Bheem Asifabad: కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో భర్తీ కాని కీలకపోస్టులు

- ఎక్కడి పనులు అక్కడే..

- అదనపు బాధ్యతలతో అవస్థలు

- పనిఒత్తిడి అవుతోందంటున్న ఉద్యోగులు

కాగజ్‌నగర్‌ ఏప్రిల్‌ 12: కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో కీలక పోస్టులు భర్తీ కావటం లేదు. దీంతో ఉన్న ఉద్యోగులపైనే అదనపు భారం పడుతోంది. మున్సిపాల్టీలో ఇంజనీరింగ్‌ విభాగం, ఎకౌంట్స్‌ విభాగం, టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఎంతో కీలకం. ఈ మూడువిభాగాల్లో ఉండే కీలక పోస్టుల్లోనే ఖాళీలు ఉండటంతో ఎక్కడి పనులు అక్కడే ఉంటున్నాయి. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారి-1, టీపీ ఎస్‌-2, టౌన్‌ప్లానింగ్‌ అండ్‌బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(టీపీబీఓ)-4 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్‌ విభాగంలో డీఈ రమాదేవి విధులు నిర్వహిస్తున్నారు. ఈ శాఖలో ఇద్దరు ఏఈలు ఉండాల్సి ఉండగా, ఇందులో ఏఈ సతీష్‌ పెద్దపల్లి మున్సిపాల్టీకి డిప్యూటేషన్‌పై వెళ్లారు. మరోపోస్టు ఖాళీగా ఉంది. అకౌంట్స్‌ విభాగంలో సీనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్స్‌-2, సీనియర్‌ అసిస్టెంట్లు-3, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌-3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో పేరుకుపోతున్న సమస్యలు..

మున్సిపాల్టీలో టౌన్‌ప్లానింగ్‌ అధికారిగా యశ్వంత్‌ కొనసాగుతున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీలకు ఈయనే ఇన్‌చార్జీగా టీపీవోగా వ్యవహరిస్తున్నారు. మిగితా టీపీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంతవరకూ ఈ పోస్టులను భర్తీ చేయటం లేదు. భవన నిర్మాణాల అనుమతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే టౌన్‌ ప్లానింగ్‌ శాఖ అధికారులు విచారణ చేసి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాలో సిబ్బంది కొరత కారణంగా పనులు త్వరగా కావడం లేదు. దీంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక పట్టణంలో అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం, అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం చేస్తుంటారు. అటువంటి సందర్భాల్లో వాటిని అడ్డుకునే వారు లేక అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.

ఇంజనీరింగ్‌ విభాగంలో..

ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు వార్డుల్లో రోడ్ల ప్రతిపాదనలు, మురికి కాల్వనిర్మాణం, తదితర వాటిని చూడాల్సి ఉంటుంది. ఈ శాఖలో కేవలం డీఈ రమాదేవి ఒక్కరే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మున్సిపాల్టీలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏటా నిధులను కేటాయిస్తాయి. ఈ నిధుల ద్వారా నూతన రోడ్లు, మురికి కాల్వలు, మూత్రశాలలు తదితర అభివృద్ధి పనులను చూసుకోవాలి. కానీ ఈ శాఖలో ఇద్దరు ఏఈలు ఉండాల్సి ఉండగా, ఇందులో ఏఈ సతీష్‌ పెద్దపల్లి మున్సి పాల్టీకి డిప్యూటేషన్‌పై వెళ్లారు. మరోపోస్టు ఖాళీగా ఉంది. ఇంతవరకు భర్తీ కాలేదు. కేవలం డీఈ రమాదేవి మాత్రమే పనులను పర్యవేక్షిస్తున్నారు.

స్వచ్ఛంద సంస్థల వినతులు..

అధికారుల కొరతతో ఇబ్బందులు పడుతున్నట్లు పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పలుమార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేస్తుందో లేదో చూడాలి.

ఉన్నతాధికారులకు నివేదికలను పంపించాం..

-అంజయ్య, కమిషనర్‌

కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు నివేదికలను పంపించాం. ఆయాశాఖల్లో కీలకంగా ఉండే పదిపోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియజేశాం.

Updated Date - Apr 12 , 2024 | 10:34 PM