Share News

Kumaram Bheem Asifabad: బడికి వేళాయె!

ABN , Publish Date - Jun 11 , 2024 | 10:14 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 11: ఆటపాటలతో వేసవి సెలవులు సరదాగా గడిచి పోయాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపిన విద్యార్థులు నేటినుంచి పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

 Kumaram Bheem Asifabad:   బడికి వేళాయె!

- ఆట..పాటలకు..ఇక టాటా...

- ముగిసిన వేసవిసెలవులు

- నేటినుంచి పాఠశాలల పునఃప్రారంభం

- స్కూళ్లకు చేరిన పాఠ్యపుస్తకాలు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 11: ఆటపాటలతో వేసవి సెలవులు సరదాగా గడిచి పోయాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపిన విద్యార్థులు నేటినుంచి పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వారికి అవసరమైన పుస్తకాలు, డ్రెస్సులు కొనుగోలులో తల్లిదండ్రులు బిజీగా ఉన్నారు. వేసవంతా బోసిపోయిన స్కూళ్లు సోమవారం పునఃప్రారంభంతో మళ్లీ కళకళలాడనున్నాయి. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల ఇబ్బందులు లేకుండా జిల్లా విద్యాశాఖ ముందస్తు చర్యలు తీసుకుంది. పాఠ్యపుస్తకాలను ఇప్పటికే పాఠశాలలకు సరఫరా చేసింది.

అసంపూర్తిగా అమ్మ ఆదర్శ పాఠశాల పనులు..

ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. బుధవారం నుంచి పాఠశాలలు పునఃప్రారరంభం కానుండగా పాఠశాలల్లో సగం పనులు కూడా పూర్తికాలేదు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 426పాఠశాలలో పనులు చేపట్టారు. దీంట్లో కేవలం 220పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తికాగా మిగతా పాఠశాలల్లో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు, తరగతిగదుల మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. మహిళా సమైఖ్యసభ్యుల ఆధ్వర్యంలో పనులు, పర్యవేక్షణను చేపట్టేందుకు నిర్ణయిం చింది. ఈ మేరకు 426ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలల్లో వసతులు కల్పించేందుకు రూ.19.5కోట్ల నిధులు మంజూరయ్యాయి.

పాఠశాలలకు చేరిన పాఠ్యపుస్తకాలు, దుస్తులు..

ఏటా జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభమై నెలరోజులు గడిచినా పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందని సందర్భాలే అనేకం ఉన్నాయి. అయితే ఈసారి పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ప్రభుత్వం ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలను సరఫరా చేసింది. విద్యార్థుల ఏకరూప దుస్తుల కోసం 97,786మీటర్ల క్లాత్‌ రాగా వాటిని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుట్టించారు. ఈ మేరకు ఆయాపాఠశాలలకు దుస్తులను పంపించారు. అలాగే 3,71,967పాఠ్యపుస్తకాలు, 2,13,155నోట్‌బుక్‌లు జిల్లా కేంద్రానికి చేరుకోగా వాటిని ఆయా పాఠశాలలకు పంపిణీ చేశారు.

జిల్లాలో 579 ప్రాథమిక పాఠశాలలు, 188 ప్రాథమికోన్నత పాఠశాలలు, 113 జిల్లా పరిషత్‌ పాఠశాలలున్నాయి. ఇందులో 48,248 విద్యార్థులు చదువుకుంటున్నారు.

60శాతం పనులు పూర్తి..

- అశోక్‌, డీఈవో

అమ్మఆదర్శ పాఠశాల పనులు 60శాతం పూర్తయ్యాయి. జిల్లాలో 426పాఠశాలలకు గాను 220పాఠశాలల్లో పనులు పూర్తిచేశాం. మిగతా పాఠశాలల్లో పనులు వేగిరపరిచి త్వరలోనే పూర్తిచేస్తాం. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లను ఇదివరకే ఆయా పాఠశాలలకు పంపిణీ చేశాం.

Updated Date - Jun 11 , 2024 | 10:14 PM