Share News

Kumaram Bheem Asifabad: ధరలతో దడ.. దడ

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:54 PM

కాగజ్‌నగర్‌ టౌన్‌, జనవరి 11: వర్షాభావ పరిస్థితులే కాకుండా పండుగలు, ఇతర సమస్యలతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకి కూరగాయలు ధరలు పెరుగుతుండడంతో సామాన్యుడికి ఇబ్బందిగా మారింది. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనాలంటే ధరలతో దడ పుడుతోంది. నెల రోజులుగా కూరగాయల రేట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Kumaram Bheem Asifabad:  ధరలతో దడ.. దడ

-పెరుగుతున్న కూరగాయల ధరలు

-కొనలేని స్థితిలో సామాన్యుడు

కాగజ్‌నగర్‌ టౌన్‌, జనవరి 11: వర్షాభావ పరిస్థితులే కాకుండా పండుగలు, ఇతర సమస్యలతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకి కూరగాయలు ధరలు పెరుగుతుండడంతో సామాన్యుడికి ఇబ్బందిగా మారింది. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనాలంటే ధరలతో దడ పుడుతోంది. నెల రోజులుగా కూరగాయల రేట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మార్గశిర మాసం, పండుగల వేళ కావడంతో పాటు వాతావారణ పరిస్థితుల వలన కూరగాయలకు చీడ, పీడలతో నష్టం వల్లనే ఈ పరిస్థితి ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆకుకూరలు, కూరగాయలు ఏవి చూసినా కొనలేని పరిస్థితి ఉందని వినియోగదారులు పేర్కొంటున్నారు. కేవలం ఆలుగడ్డ, టమాట, ఉల్లిగడ్డలు మాత్రమే కేవలం రూ.30రూపాయలకు కిలో వస్తున్నాయి. మిగిలిన ఏ కూరగాయలు చూసినా కూడా రూ.100నుంచి 120పలుకుతున్నాయి.

కిలో కూరగాయలు రూ.100పైనే

కూరగాయలు ఏది కొనాలన్నా కిలోకు రూ.100 పైగానే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రూ.100-150లేనిదే కూరగాయలు కొనలేని పరిస్థితి. ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యుడికి కూరగాయలు అందుబాటులో లేకుండా పోయాయి. కూరగాయల కొనుగోలు చేయలేక పేద, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలలోనే ధరల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి. కానీ ప్రస్తుతం చలికాలం సీజన్‌లోనూ ధరల బెడద తప్పడం లేదని, ఇప్పుడే ఈవిధంగా ఉంటే రానున్న వేసవిలో ఇంకా పరిస్థితి ఏవిధంగా ఉంటుందోననే వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కేవలం ఆలుగడ్డ, టమాట తప్ప సామాన్యుడికి అందుబాటులో ఏ కూరగాయలు మార్కెట్‌లో లభించే పరిస్థితి లేదు. ముందుముందు ధరలు మరింత పెరిగే పరిస్థితి ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం షష్టి బోనాలు, అయ్యప్పస్వాముల మాలధారణ, సంక్రాంతి పండుగ తదితర కార్యక్రమాల్లో భాగంగా కూరగాయల వినియోగం ఎక్కువగా ఉంటోంది. దీంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

తప్పని దళారుల బెడద

కాగజ్‌నగర్‌ మండలంతోపాటు కాగజ్‌నగర్‌లో కూరగాయల ధరలు చుక్కలంటుతున్నాయి. అలాగే చుట్టుపక్కల మండలాల్లోనూ ధరలు అధి కంగా పలుకుతున్నాయి. ఇక్కడ పండిన కూరగాయల ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండడంతో స్థానికంగా ధరలు మండిపోతున్నాయి. దీనికి తోడు ధరలు అమాంతగా పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. స్థానికంగా కొంత మంది వ్యాపారులు సిండికేట్‌గా మారి కూరగాయలు హోల్‌సేల్‌ ధరలు పెంచేస్తున్నారు. మార్కెట్‌కు వచ్చే కూరగాయలను రైతుల నుంచి ఇష్టారాజ్యంగా దళారుల కొనుగోలు చేసి ధరలు పెంచేస్తున్నారు. దీంతో చిరు వ్యాపారులు ఎక్కువ ధరలకు అమ్మాల్సి వస్తోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌, బెంగూళూరు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రతీనిత్యం కూరగాయలు, ఇతర సరుకులైన ఉల్లి, వెల్లుల్లి, ఆలుగడ్డ, టమాట తదితర సరుకులు దిగుమతి చేసుకుంటున్నారు. మరోపక్క దళారుల దందా కూడా కూరగాయల ధరలపై ప్రభావం చూపుతోందని వినియోగదారులు వాపోతున్నారు.

===================================

కాగజ్‌నగర్‌ మార్కెట్‌లో కూరగాయ ధరలు కిలోకి రూ.

===================================

వంకాయ 80

బీరకాయ 80

దొండకాయ 50

ఆలుగడ్డ 30

క్యారెట్‌ 120

పచ్చిమిర్చి 120

కాకరకాయ 80

బెండకాయ 80

క్యాబేజీ 80

గోరు చిక్కుడు 70

క్యాలీ ఫ్లవర్‌ 80

పాలకూర 120

తోటకూర 100

టమాట 30

ఉల్లిగడ్డ 30

==================

సామాన్యులపైనే అధిక భారం..

కూరగాయల ధరలు అమాంతం పెరిగి పోతుండడంతో సామాన్యుడిపై ఆర్థికంగా భారంగా పడుతోంది. జిల్లాలోని సామాన్య, నిరుపేద ప్రజలు కూరగాయల కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. ప్రతీరోజు ఒక్కో కుటుంబానికి కనీసం కిలో కూరగాయలు అవసరం కాగా, వాటి కోసం రూ.100పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కూరగాయలతోపాటు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఎక్కువగానే ఉండడంతో సామాన్యుడి కుటుంబపోషణ భారంగా మారింది. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు.

Updated Date - Jan 11 , 2024 | 10:54 PM