Share News

Kumaram Bheem Asifabad: పట్టు తప్పుతున్న పాలన

ABN , Publish Date - Feb 01 , 2024 | 10:58 PM

చింతలమానేపల్లి, ఫిబ్రవరి 1: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పరిపాలనా సౌలభ్యం కోసం 2016అక్ట్టోబరులో కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాతో పాటు చింతలమానేపల్లి, పెంచికలపేట, లింగాపూర్‌ మండ లాలను ఏర్పాటు చేశారు.

 Kumaram Bheem Asifabad: పట్టు తప్పుతున్న పాలన

- కొత్త మండలాల్లో నేటికీ తీరని సమస్యలు

- ఇప్పటికీ పూర్తిస్థాయిలో లేని అధికారులు, భవనాలు

- పాత మండలాల అధికారులే ఇన్‌చార్జీలు

- జిల్లాలో 3కొత్త మండలాలు

- ఏళ్లు గడుస్తున్నా.. గాడినపడని పాలన

చింతలమానేపల్లి, ఫిబ్రవరి 1: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పరిపాలనా సౌలభ్యం కోసం 2016అక్ట్టోబరులో కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాతో పాటు చింతలమానేపల్లి, పెంచికలపేట, లింగాపూర్‌ మండ లాలను ఏర్పాటు చేశారు. దానికనుగుణంగా పూర్తిస్థాయిలో వసతులు కల్పించకపోవడంతో స్థానికులు నిత్యం సమస్యలతోనే సహవాసం చేయాల్సి వస్తున్నది. ఏళ్లు గడుస్తున్నా కొత్తమండలాల్లో పలు కార్యాల యాల భవనాలకు పూనాదులు పడకపోవడంతో అరకొర వసతులతోనే పాలన నెట్టుకొస్తున్నారు. దీంతో పాలన పట్టుతప్పుతుందనే వాదన బలంగా విన్పిస్తున్నది. కొంతమంది అధికారులు సైతం ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. కొన్ని శాఖలకు అద్దెభవనాలు కూడా లేకపోవడంతో ఇప్పటికీ పాతమండలాల నుంచే పాలన కొనసాగుతోంది. అధికారులకు ప్రజలు ఏదైనా సమస్య చెప్పుకో వాలన్నా.. రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడు తున్నాయి.

జిల్లాలో మూడు కొత్త మండలాలు..

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాతోపాటు చింతలమానేపల్లి, పెంచికలపేట, లింగాపూర్‌ మండలాలను ఏర్పాటు చేశారు. అయితే మూడ మండలాల్లో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పవచ్చు. చింతలమానేపల్లి, లింగాపూర్‌ మండలాల్లో ప్రభుత్వ పాఠశాల భవనాలు, పెంచికలపేట మండలంలో ప్రభుత్వ పాఠశాల భవనంతో పాటు ఓ కులసంఘ భవనాన్ని అద్దెకు తీసుకొని తహసీల్దార్‌ కార్యాలయం కొనసాగిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయం, విద్య, తదితర శాఖలకు భవనాలు లేవు. అయితే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం అయినా కొత్త మండలాల్లో పూర్తిస్థాయిలో భవనాల నిర్మాణం, అధికారుల నియామకం చేపట్టాలన్న డిమాండ్‌ మండల ప్రజల్లో ఉంది. విద్య, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి వంటి శాఖల అధికారుల సైతం ఇప్పటికీ ఇన్‌చార్జీలే ఉండడంతో పాలన గాడిన పడడం లేదు.

ఇన్‌చార్జీలతో ఇబ్బందులు..

కొత్త మండలాలను ఏర్పాటు చేసినా దానికనుగుణంగా అధికారుల నియామకం చేపట్టకపోవడంతో ఒక్కో అధికారికి రెండు, మూడు మండ లాల బాధ్యతలు, శాఖలు అప్పజెప్పుతున్నారు. మండలం కొత్తదైనా పాత మండలాల అధికారులే ఇన్‌చార్జీలుగా ఉండడం, కనీస సౌకర్యాలు లేవన్న కారణంతో అధికారులు సైతం ఇక్కడకు వచ్చేందుకు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. పూర్తిస్థాయిలో పాలన సక్రమంగా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మండలప్రజలు కోరుతున్నారు.

కొత్త మండలాల్లో సమస్యలు పరిష్కరించాలి..

- తిరుపతి, చింతలమానేపల్లి

గతంలో ప్రభుత్వంపాలన సౌలభ్యం కోసం కొత్తమండలాలు ఏర్పాటు చేశారు. కానీ పూర్తి సౌకర్యాలు ఏర్పాటు కల్పించడంలో విఫలమైంది. ప్రస్తుతం ఏర్పడిన కొత్త ప్రభుత్వమైనా స్పందించి కొత్త మండలాల్లో పూర్తిసౌకర్యాల కల్పనకు కృషిచేయాలి. పూర్తిస్థాయి భవనాలతోపాటు అధికారుల నియామకం చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి.

Updated Date - Feb 01 , 2024 | 10:58 PM