Share News

Kumaram Bheem Asifabad: ప్యాసింజర్‌ రైళ్లే దిక్కు

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:36 PM

రెబ్బెన, ఏప్రిల్‌ 12: ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో ఏకైక ఆసిఫాబాద్‌రోడ్‌ రైల్వేస్టేషన్‌పై పాలకుల నిర్లక్ష్యంతో ఏటా ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఈ రైల్వేస్టేషన్‌లో ఏళ్లు గడుస్తున్నా కూడా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్టింగ్‌ కావటం లేదు.

Kumaram Bheem Asifabad:  ప్యాసింజర్‌ రైళ్లే దిక్కు

-ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వేస్టేషన్‌లో కలగానే ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్టింగ్‌

-దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు తప్పని అవస్థలు

-ఆదాయం ఉన్నా వసతులు కల్పించని అధికారులు

రెబ్బెన, ఏప్రిల్‌ 12: ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో ఏకైక ఆసిఫాబాద్‌రోడ్‌ రైల్వేస్టేషన్‌పై పాలకుల నిర్లక్ష్యంతో ఏటా ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఈ రైల్వేస్టేషన్‌లో ఏళ్లు గడుస్తున్నా కూడా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్టింగ్‌ కావటం లేదు. ఏటా నిరీక్షిస్తున్న తప్ప ఇంత వరకు ఆచరణలోకి రావటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా బుట్టదాఖలవుతున్నాయే తప్పా ఎలాంటి ప్రయోజనం చేకూరటం లేదు. రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌కు ఘనమైన చరిత్ర ఉంది. నిజాం కాలంలో ఏర్పాటైన ఈ స్టేషన్‌లో నేటికి పూర్తి స్థాయి వసతులు కల్పించటం లేదు. ఒకప్పుడు జిల్లా కేంద్రంగా ఉన్న ఆసిఫాబాద్‌తో పాటు బొగ్గు గనుల ఏర్పాటు పారిశ్రామిక ప్రాంతంగా మారిన గోలేటి, వాంకిడి, కెరమెరి మండలాలకు ఈ స్టేషన్‌ పెద్ద దిక్కు ఉంది. అయినా కూడా పాలకుల దీని అభివృద్ధి, ప్రయాణీకుల సౌకర్యాలు కల్పించటంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. 2017 రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టడంతో ఆసిఫాబాద్‌ జిల్లాగా ఏర్పడింది. దీంతో ఆసిఫాబాద్‌ నియోకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న రైల్వేస్టేషన్‌ అభివృద్ధిపై ప్రయాణీకులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో మూడు రైల్వేస్టేషన్లు ఉండగా ఆసిఫాబాద్‌ నియోకవర్గంలో ఇది ఒక్కటే ఉండటం విశేషం. ఈ స్టేషన్‌లో కేవలం అభివృద్ధి జరిగిందంటే కేవలం ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం మాత్రమే జరిగింది. ఒక ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్టింగ్‌ కోసం అంతా నిరీక్షిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రయాణీకులు హైదరాబాద్‌, వరంగల్‌, కొత్తగూడెం, ఖమ్మం, విజయవాడతో పాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, నాగ్‌పూర్‌ ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ హాల్టింగ్‌ లేక పోవటంతో ప్యాసింజర్‌ రైళ్లలో వెళ్లాల్సి వస్తోందని పలువురు ప్రయాణీకులు తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇటు కాగజ్‌నగర్‌, అటు బెల్లంపల్లికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. భాగ్యనగర్‌, ఇంటర్‌ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులో ఉన్నాయి. మిగితా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కూడా హాల్టింగ్‌ ఇస్తే చంద్రాపూర్‌, బల్లార్షా, ఇటార్సి, వారణాసి, ఢిల్లీ ప్రాంతాలకు పోయేందుకు వీలు ఉంది. అయినా కూడా సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లను ఆపక పోవటంతో అంతా ఇబ్బందులు పడుతున్నారు. ఆసిఫాబాద్‌ రైల్వే స్టేషన్‌లో భారగానే ఆదాయం సమకూరుతున్నా కూడా సౌకర్యాలు కల్పించక పోవటంతో ప్రయాణీకులు అధికారుల తీరుపై మండి పడుతున్నారు. సింగరేణి బొగ్గు రవాణా ద్వారా నెలకు రూ.కోటి వరకు ఆదాయం సమకూరుతున్న కూడా వసతులు కల్పించక పోవటం దారుణమని పలువురు పేర్కొన్నారు. స్టేషన్‌లో వెయింటింగ్‌హాల్‌, షెడ్లు లేక పోవటంతో ప్రయాణీకులు గంటల తరబడి నిల్చునే రైల్ల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎలాంటి అభివృద్ధి లేదు..

-ఎం.శ్రీనివాస్‌ గౌడ్‌, రెబ్బెన

ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నిజాం కాలంలో ఏర్పాటు చేసి స్టేషన్‌ పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించటం లేదు. బెంచాలు, షెడ్లు లేక ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్టింగ్‌ కోసం వినతిపత్రాలిచ్చిన కూడా సమస్య పరిష్కారం కాలేదు.

ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్టింగ్‌ ఇవ్వాలి..

-డి.సంతోష్‌, నంబాల

ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌కు ఘనమైన చరిత్ర ఉంది. ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్టింగ్‌ ఇస్తే ఆసిఫాబాద్‌, వాంకిడి, కెరమెరి, రెబ్బెన మండలాల వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సూదర ప్రాంతాలకు వెళ్లేందుకు చక్కటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి రైల్వేస్టేషన్లకు వెళ్లి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించాలి.

ఆదాయం ఉన్నా కూడా..

-నాజీర్‌ ఉస్మాన్‌, రెబ్బెన

ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఆదాయం ఉన్నా కూడా వసతులు కల్పించటంలో అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. అఽధికారులు వెంటనే స్పందించి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు ఇక్కడ నిలుపుదల చేయాలి. దీంతో మరింత ఆదాయం పెరుగుతుంది. అలాగే వసతులు కూడా కల్పించాలి. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Updated Date - Apr 12 , 2024 | 10:36 PM