Kumaram Bheem Asifabad: అంకుసాపూర్‌లో ఉద్రిక్తత
ABN , Publish Date - Jun 08 , 2024 | 10:31 PM
కాగజ్‌నగర్, జూన్ 8: కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్ గ్రామంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంకుసాపూర్‌లో ఉన్న 190ఎకరాల అటవీశాఖ భూములకు హద్దులను ఏర్పాటు చేసేందుకు డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వో శశిధర్‌బాబు, ఎఫ్‌బీవో బానయ్య, సిబ్బంది వెళ్లారు. ఈ సందర్భంగా పోడు రైతులు వారిని అడ్డుకున్నారు.
-అటవీశాఖభూములకు హద్దుల పెట్టేందుకు వెళ్లిన అధికారులు
- అడ్డుకున్న గ్రామస్థులు
- పోడు భూములకు పట్టాలిచ్చారని రైతుల వాదన
కాగజ్‌నగర్, జూన్ 8: కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్ గ్రామంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంకుసాపూర్‌లో ఉన్న 190ఎకరాల అటవీశాఖ భూములకు హద్దులను ఏర్పాటు చేసేందుకు డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వో శశిధర్‌బాబు, ఎఫ్‌బీవో బానయ్య, సిబ్బంది వెళ్లారు. ఈ సందర్భంగా పోడు రైతులు వారిని అడ్డుకున్నారు. ఈ భూముల్లో తమ పోడు భూములున్నాయని, ఎట్టిపరిస్థితుల్లో తమ భూముల్లోకి రానివ్వమని తెగేసి చెప్పారు. ఇక్కడి పరిస్థితిని తెలుసుకొని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ అంకుసాపూర్‌కు చేరుకున్నారు. పరిస్థితిపై ఆరాతీసి రైతులతో మాట్లాడారు. పోడురైతులకు బీజేపీ అండగా ఉంటుందని, రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండుచేశారు. అధికారులు జాయింట్‌సర్వే చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి విషమించటంతో అటవీశాఖ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి ఎఫ్‌ఆర్‌వో రమాదేవి, కాగజ్‌నగర్ రూరల్ సీఐ అల్లం రాంబాబు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అటవీశాఖ అధికారులు తమ భూముల్లో హద్దులు పెడితే ఊరుకునేది లేదని, తాము తాతల నాటి నుంచి పోడు చేసుకుంటున్నామని అన్నారు. తమకు పట్టాపాస్ పుస్తకాలు కూడా వచ్చాయని చూపించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ అల్లం రాంబాబు, ఎఫ్‌ఆర్‌వో రమాదేవి మాట్లాడుతూ అటవీ శాఖ పరిధిలో ఎంతభూమి ఉందో నిబంధనల మేరకు హద్దులు పెడుతున్నట్టు తెలిపారు. మీ పాస్‌బుక్‌లు రెవిన్యూశాఖ అధికారులకు చూపించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో ఉద్రిక్తత తగ్గింది. తమకు రెవెన్యూ అధికారుల నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే హద్దులు చేసుకోవాలని పోడురైతులు అధికారులకు సూచించారు. అనంతరం అధికారులు, పోడు రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.