Share News

Kumaram Bheem Asifabad: ఎస్పీఎం కార్మికులే కీలకం

ABN , Publish Date - May 03 , 2024 | 11:13 PM

కాగజ్‌నగర్‌, మే 3: త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కార్మికక్షేత్రంలో ఓట్లను రాబట్టుకునేందుకు ఆయాపార్టీల నాయకులు ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు.

Kumaram Bheem Asifabad: ఎస్పీఎం కార్మికులే కీలకం

- కార్మిక క్షేత్రంపైనే దృష్టిసారిస్తున్న నాయకులు

- జయాపజయాలపై ప్రభావం చూపనున్న కార్మిక ఓటర్లు

- 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్‌తో అప్రమత్తం

కాగజ్‌నగర్‌, మే 3: త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కార్మికక్షేత్రంలో ఓట్లను రాబట్టుకునేందుకు ఆయాపార్టీల నాయకులు ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. జిల్లాలో కాగజ్‌నగర్‌లో ఎస్పీఎం, సర్‌సిల్క్‌ మిల్లులు ఉండటం, ఇందు లోని కార్మిక కుటుంబాల ఓట్లను రాబట్టేందుకు ప్రధాన పార్టీలు వ్యూహరచనలు చేస్తున్నాయి. రెండు నెలల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎస్పీఎం మిల్లు కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను ఓపిగ్గా విన్నారు. ఎంపీ ఎన్నికలు కాగానే సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామమని హామీ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్‌పార్టీ నాయకులు కూడా కార్మికవాడల్లో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా మిల్లు పునరుద్దరణ తామే చేశామని కార్మికులకు వివరిస్తూ తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.

ప్రత్యక్షంగా, పరోక్షంగా 20వేల ఓటర్లు..

ఎస్పీఎం మిల్లులో కార్మికులు, స్టాఫ్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు మొత్తం కలిపి 2వేలకుపైగా ఉన్నారు. ఓల్డుకాలనీ, న్యూకాలనీ, ఎటైపు, బీటైపు, సీటైపు, డీటైపు, రామగుండం పవర్‌ హౌజ్‌కాలనీ, ఓఆర్టీ క్వార్టర్లలో కార్మికులు, ఎస్పీఎం స్టాఫ్‌ ఉద్యోగులు నివసిస్తున్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ, మండలాల్లో మొత్తం 90,875ఓటర్లు ఉండగా, ఇందులో 12వేలకుపైగానే ఓటర్లు ఎస్పీఎంలో పనిచేస్తున్న కార్మిక, కుటుంబ సభ్యులే. అలాగే సర్‌సిల్క్‌ మిల్లు కార్మికులు కూడా 10వేల మంది ఉన్నారు. వీటితో పాటు మిల్లులపై ఆధారపడి చిరువ్యాపారులు, ఇతర సంస్థల వారిని కలుపుకొంటే మొత్తం 20వేలకు వరకు ఓటర్లు ఉంటారు. ఈ ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు తమ వ్యూహ రచన చేస్తున్నాయి. ఎస్పీఎంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఆత్రం సక్కుకు ఓటేయాలని కోరుతున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ నుంచి సిర్పూరు మాజీఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రావి శ్రీనివాస్‌ తదితరులు కూడా కార్మిక ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు వివిధ కాలనీల్లో ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌ను గెలిపించాలని ఇంటింటా తిరుగుతున్నారు. ఇలా అభ్యర్థుల గెలుపు ఓటములు నిర్ధేశించడంలో కార్మిక క్షేత్రం కాబట్టి వీరి ఓట్లే కీలకం కానున్నాయి. 2018అసెంబ్లీ ఎన్నికల్లో కాగజ్‌నగర్‌లో సింహభాగమైన కార్మికప్రాంతం నుంచి ఒకేవైపు ఓట్లు పడ్డాయి. దీంతో అప్పటి అభ్యర్థి కోనేరు కోనప్పకు సిర్పూరు నియోజకవర్గంలోని ఏడు మండలాల కంటే అధికంగా ఇక్కడి నుంచే లీడ్‌ వచ్చింది. అలాగే 2023అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడిఓట్లు చీలి పోయాయి. ఫలితంగా ఆశించిన ఫలితాలు పూర్తిగా తారుమారయ్యాయి. ఈ గణాంకాల ఆధారంగానే అన్ని పార్టీల రాజకీయ నాయకులు కార్మికఓటర్లపైనే దృష్టిసారించారు. గతంలో జరిగిన పోలింగ్‌ కంటే ఈసారి పోలింగ్‌ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకుగాను డిపార్టుమెంట్ల వారీగా కీలకమైన వ్యక్తులు మంతనాలు జరుపుతున్నారు. కార్మికుల ఓట్లు రాబట్టేందుకు ఆయా రాజకీయ పార్టీ నాయకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.

Updated Date - May 03 , 2024 | 11:13 PM