Share News

Kumaram Bheem Asifabad: భూసారం తగ్గుతోంది..

ABN , Publish Date - Apr 13 , 2024 | 10:19 PM

బెజ్జూరు, ఏప్రిల్‌ 13: పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ...సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించడంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావం పెరిగి భూసారం తగ్గుతోంది. రసాయనాల గాడత ఏటా పెరిగిపోతున్న తీరుతో భూములు పూర్తిగా సారం కోల్పోయి రానున్న కాలంలో చవుడు భూములుగా మారిపోయే ప్రమాదం ఉంది.

 Kumaram Bheem Asifabad: భూసారం తగ్గుతోంది..

- పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం

- సేంద్రియ ఎరువులపై అవగాహన కరువు

- భూసార పరీక్షలకు సరఫరా కాని రసాయనాలు

- అవగాహన కల్పిస్తే మేలు

బెజ్జూరు, ఏప్రిల్‌ 13: పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ...సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించడంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావం పెరిగి భూసారం తగ్గుతోంది. రసాయనాల గాడత ఏటా పెరిగిపోతున్న తీరుతో భూములు పూర్తిగా సారం కోల్పోయి రానున్న కాలంలో చవుడు భూములుగా మారిపోయే ప్రమాదం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ రైతులకు దీనిపై అవగాహన కల్పించడం లేదు. ఈ రెడీమేడ్‌ వ్యవసాయంతో భవిష్యత్తులో భూములు పంటలకు అనువుగా ఉండే పరిస్థితి లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే రైతులు దిగుబడి అధికంగా రావాలంటూ ఎరువులు, పురుగు మందులు గతంకంటే రెట్టింపుగా వినియోగిస్తుండటంతో దీర్ఘకాలంలో భూముల సారంపై ప్రభావం పడనుంది.

దూరంగా భూసార పరీక్షలు..

2020వరకు భూసార పరీక్షలు చేయించే బాధ్యత వ్యవసాయశాఖ సిబ్బందికి ఉండగా నాలుగేళ్లుగా ఈ తరహా లక్ష్యాలు నిర్ణయించలేదు. రైతులే తమ ఆసక్తితో వచ్చి భూసారపరీక్షలు చేయించుకోవాలని సూచించగా ఆశించిన మేర రైతులు ముందుకు రావడం లేదు. భూసార పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ఏటా తగ్గిపోతున్న తీరు రైతుల అనాసక్తికి అద్దం పడుతోంది. రైతు వేదికలు నిర్మించిన సమయంలో భూసార పరీక్షల కిట్‌లు అందుబాటులో ఉంచి రైతులకు అవసరమైనప్పుడు పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. అయితే కిట్‌లు ఇచ్చి రసాయనాలు అందించలేదు. కొన్నిచోట్ల రసాయనాలు అయిపోగా ఇప్పటివరకు సరఫరా చేయలేదు. జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, వరిపంటల సాగుపై దృష్టిసారించడంతో ఇతర పంటలసాగు తగ్గిపోయింది. వరి పంటను సైతం తొలగించి పత్తి సాగు చేస్తున్నారు. వరికి సైతం ఎకరాకు ఒకబస్తా యూరియా సరిపోతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నా ప్రైవేటు కంపనీల మాటలు విని రైతులు మూడు బస్తాల వరకు యూరియా వినియోగిస్తున్నారు. దీనితో భూములు విషతుల్యం అవుతున్నాయి. యూరియా లీటర్‌ బాటిళ్లలో తయారు చేయిస్తూ ప్రభుత్వం రెండేళ్లుగా విక్రయిస్తున్నా వీటిని వినియోగించేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు.

ఆసక్తి ఉంటే పరీక్షలు చేయిస్తాం..

- రాజులనాయుడు, వ్యవసాయ అధికారి, బెజ్జూరు

భూసార పరీక్షలపై రైతులకు ఆసక్తి ఉంటే పరీక్షలు చేయిస్తాం. మూడేళ్లుగా ప్రభుత్వం భూసార పరీక్షలపై ఎటువంటి లక్ష్యాలు ఇవ్వడం లేదు. దీంతో రైతులు భూసార పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. మూడేళ్లుగా రసాయనాల సరఫరా కూడా ఆగిపోయింది. రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. గతంలో వాటిపై రైతులకు పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఆసక్తి చూపడం లేదు. పంటల సాగులో రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి. సేంద్రియ ఎరువుల వాడకం పెరిగినప్పుడే భూసారం కోల్పోకుండా ఉంటుం ది. రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తూ ఎప్పటికప్పుడు పంటల మార్పిడి చేయాలి. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి.

Updated Date - Apr 13 , 2024 | 10:19 PM