Kumaram Bheem Asifabad: ఎద్దుల బండిపై.. ఏడు నెలల గర్భిణి
ABN , Publish Date - Aug 19 , 2024 | 10:44 PM
పెంచికలపేట, ఆగస్టు 19: ఏడు నెలల గర్భిణీ.. రెండు కిలో మీటర్లు చెరువు కట్టపై గుంతలతో ఉన్న బురదమార్గం గుండా ప్రయాణించి.. పురిటిలోనే నవ జాత శిశువును కోల్పోయింది.
- రెండు కిలో మీటర్లు ప్రయాణం
- పురిటిలోనే నవజాత శిశువు మృతి
పెంచికలపేట, ఆగస్టు 19: ఏడు నెలల గర్భిణీ.. రెండు కిలో మీటర్లు చెరువు కట్టపై గుంతలతో ఉన్న బురదమార్గం గుండా ప్రయాణించి.. పురిటిలోనే నవ జాత శిశువును కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలోని మేరగూడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఏఎన్‌ఎం లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం... మేరగూడ గ్రామానికిచెందిన దుర్గం పంచ పూల అనే ఏడు నెలల గర్భిణికి సోమవారం తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో నొప్పులతో రక్తస్రావం అయింది. దీంతో 108 వాహనాన్ని సంప్రదించారు. అయితే మేరగూడ రోడ్డు గుంతలతో బురదమయంగా ఉండడంతో చేసేదేమి లేక ఎద్దుల బండిలో అవస్థలు పడుతూ రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించింది. అప్పటికే ఏల్లూరుకు చేరుకున్న 108వాహనంలో గర్భిణిని కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. కానీ గర్భిణి పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు కాగజ్ నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే గర్భంలోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం చికిత్స నిర్వహించి మృతిచెందిన శిశువు బయటికి తీశారు. గ్రామానికి ఇప్పటికీ వరకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని కుంటుంసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.