Kumaram Bheem Asifabad: వర్షాకాలం.. పాములతో జరభద్రం
ABN , Publish Date - Jun 26 , 2024 | 10:16 PM
వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం పనుల్లో బీజీ అయ్యారు. మరోవైపు ఇది పాములకు అనువైనకాలం. జూన్, జూలై నెలల్లో పాములు తమ ఆవాసాలను విడిచి బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. - ఆసిఫాబాద్
- నాటు వైద్యాన్ని నమ్ముకోవద్దు
- అందుబాటులో మందులు
వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం పనుల్లో బీజీ అయ్యారు. మరోవైపు ఇది పాములకు అనువైనకాలం. జూన్, జూలై నెలల్లో పాములు తమ ఆవాసాలను విడిచి బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. - ఆసిఫాబాద్
వర్షాకాలంలో పాముల బెడద అధికంగా ఉంటుంది. కానీ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. చల్లదనానికి పాములు వాటి ఆవాసాల నుంచి బయటకు వస్తాయి. రాత్రి వేళల్లో నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ ఇండ్లలోకి ప్రవేశిస్తాయి. వానాకాలం పంట సీజన్‌లో సాగుకు సిద్ధమవుతున్న సమయంలో పాములు బయటకు రావడంతో రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏటా పాము కాటుకు గురై ఎంతో మంది మృతి చెందుతున్నారు. కట్ల పాము కాటేసిన క్షణాల్లో విషం రక్తంలోకి ప్రవేశించి మృతిచెందే అవకాశం ఉంటుంది. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఆందోళనకు గురికాకుండా వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. నాగు పాము కాటేసిన 15నిమిషాల్లో విషం ఎక్కుతుంది. రక్తపింజర కాటేసిన రెండు గంటల తరువాత విషం ఎక్కుతుంది. జెర్రిపోతు, సిరుకట్ల పాము కాటేసినా విషం ఉండదు. అయితే కాటేసిన చోట చికిత్స చేయడానికి ఆసుపత్రులకు తీసుకువెళ్లాలి. పాములు ఎన్నో రకాలు ఉంటాయి. ఏ పాము కాటే వేస్తే ఆందోళనకు గురి కాకుండా కాటేసిన దగ్గర కట్టుకట్టి ఆసుపత్రికి తీసుకు వెళ్లాలి.
అందుబాటులో మందులు
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 22పీహెచ్‌సీలు ఉన్నాయి. రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలలో పాముకాటు మందులు అందుబాటులో ఉన్నాయి. ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో సంప్రదించే అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక చికిత్స చేసి అవసరమైతే జిల్లా ఆసుపత్రులకు తరలించి కృత్రిమ శ్వాసను అందించి బతికించే అవకాశం ఉంటుంది. ఆందోళనకు గురై ఆలస్యం చేస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
ఆందోళన అవసరం లేదు :
పాము కాటుకు గురైనప్పుడు ఆందోళణకు గురి కావద్దు. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. ప్రాథమిక చర్యగా కాటువేసి ప్రదేశంపై భాగంలో కట్టు కట్టాలి. ఆ వెంటనే చికిత్స కోసం వెళ్లాలి.
మంత్రగాళ్లను ఆశ్రయించొద్దు
గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఎక్కువ. వైద్యులను సంప్రదించకుండా మంత్రగాళ్లను ఆశ్రయిస్తుంటారు. పాము కాటుకు వైద్యం ఉంది. పాము కాటుకు గురైన వారు మంత్రగాళ్లను ఆశ్రయించవద్దు. ఆశ్రయిస్తే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.
పాము కాటు లక్షణాలు..
వ్యక్తిని విషపూరితమైన పాము కాటేస్తే శరీరమంతా నీలం రంగుగా మారడం, రక్త పోటు తక్కువగా ఉంటే స్పృహ కోల్పోతారు. కరిచిన చోట నొప్పి, వాపు ఉంటుంది. కొందరిలో దద్దుర్లు కనిపిస్తాయి. నోటి నుంచి నురగా వస్తుంటుంది. ఆయాసపడి చెమటలు పట్టి ఉంటే సాధారణ స్థాయి కంటే రెట్టింపు స్థాయిలో గుండె కొట్టుకుంటుంది. ఈ క్షణాల్లో ఉన్నప్పుడు తక్షణమే ఆసుపత్రులకు తీసుకెళ్తే ఎటువంటి ప్రాణహాని ఉండదని వైద్యులు చెబుతున్నారు. పాము కాటుకు గురైన వారిని 99శాతం బతికించే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు.
అన్ని పీహెచ్‌సీలలో మందులు అందుబాటులో ఉన్నాయి.
- డాక్టర్ సుధాకర్ నాయక్, డిప్యూటీ డిఎంహెచ్‌వో
జిల్లాలోని 22పీహెచ్‌సీలలో పాము కాటుకు సంబంధించి (యాంటీ స్నేక్‌వీనం) ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. పీహెచ్‌సీల సిబ్బందిని అప్రమత్తం చేశాం. వర్షాకాలం కావడంతో పాములు సంచరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రైతులు, కూలీలు వ్యవసాయ పనుల చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. పాము కాటుకు గురైన వ్యక్తులను నేరుగా ఆసుపత్రులకు తరలించాలి. మూఢనమ్మకాలు నమ్మి సమయం వృధా చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు.