Share News

Kumaram Bheem Asifabad: తపాల శాఖకు సొంత భవనాలు కరువు

ABN , Publish Date - Feb 25 , 2024 | 10:27 PM

వాంకిడి, ఫిబ్రవరి 25: సుదూరప్రాంతాల నుంచి వచ్చే సమాచారాన్ని గ్రామీణప్రాంతాలకు చేరవేసేందుకు ఏర్పాటు చేసిన తపాలశాఖ కార్యాలయాలు అరకొరవసతులతో కొట్టుమిట్టా డుతున్నాయి.

Kumaram Bheem Asifabad:  తపాల శాఖకు సొంత భవనాలు కరువు

- అద్దె భవనాల్లోనే నిర్వహణ

- అరకొర వసతులు.. తప్పని ఇబ్బందులు

వాంకిడి, ఫిబ్రవరి 25: సుదూరప్రాంతాల నుంచి వచ్చే సమాచారాన్ని గ్రామీణప్రాంతాలకు చేరవేసేందుకు ఏర్పాటు చేసిన తపాలశాఖ కార్యాలయాలు అరకొరవసతులతో కొట్టుమిట్టా డుతున్నాయి. కేంద్ర పరిధిలోని అనేకశాఖల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్న కేంద్రప్రభుత్వం తపాలశాఖ కార్యాలయాలకు మాత్రం కేటాయించడంలో నిర్లక్షంగా వ్యవహారిస్తోంది. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి) క్లస్టర్‌లలో మొత్తం 72బ్రాంచ్‌పోస్ట్‌ ఆఫీసులు పనిచేస్తున్నాయి. సిర్పూర్‌(టి) పరిధిలో 30, రెబ్బెన పరిధిలో 8, ఆసిఫాబాద్‌ మండలం చిర్రకుంట పరిధిలో 11, వాంకిడి పరిధిలో 8, కాగజ్‌నగర్‌ పరిధిలో 15 బ్రాంచ్‌ ఆఫీసులు పనిచేస్తున్నాయి. జిల్లాలో కేవలం రెబ్బెన, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి) సబ్‌పోస్ట్‌ ఆఫీసులకు మాత్రమే సొంత భవనాలు ఉండగా మిగిత మండలాల్లోని బ్రాంచ్‌పోస్ట్‌ ఆఫీసులు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి.

ప్రతినెల 8నుంచి 10వేల రూపాయల అద్దెచెల్లిస్తున్న ప్రభుత్వం సొంతభవనాల నిర్మాణాలకు మాత్రం నిధులు విడుదల చేయకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జిల్లాలోని ఆసిఫాబాద్‌, వాంకిడి, కెరమెరి, తదితర మండలాల్లోని తపాలకార్యాలయాల్లో అరకొర వసతుల కారణంగా పనిచేసే సిబ్బందితోపాటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకపక్క అరకొర వసతులు, మరోపక్కసరిపడ సిబ్బందిలేని కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం తపాల కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు అమలు కావడంతోపాటు సేవింగ్‌ ఖాతాల వినియోగం పెరగడంతో పోస్ట్‌ మాస్టర్‌లకు పనిభారం పెరిగింది. దీంతో సకాలంలో పనులు పూర్తి కావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి తపాలశాఖ కార్యాలయాలకు పక్కాభవనాలు నిర్మించి అన్ని వసతులు కల్పించాలని వినియోగదారులు కోరుతున్నారు.

సొంత భవనాలను నిర్మించాలి..

ఆరిఫ్‌ - వాంకిడి

తపాలశాఖ కార్యాలయాలకు సొంతభవనాలను నిర్మించాలి. తపాలశాఖ కార్యాలయాలు అద్దెభవనాల్లో నడుస్తుండడంతో వినియోగదారులకు సరైన వసతులులేక ఇబ్బంది పడుతు న్నారు. ఇతరశాఖల వసతుల కల్పనపై దృష్టిపెడుతున్న ప్రభుత్వాలు తపాలశాఖ కార్యాలయాలపై దృష్టిపెట్టడంలేదు. కొన్నేళ్ల నుంచి తపాలశాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. తపాలశాఖ కార్యాలయాలకు పక్కాభవనాలు నిర్మించి వినియోగదారులకు సదుపాయాలు కల్పించాలి.

Updated Date - Feb 25 , 2024 | 10:27 PM