Share News

Kumaram Bheem Asifabad: వడ్డీ వ్యాపారులపై పోలీసుల ఉక్కుపాదం

ABN , Publish Date - Apr 13 , 2024 | 10:13 PM

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌, ఏప్రిల్‌ 13: వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు జిల్లా పోలీసుయంత్రాంగం వడ్డీవ్యాపారులపై ఉక్కుపాదం మోపింది.

Kumaram Bheem Asifabad:   వడ్డీ వ్యాపారులపై పోలీసుల ఉక్కుపాదం

-జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు

-ఇళ్లలో సోదాలు

-నగదు రూ.23లక్షలు, పలు డాక్యుమెంట్ల స్వాధీనం

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌, ఏప్రిల్‌ 13: వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు జిల్లా పోలీసుయంత్రాంగం వడ్డీవ్యాపారులపై ఉక్కుపాదం మోపింది. శనివారం ఎస్పీ సురేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాలతోపాటు రెబ్బెన, వాంకిడి మండలకేంద్రాల్లో ఏకకాలంలో దాడులునిర్వహించారు. ఏఎస్పీ ప్రభాకర్‌ నేతృత్వంలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డీఎస్పీలు సదయ్య, కరుణాకర్‌ ఆధ్వర్యంలో ఎస్సైలు, సీఐలు పలు బృందాలుగా ఏర్పడి జిల్లాలో వడ్డీ, చీటీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పోలీసులు నగదు, ఖాళీ చెక్‌లు, నాన్‌ జ్యుడీషియల్‌ బాండ్స్‌, ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో ఆసిఫాబాద్‌లో శ్రీనివాస్‌, దత్తు, కాగజ్‌నగర్‌ పట్టణంలో సాబీర్‌, రాజశేఖర్‌, సంతోష్‌, వాంకిడిలో రవి, కార్తీక్‌ వద్ద నుంచి రూ.23లక్షల నగదు, పలు డాంక్యుమెంట్లను స్వాధీన పర్చుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడులు..-ఏఎస్పీ ప్రభాకర్‌

జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ, చీటీవ్యాపారం చేస్తున్న వారిపై ఎస్పీ సురేష్‌ ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించాం. చీటీ వ్యాపారం చేసేందుకు తప్పకుండా రిజిస్ట్రేషన్‌ చేసి ఉండాలి. లేనిపక్షంలో కేసులు నమోదు చేస్తాం. కాగజ్‌నగర్‌లో ఐదుగురి ఇళ్లపై దాడులుచేశాం. ఉదయం నుంచి ఈ దాడులు చేయగా, కనీసం ఆరు గంటలపాటు చేసినట్టు వివరించారు. సమావేశంలో డీఎస్పీ కరుణాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 10:13 PM