Kumaram Bheem Asifabad: పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజు మృతి
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:05 PM
జైనూర్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహిత, గుస్సాడి నృత్యకళాకారుడు కనక రాజు(90) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందారు.

జైనూర్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహిత, గుస్సాడి నృత్యకళాకారుడు కనక రాజు(90) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనకు ఇద్దరు భార్యలు, పిల్లలున్నారు. కొంతకాలంగా కనక రాజు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కుటుంబసభ్యులు ఆయనకు పలు ఆసుపత్రులలో వైద్యం చేయించినప్పటికీ ఆరోగ్యం బాగుపడలేదు. చివరకు స్వ గ్రామమైన మార్లవాయిలో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కనక రాజు మృతితో మార్లవాయిలో విషాదం నెలకొంది. కనక రాజుకు అంత్యక్రియలు నేడు శనివారం మార్లవాయిలో ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం జరుగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కనక రాజు గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తూ, తోటి ఆదివాసులకు గుస్సాడి నృత్యాన్ని నేర్పిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దీంతో భారతప్రభుత్వం ఆయనకు 2021లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కనక రాజు ఇకలేరన్న వార్త యావతు ఆదివాసులను దిగ్ర్భాంతికి గురిచేసింది.