Kumaram Bheem Asifabad: కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే
ABN , Publish Date - Dec 29 , 2024 | 10:26 PM
కాగజ్‌నగర్ టౌన్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే కొనసాగుతోంది. సర్వేచివరి తేదీ ఈనెల31న ఉన్నప్పటికీ మరింత పొడి గించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

-అర్హులను ఎంపిక చేసేందుకు ఇంటింటికి
-డబుల్ బెడ్‌రూం ఇండ్లు తదితరాలపై అధికారుల దృష్టి
-అన్ని వివరాలు యాప్‌లో నమోదు
-రేపటితో ముగియనున్న సర్వే ప్రక్రియ గడువు
కాగజ్‌నగర్ టౌన్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే కొనసాగుతోంది. సర్వేచివరి తేదీ ఈనెల31న ఉన్నప్పటికీ మరింత పొడి గించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కొద్దిరోజులుగా సర్వేలో సాంకేతిక సమస్యలు వస్తుండడంతో పూర్తిస్థాయిలో చేయాలంటే మరింత గడువు కావాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు, సిబ్బంది మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు శ్రమిస్తున్నారు. గత జనవరి నెలలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు తదితర విషయాలపై ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించి కసరత్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఆయాచోట్ల నిర్మాణంలో ఉన్న, పూర్తి అయిన డబుల్ బెడ్ రూం ఇండ్లపై అధికారులు దృష్టిపెట్టి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలమేరకు సర్వే చేపడు తున్నారు. కొన్నిచోట్ల మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్‌రూం ఇండ్లపై ఉన్నతాధికారులు ప్రత్యేక ద ృష్టిపెట్టారు.
నియోజకవర్గానికి 3500ఇండ్లు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి ఇందిరమ్మ పథకం కింద 3500ఇండ్లను మంజూరు చేస్తూ ప్రకటించింది. ఇందుకోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. సర్వేలో భాగంగా సిబ్బంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న కుటుంబ వివరాలు, ఫొటోతోపాటు పూర్తిస్థాయిలో వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30వార్డులకు గానూ ఆయా పథకాలకు 15230దరఖాస్తులు రాగా, వీటిలో 10890దరఖాస్తులు కేవలం ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ఇందులో బాగంగా ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సర్వే అనంతరం ఎస్‌హెచ్‌జీ, మున్సిపల్, మున్సిపల్ వార్డు ప్రతినిధితో వార్డు సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను పక్కాగా ఎంపిక చేయనున్నారు. త్వరలోనే ప్రభుత్వం ఇచ్చే విధివిధాలను అనుసరించి ఇండ్ల మంజూరు చేయనున్నారు. ఇళ్లులేని వారికి సొంత జాగా ఉంటే వారి వివరాలను పొందుపరుస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆదేశాలు ఇవ్వడంతో ప్రణాళిక బద్దంగా అమలు పరుస్తున్నారు. అద్దె ఇంట్లో ఉండడం, కుటుంబ వివరాలు, తదితర అన్ని సమగ్రంగా నమోదు చేసుకుంటున్నారు. ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షల రూపాయలు విడతల వారీగా అందించనున్నారు. సర్వేపూర్తి కాగానే లబ్ధిదారులను ప్రకటించనున్నారు. ఇందుకోసం గతంలో ఉన్న హౌజింగ్ సిబ్బందితోపాటు అదనంగా సిబ్బందిని తీసుకొనే విషయంపై ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. కాగజ్‌నగర్‌లో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను కూడా ఇటీవల తిరిగి ప్రారంభించారు. నిర్మాణాలు పూర్తి అయినప్పటికీ పనులు పూర్తికాని పైపులైన్ కనెక్షన్స్, మరుగుదొడ్లు తదితర పనులు చేపడుతున్నారు. నూతన సంవత్సరంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.