Share News

Kumaram Bheem Asifabad: పులుల కోసం కొనసాగుతున్న అన్వేషణ

ABN , Publish Date - Jan 28 , 2024 | 10:49 PM

కాగజ్‌నగర్‌టౌన్‌, జనవరి 28: కాగజ్‌నగర్‌ దరిగాం అటవీ ప్రాంతంలో పులుల మృత్యువాత తర్వాత రాష్ట్ర అటవీ అధికారులు తేరుకొని పులుల జాడ కోసం అన్వేషణ ప్రారంభించారు. పదిహేను రోజుల నుంచి అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.

 Kumaram Bheem Asifabad:   పులుల కోసం కొనసాగుతున్న అన్వేషణ

-నిఘా పెంచిన అధికారులు

-ఇంకా ఆచూకీ లభించని రెండు పులులు

-అధికారికంగా ప్రకటించని అధికారులు

కాగజ్‌నగర్‌టౌన్‌, జనవరి 28: కాగజ్‌నగర్‌ దరిగాం అటవీ ప్రాంతంలో పులుల మృత్యువాత తర్వాత రాష్ట్ర అటవీ అధికారులు తేరుకొని పులుల జాడ కోసం అన్వేషణ ప్రారంభించారు. పదిహేను రోజుల నుంచి అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో వేణుబాబు, ఎఫ్‌ఆర్‌వో సట్ల వేణుగోపాల్‌, ఎఫ్‌ఎస్‌వో నారా పోశెట్టి, ఎఫ్‌బీవో శ్రీకాంత్‌లను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అడవిలోని మిగితా పులుల సంరక్షణ జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్‌ చూస్తున్నారు. కాగజ్‌నగర్‌ దరిగాం, వాంకిడి మండలం సర్కపల్లి అటవీప్రాంతాల్లోకి ఎవరినీ వెళ్లనీయటం లేదు. పొరకలు, బొంగులు కొట్టుకునే వారిని కూడా అటవీ ప్రాంతం లోనికి అనుమంతించడం లేదు. ఐతే వారం రోజుల క్రితం ట్రాప్‌ కెమెరాను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మహారాష్ట్ర నుంచి సిర్పూరు మీదుగా వేంపల్లి, దరిగాం, వాంకిడికి టైగర్‌ కారిడార్‌ ఉండటంతో పులులను ట్రాప్‌ చేసేందుకు కెమెరాలను అమర్చారు. కెమెరాను ధ్వంసం చేయటంతో అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతానికి ఎవరు వచ్చారు? వన్యప్రాణులకు ఏమైనా హానీ జరిగిందా? అనే కోణంలో సమీప గ్రామాల ప్రజలను మళ్లీ విచారిస్తున్నారు. అటవీప్రాంతంలో పులుల జాడ కోసం అన్వేషణ కొనసాగిస్తున్న ఫారెస్టు సిబ్బంది, అధికారులకు ట్రాప్‌కెమెరా ధ్వంసం అయిన విషయం దృష్టికి రాలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంకా ఆచూకీ లభించని రెండు పులులు..

విష ఆహారం తిన్న రెండు పులులు మృత్యువాత పడగా, మిగితా రెండు పులులు ఎక్కడున్నాయనే విషయం ఇంతవరకు తేలలేదు. అసలు బతికి ఉన్నాయా? లేక చనిపోయాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటవీప్రాంతంలో ట్రాప్‌కెమెరాలు బిగించి వాటి ఆచూకీ కనుగోనేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా ట్రాప్‌కెమెరా ధ్వంసం అయినట్టు తేలింది. ఈ ట్రాప్‌ కెమెరాలో పులికి సంబంధించిన ఏదైనా కీలక కదలికల సమాచారం ఉందా..? ఇంకా వేరే కెమెరాలు ఏమైనా ధ్వంసం అయ్యాయా అనే విషయాన్ని అధికారులు వెల్లడించటం లేదు. ట్రాప్‌ కెమెరా ధ్వంసం చేయడం ఫారెస్టు అధికారులకు సవాలుగా మారిందని అంటున్నారు. అయితే గతంలో పులుల విషయం గోప్యంగా ఉంచినట్లే తిరిగి ట్రాప్‌కెమెరా ధ్వంసం విషయాన్ని రహస్యంగా ఉంచటం కూడా అనుమానాలకు తావిస్తోంది. పులులు మృత్యువాత పడిన ఘటన ఆసిఫాబాద్‌ డివిజన్‌ వాంకిడి మండలం సర్కేపల్లి అటవీప్రాంతంలో జరుగగా, కాగజ్‌నగర్‌ అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై వేటు వేయడంపై అటవీశాఖలోనే చర్చకు తెరలేచింది. వాస్తవంగా ఆసిఫాబాద్‌ జిల్లాలో కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ డివిజన్‌లున్నాయి. కాగజ్‌నగర్‌ డివిజన్‌ కింద దరిగాం ఉంది. అయితే పులులు మృత్యువాత పడ్డది మాత్రం పక్కనే ఉన్న అటవీ ప్రాంతం అయిన వాంకిడి మండలం సర్కేపల్లి అటవీప్రాంతం. ఇది ఆసిఫాబాద్‌ డివిజన్‌ పరిఽధిలోకి వస్తుంది. ఇక్కడ ఎప్‌డీవో పోస్టు ఖాళీగా ఉండడంతో డీఎఫ్‌వో నీరజ్‌ టీబ్రేవాల్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. సర్కేపల్లిలో ఘటనలో ఆసిఫాబాద్‌ అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఈ కోణంలో ఎందుకు విచారణ చేయలేదన్నది కూడా అటవీశాఖలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jan 28 , 2024 | 10:49 PM