Share News

Kumaram Bheem Asifabad: సర్దుబాటుతోనే సరి

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:45 PM

పెంచికలపేట, మార్చి 4: గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు మెరుగైన సేవలు అందించిన 104వ్యవస్థకు గత ప్రభుత్వం మంగళం పలికింది. దీంతో 104 వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్దుబాటు చేసింది.

 Kumaram Bheem Asifabad:   సర్దుబాటుతోనే సరి

- త్రిశంకు స్వర్గంలో 104 ఉద్యోగులు

- అయిదు నెలలుగా అంతని వేతనాలు

- వేతనాలు చెల్లించడంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం

- ఉమ్మడి జిల్లాలో 156మంది ఉద్యోగుల ఆవేదన

పెంచికలపేట, మార్చి 4: గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు మెరుగైన సేవలు అందించిన 104వ్యవస్థకు గత ప్రభుత్వం మంగళం పలికింది. దీంతో 104 వాహనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్దుబాటు చేసింది. కానీ జీతాలు మాత్రం సకాలంలో ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు వారికి జీతాలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబ రుస్తున్నారు. వాహనాలను పక్కన పెట్టినప్పటి నుంచి సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నా వేతనాల విషయంలో పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

గతేడాది అక్టోబరు నుంచి..

104లో పనిచేస్తూ ఇతరశాఖల్లో సర్దుబాటు చేసిన ఉద్యోగులకు గత ఏడాది అక్టోబరు నుంచి జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించలేక అప్పుల పాలవుతున్నారు. 104 వాహనాల్లో విధులు నిర్వర్తించిన ఉద్యోగులు రెండేళ్ల క్రితం ల్యాబ్‌ టెక్నీషియన్‌, డ్రైవర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, సెక్యూరిటీ గార్డ్‌ సేవలందించే వారు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 156మంది ఉద్యోగులు ఉండగా, 2022జనవరలో 104సేవలు రద్దు చేశాక సిబ్బందిని ఉమ్మడి జిల్లాలోని వివిధప్రాంతాల్లో వైద్యశాఖలో సర్దుబాటు చేశారు. అప్పటి నుంచి జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతూ నెట్టుకొస్తున్నారు. కానీ అయిదు నెలలుగా జీతాలు అందకపోవడంతో తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి తమ గోడు పట్టించుకోని వేతనాలు చెల్లించాలి వేడ్కొంటున్నారు.

తుప్పు పడుతున్న వాహనాలు..

మరో పక్క 104సేవలను రద్దు చేసిన ప్రభుత్వం వాహనాల నిర్వహణ కూడా గాలికి వదిలేసింది. 104సేవలు 2008లో అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడిజిల్లాలో సుమారుగా 45వాహనాల ద్వారా లక్షల మందికి సేవలందించారు. అయితే సేవలు నిలిచిపోయాక వాహనాలను మూలన పడేశారు. రెండేళ్లుగా వానకు తడిసి ఎండకు ఎండి అవి తుప్పుపట్టాయి. లక్షలు వెచ్చించి కొన్న వాహనాలు పిచ్చిమొక్కలకు ఆవాసాలై పూర్తి శిథిలావస్థకు చేరుతున్నాయి.

దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నాం..

- మహేందర్‌, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అఽధ్యక్షుడు

ఆరు నెలలు కావస్తున్నా వేతనాలు రాక దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. జిల్లాలో 31మంది 104ఉద్యోగులం ఉన్నాం. మా గోడును అర్థం చేసుకుని ఇప్పటికైనా అధికారులు స్పందించి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి.

Updated Date - Mar 04 , 2024 | 10:45 PM