Share News

Kumaram Bheem Asifabad: నిధులు రాక.. నిర్వహణ అస్తవ్యస్తం

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:52 PM

బెజ్జూరు, ఏప్రిల్‌ 19: అన్నదాతలకు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతువేదికల నిర్వహణ వ్యవసాయ విస్తరణ అధికారులకు తలకుమించిన భారంగా మారింది. గత ప్రభుత్వం రైతువేదికలను నిర్మించింది. అయితే వాటి నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల చేయలేదు.

 Kumaram Bheem Asifabad:  నిధులు రాక.. నిర్వహణ అస్తవ్యస్తం

- రైతు వేదికలను విస్మరించిన ప్రభుత్వం

- సొంతంగా ఖర్చులను భరిస్తున్న ఏఈవోలు

- రెండేళ్లుగా రాని నిధులు

- విద్యుత్‌ బిల్లులు కూడా కట్టలేని దుస్థితి

- నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం

బెజ్జూరు, ఏప్రిల్‌ 19: అన్నదాతలకు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతువేదికల నిర్వహణ వ్యవసాయ విస్తరణ అధికారులకు తలకుమించిన భారంగా మారింది. గత ప్రభుత్వం రైతువేదికలను నిర్మించింది. అయితే వాటి నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల చేయలేదు. దీంతో కనీసం విద్యుత్‌ చార్జీలు చెల్లించే పరిస్థితి లేదు. వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులు, పంటల సాగులో వారికి అవసరమయ్యే సలహాలు, సూచనలు ఇవ్వడానికి 2021లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో క్లస్టర్ల వారీగా రైతు వేదికలకు నిర్మించారు. ఒక్కో రైతువేదికను రూ.22లక్షలతో నిర్మించారు. ఒక్కో వేదికకు వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించారు. వారు రోజు ఉదయం, సాయంత్రం వేదికల్లో అన్నదాతలకు అందుబాటులో ఉంటూ మిగితా సమయాల్లో క్షేత్రసందర్శన చేసి సలహాలు, సూచనలు అందించాల్సి ఉంటుంది. వ్యవసాయ అఽధికారులు రైతులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా వేదికలో వసతి కల్పించారు. ప్రత్యేకంగా ఫర్నీచర్‌ను సమకూర్చారు. శిక్షణ కార్యక్రమాలకు అవసరమైన కుర్చీలు, మైకు వంటివి ఏర్పాటు చేశారు. వీటిని వ్యవసాయశాఖతో పాటు ఇతరశాఖలు కూడా వినియోగించుకున్నాయి. ఊరికి దూరంగా నిర్మించిన వీటిలో పారిశుధ్యం తదితర పనులకు సహాయకుడిని నియమిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట మరిచిపోయింది. రైతువేదికల్లోని విలువైన సామగ్రి దొంగలపాలవుతుండటంతో వ్యవసాయవిస్తరణ అధికారులే తమ సొంతఖర్చుతో వాచ్‌మెన్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రస్తుతం వాటి నిర్వహణ పట్టించుకునే వారు లేరు.

కోట్లలో బకాయిలు..

రైతువేదికల్లో మంచినీరు, విద్యుత్‌, పారిశుధ్యం వంటి నిర్వహణ ఖర్చుల నిమిత్తం ప్రతీనెల రూ.9వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ రెండేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో పలు ప్రాంతాల్లో సంబంధిత అధికారులు కొందరు వారి వేతనం నుంచి ఖర్చులు చెల్లించారు. 2022ఏప్రిల్‌ నుంచి 2022ఆగస్టు వరకు ఐదు నెలలకు ఒక్కో రైతువేదికకు గాను రూ.45వేలు అందించింది. అటు తర్వాత నుంచి ఇప్పటివరకు నిధులే లేవు. జిల్లాలో 70రైతువేదికలు ఉండగా కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కేంద్రానికి ప్రభుత్వం రూ.1.35లక్షలు బకాయి పడినట్లు లెక్క. కాగా దశాబ్ది ఉత్సవాల పేరిట చేపట్టిన కార్యక్రమాల్లోనూ కొందరు అధికారులు ఆవరణలు శుభ్రం చేయించడం, ఇతర పనులకు సొంతంగా డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. అందుకు ఒక్కో కేంద్రానికి కనీసం రూ.10వేలు వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో చేసిన పనికి డబ్బులు ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తుందన్న ఆశ ఎలాగూ లేదు. కనీసం నెలవారి ఖర్చులైనా ఏ నెలకానెలా ఇవ్వకపోవడంతో రైతువేదికల నిర్వహణ గాడితప్పి లక్ష్యం నీరుగారిపోతోంది.

భారమైన నిర్వహణ..

నెలల తరబడి నిర్వహణకు నిధులు మంజూరు కాకపోవడంతో రైతువేదికల నిర్వహణ ఇబ్బందిగా మారింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో వ్యవసాయ విస్తరణ అధికారులే సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగింపు దశలోనైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆశించారు. అయినా ప్రభుత్వపరంగా ఎలాంటి స్పందన లేదు. మరో రెండు నెలల్లో వానాకాలం సీజన్‌ దృష్టిలో పెట్టుకొని నిధులు విడుదల చేయాల్సిన అవసరముంది. రైతువేదిక నిర్వహణ నిధులపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయని కారణంగా తామే సొంతంగా డబ్బులు పెడుతున్నామని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు.

ఖర్చులు ఇలా..

రైతువేదికల నిర్వహణ వ్యవసాయ విస్తరణ అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. విద్యుత్‌ చార్జీలకు రూ.1000, స్టేషనరీ జిరాక్స్‌లకు రూ.1000, శిక్షణా కార్యక్రమాలకు రూ.2500, తాగునీటి కోసం రూ.5010, పరిశుభ్రత, కాపలాదారు కోసం రూ.3000 ప్రతినెలా ఖర్చవుతున్నాయి. కరెంట్‌ బిల్లుల విషయంలో మరీ ఒత్తిడి పెరుగుతోంది. సకాలంలో బిల్లు చెల్లించకపోతే విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నారని, దీంతో విధిలేని పరిస్థితుల్లో తామే డబ్బులు చెల్లిస్తున్నామని పేర్కొంటున్నారు. కనీసం మరుగుదొడ్ల నిర్వహణకు కూడా నిధులు లేవని అన్నీ తామే భరించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. అధికారులకు ఈ విషయం చెబితే ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని మీరే భరించుకోవాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతువేదికల నిర్వహణ మోయలేని భారంగా మారిందని వాపోతున్నారు.

ప్రతినెలా నివేదిక పంపిస్తున్నాం..

- రాజులనాయుడు, ఏడీఏ, పెంచికలపేట

రైతువేదికల నిర్వహణకు సంబంధించి నిధుల కోసం ప్రతినెలా ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నాం. త్వరలోనే ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. కొత్త ప్రభుత్వ మైనా మా కష్టాలు గుర్తించి నిధులు విడుదల చేస్తుందని ఆశిస్తున్నాం.

Updated Date - Apr 19 , 2024 | 10:52 PM