Share News

Kumaram Bheem Asifabad: దిగుబడి లేదు.. ధర లేదు..

ABN , Publish Date - Nov 28 , 2024 | 10:37 PM

చింతలమానేపల్లి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన పత్తి రైతులు చిత్తవుతున్నారు.

Kumaram Bheem Asifabad:   దిగుబడి లేదు.. ధర లేదు..

- తీవ్రంగా నష్టపోతున్న పత్తిరైతు

- మూడేళ్ల క్రితం క్వింటాల్‌ పత్తి ధర రూ.9వేల పైనే..

- ప్రస్తుతం సీసీఐ ద్వారా మంచి పత్తి ధర రూ.7,521

- ప్రైవేటులో క్వింటాల్‌కు రూ.6,500నుంచి 6,800వరకు..

- అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తే మేలు..

- వ్యవసాయంపై సన్నగిల్లుతున్న ఆశలు..

చింతలమానేపల్లి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన పత్తి రైతులు చిత్తవుతున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడి లేక..మరోపక్క మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధర విషయంలో రైతులు దగా పడాల్సి వస్తోంది. మూడేళ్ల కిందట పత్తి ధర రూ.9వేల పైచిలుకు పలికితే ప్రస్తుతం క్వింటాల్‌ పత్తి ధర రూ.7వేలు మించడం లేదు. ఇక ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్‌ పత్తికి రూ.6,500 నుంచి 6,800మాత్రమే చెల్లిస్తున్నారు. సీసీఐ మాత్రం మంచి పత్తి 8శాతం లోపు తేమ ఉన్న దానికి ధర రూ.7,521 చెల్లిస్తామని చెబుతున్నప్పటికీ ఎవ్వరికీ ఆ ధర రావడం లేదు. తేమశాతం పేరిట కొర్రీలు పెడుతూ క్వింటాల్‌కు రూ.40 నుంచి 140 వరకు కోత పెడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. భారత పత్తి సంస్థ ఉదాసీన వైఖరితో మూడేళ్లుగా ప్రైవేటు వ్యాపారులు నిర్ణయించిన ధరలో తగ్గుదలలే నమోదవుతున్నాయి. సీసీఐ సగటున 12శాతం తేమ వరకే కొనుగోలు చేస్తోంది. అయితే 8శాతం కంటే పెరిగితే ఒక్కో పాయింట్‌కు రూ.75చొప్పునకోత పడుతుంది. 12తేమ శాతం దాటితే సీసీఐ తిరస్కరిస్తే అది ప్రైవేటులో 7వేలు దాటడం లేదు. దీంతో సీసీఐ, వ్యాపారులు వ్యూహాత్మక కొనుగోళ్లతో పత్తి రైతుల బతుకు కుదేలవుతోంది.

జిల్లాలో 3.5లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగు..

జిల్లాలోని 15మండలాల పరిధిలో 3.5లక్షల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేశారు. ఎకరాకు సుమారుగా 10నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు, అతివృష్టి, అనా వృష్టి తదితర కారణాలతో దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకు సుమారుగా 5-8 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. దీనికితోడు విపరీతమైన ఖర్చులు, ధరలు ఆశించిన స్థాయిలో లేక వ్యవసాయంపై రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి.

ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందిస్తే మేలు..

ఏడాదికేడాది పత్తిధరల్లో భారీ వ్యత్యాసం ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాపా రులు నిర్ణయించిన ధరలే చెల్లుబాటు అవుతుండంతో రైతులకు గుదిబండగా మారుతోంది. దీంతో వ్యాపారులకు కలిసి వస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రైతాంగాన్ని ఆదుకునే విధంగా, మద్దతు ధర దక్కేలా చూడాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు, నాయకులు ఈ విషయంలో మౌనం వీడాలని రైతులు, రైతుసంఘాల నాయకులు కోరుతున్నారు.

పత్తి ధరలు ఇలా..

ఏడాది ధర(సుమారుగా)

2021-22 9,500

2022-23 8,250

2023-24 7,200

2024-25 7000

ఆశించిన స్థాయిలో దిగుబడి లేదు..

- తిరుపతి, రైతు

నాకున్న రెండెకరాల భూమిలో పత్తి పంట సాగుచేశాను. ఎకరాకు 10క్వింటాళ్ల వరకైనా దిగుబడి వస్తుందనుకుంటే 5-7క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చేలా ఉంది. దీనికితోడు ధర కూడా లేదు. ఖర్చులు విపరీతంగా పెరిగాయి. పెట్టిన ఖర్చులు మాత్రమే వచ్చేలా ఉన్నాయి. ప్రభుత్వాలు మద్దతు ధర పెంచాలి.

Updated Date - Nov 28 , 2024 | 10:37 PM