Share News

Kumaram Bheem Asifabad: జోరుగా.. బెట్టింగ్‌

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:02 PM

కాగజ్‌నగర్‌ టౌన్‌, జూలై 28: కాగజ్‌నగర్‌ కేంద్రంగా బెట్టింగ్‌ల దందా జోరుగా కొనసాగుతోంది. అధికారులు అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నప్పటికీ బెట్టింగుల జోరు ఆగడం లేదు.

Kumaram Bheem Asifabad: జోరుగా.. బెట్టింగ్‌

-పక్కదారి పడుతున్న యువత

కాగజ్‌నగర్‌ టౌన్‌, జూలై 28: కాగజ్‌నగర్‌ కేంద్రంగా బెట్టింగ్‌ల దందా జోరుగా కొనసాగుతోంది. అధికారులు అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నప్పటికీ బెట్టింగుల జోరు ఆగడం లేదు. పట్టణమంతా బెట్టింగ్‌ బ్రోకర్లదే హవా కొనసాగుతోంది. పట్టణంలో కొన్నినెలల నుంచి స్నూకర్‌ గేమ్‌ను నిర్వాహకులు ఆడిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు యువకులే బెట్టింగ్‌లు పెట్టుకుంటూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఈ ఆటల్లోనే లీనమవుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఓ మహిళ.. స్నూకర్‌ సెంటర్‌ నిర్వాహకుడిని నిలదీసి సోషల్‌ మీడియాలో వీడియో పోస్టు చేయటంతో అది కాస్తా వైరల్‌ అయింది. సమయపాలన లేకుండా ఆడేస్తుండటం ప్రతీగేమ్‌కు బెట్టింగ్‌ పెట్టి ఆడిస్తుండడంతో సదరు మహిళ కన్న కొడుకు కోసం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంత యథేచ్ఛగా బెట్టింగ్‌ నడుస్తున్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదనే సందేహాలు నెలకొన్నాయి. యువత బానిస అవుతున్నా కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులే ఎక్కువగా ఈ గేమ్‌లను ఆడుతున్నారు. ఒక్కొక్క గేమ్‌కు రూ.500నుంచి రూ.1000వరకు వసూలు చేస్తున్నారు. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్దంగా స్నూకర్‌ గేమ్‌ నిర్వహిస్తుండడంతో పోలీసులు ఈ గేమ్‌కు చెక్‌ పెట్టారు.

యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు..

స్నూకర్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ కాగజ్‌నగర్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. టీవీలో క్రికెట్‌ వస్తే చాలు యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. స్థానికంగా కొంతమంది బ్రోకర్లు ఈ దందాను నడిపిస్తున్నారు. వీటిని అరికట్టేందుకు పోలీసులు గతంలో కూడా కొన్నిమార్లు దాడులు చేసినప్పటికీ మళ్లీ యధావిధిగా కొనసాగిస్తున్నారు. వేయి నుంచి మొదలుకొని లక్షల్లో ఈదందాను యథేచ్ఛగా నడిపిస్తున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా క్రికెట్‌ బెట్టింగ్‌ నడుస్తోంది. క్రికెట్‌లో ఏ జట్టు బ్యాట్స్‌మెన్‌ ఎంత స్కోర్‌ చేస్తాడు.? ఆఫ్‌ సెంచరీ..? సెంచరీ..? చేసే బ్యాట్స్‌మెన్‌ పేరిట బెట్టింగ్‌, అలాగే బౌలర్‌ విషయంలో ఏ బౌలర్‌ ఎన్ని వికెట్లు తీస్తాడు.? ఇలా బెట్టింగ్‌లు ఫోన్‌ ద్వారా వాట్సాప్‌లో సందేశాలు చేస్తూ పెడుతున్నారు. బెట్టింగ్‌లో ఎక్కువ శాతం నష్టపోతున్నట్టు తెలిసింది. అయినప్పటికీ ఒక్కసారి నెగ్గితే మన డబ్బులు మనకే వస్తాయన్న ఆశతో అప్పులు చేసి మరీ పెట్టుబుడులు పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి బెట్టింగ్‌ దందాపై గట్టి నిఘాపెట్టాలని పట్టణవాసులు డిమాండు చేస్తున్నారు.

నిఘా పెడుతున్నాం..

-శంకరయ్య, సీఐ, కాగజ్‌నగర్‌

కాగజ్‌నగర్‌లో బెట్టింగ్‌ దందాలపై నిఘా పెడుతున్నాం. కొంత మందిపై కేసుల కూడా నమోదు చేశాం. ఆన్‌లైన్‌ దందాపై కూడా తమ సిబ్బందితో ప్రత్యేక నిఘా పెట్టాం. సమాచారం అందిస్తే తప్పకుండా కేసు నమోదు చేస్తాం.

Updated Date - Jul 28 , 2024 | 11:02 PM