Share News

Kumaram Bheem Asifabad: చినుకు జాడేది?

ABN , Publish Date - Jun 12 , 2024 | 10:47 PM

జూన్‌ మొదటివారంలో రావాల్సిన రుతుపవనాలు పది రోజులైనా జాడ లేవు. ఇప్పటికీ ఎండలు, వడగాలులు తగ్గుముఖం పట్టలేదు. వర్షాలకోసం చేలు, పొలాలు సిద్ధం చేసుకున్న రైతులు ఆందోళనలో ఉన్నారు. రైతులు వానల కోసం ఎదురు చూస్తున్నారు. గడిచిన మే చివరి వారం తీవ్రమైన గాలి, అకాల వర్షాలు కురిసాయి. గతేడాది జూన్‌లో ప్రారంభైన వర్షాలు ఈ ఏడాది మాత్రం జూన్‌ రెండు వారాలు గడస్తున్నా కూడా జాడ లేవు.

 Kumaram Bheem Asifabad:  చినుకు జాడేది?

- జూన్‌ ప్రారంభమై పదిరోజులు

- ఆశించిన స్థాయిలో కురవని వానలు

- దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు

- ఇప్పటికీ తగ్గని ఎండలు, తీవ్రమైన వడగాలులు

- వర్షం కోసం రైతుల ఎదురుచూపులు

జూన్‌ మొదటివారంలో రావాల్సిన రుతుపవనాలు పది రోజులైనా జాడ లేవు. ఇప్పటికీ ఎండలు, వడగాలులు తగ్గుముఖం పట్టలేదు. వర్షాలకోసం చేలు, పొలాలు సిద్ధం చేసుకున్న రైతులు ఆందోళనలో ఉన్నారు. రైతులు వానల కోసం ఎదురు చూస్తున్నారు. గడిచిన మే చివరి వారం తీవ్రమైన గాలి, అకాల వర్షాలు కురిసాయి. గతేడాది జూన్‌లో ప్రారంభైన వర్షాలు ఈ ఏడాది మాత్రం జూన్‌ రెండు వారాలు గడస్తున్నా కూడా జాడ లేవు.

- ఆసిఫాబాద్‌

రోహిణి కార్తె పోయింది. ప్రస్తుతం మృగశిర నడుస్తోంది. అయినా చినుకు జాడలేదు. ఎండలు తగ్గడం లేదు. నిజానికి జూన్‌ రెండోవారం వరకు రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాలి. సాధారణంగా జిల్లాలో జూన్‌లో 60 నుంచి 70మిల్లీమీటర్ల వర్షాలు కురుస్తాయి. కానీ ఇప్పటివరకు జిల్లాలో 20మిల్లీమీటర్ల వర్షాలు మూత్రమే కురిసాయి. దీంతో సాధారణం కన్నా తక్కువ వర్షాపాతం నమోదయ్యే పరిస్థితి కనబడుతోంది. జూన్‌ మొదటి వారం నుంచే తొలకరి జల్లులు ప్రారంభం కావాలి. ఒకటి,రెండు రోజులు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినా మళ్లీ జిల్లాలో మాత్రం మబ్బుల జాడ కనబడటం లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రైతులు పొలాలు, చేలు సిద్ధం చేసుకుని వానల కోసం ఎదురు చూస్తున్నారు. గత నెలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడ్డాయి. దీంతో ఆయాప్రాంతాల్లో రైతులు దుక్కులను సిద్ధం చేసుకున్నారు. వానలు పడగానే విత్తనాలు పెట్టేందుకు రెడీగా ఉన్నారు. కానీ ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడంలేదు. దీంతోసాగుకు రైతులు భయపడుతున్నారు. వర్షాలు కురిస్తే కానీ ఏం చేసే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.

భూగర్భ నీటికి కటకటే..

ఈ ఏడాది ఎండలు దంచి కొట్టడంతో భూగర్భజలాలు కూడా అడుగంటి పోయాయి. మళ్లీ వానలు కురిస్తే తప్పా భూరగ్భజలాలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. పంటకాలం లేటవుతుందని బోర్ల సహాయంతో పంటను పండిద్దామనుకుంటున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. చెరువులు చుక్క నీరులేకుండా ఎండిపోయాయి. ఆయకట్టు రైతులు కూడా వానలు కురిస్తేనే వరిసాగు చేయనున్నారు.

చేలను సిద్ధం చేసుకున్న పత్తి రైతులు..

జిల్లాలో పత్తి రైతులు ప్రస్తుతం తమపంట చేనులను సిద్ధం చేసుకున్నారు. ప్రతి ఏడాది తొలకరి మబ్బులు వచ్చిన తరువాత పాడి దుక్కుల్లోనే విత్తనాలు పెట్టేవారు. ఈసారి మబ్బుల జాడ లేకపోవడంతో పాడి దుక్కుల్లో విత్తనాలు వేసేందుకు రైతులు మొగ్గు చూడం లేదు. గతేడాది ముందుగా వానలు రావడంతో జూన్‌ మొదటి వారంలోనే చాలామంది పత్తి రైతులు విత్తనాలు వేశారు. ఈ సారి అటువంటి పరిస్థితి లేదు. ఒక వేళ రైతులు ధైర్యం చేసి విత్తనాలు వేద్దామనుకున్నా తరువాత వానలు రాకపోతే పరిస్థితి ఏంటనే ఆలోచనలో ఉన్నారు. ఒక వాన కురిసిన తరువాత విత్తనాలు వేస్తే ఆ తరువాత వానలు మందగిస్తే మొదటికే మోసం వస్తుందని అనుకుంటున్నారు. వానలు విస్తారంగా కురిసే పరిస్తితి ఉంటేనే పత్తివిత్తనాలు విత్తుకోవాలనే ఆలోచనలో రైతులు ఉన్నారు. కొన్ని మండలాలలో రైతులు కురిసిన కొద్దిపాటి వర్షాలకే విత్తనాలు విత్తి వర్షాలకోసం ఎదురు చూస్తున్నారు.

జిల్లాలో 4,60,196 ఎకరాల్లో పంటల సాగు..

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 4,60,196ఎకరాల్లో వివిధరకాల పంటలు సాగవుతాయని అంచనాలు వేశారు. సాధారణ సాగుకుమించి పంటలు సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అయితే వీటిలో పత్తి 3.5లక్షల ఎకరాలు, వరి59,212ఎకరాలు సాగవుతుందని అధికారులు అంచనాలు వేశారు. మొక్కజొన్న 742ఎకరాలు, జొన్న 680ఎకరాలు, పెసర 1700ఎకరాలు, మినుములు 163ఎకరాలు, కంది 38,239 ఎకరాలు సాగవుతున్నట్లు అంచనాలు రూపొందించారు. అలాగే సోయబీన్‌ 6089ఎకరాలు, మిరప3173 ఎకరాలు, వేరుశెనగ 178ఎకరాలు, అముదాలు 10ఎకరాలు, నువ్వులు 10ఎకరాలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనాలు రూపొందించారు.

రైతులు వర్షాలు పడే వరకు ఆగాలి..

- ఖాదర్‌హుస్సేన్‌, వ్యవసాయాధికారి, ఆసిఫాబాద్‌

రైతులు తొందర పడవద్దు. వర్షాలు పడే వరకు ఆగాలి. ఒకటి రెండు తేలికపాటి వర్షాలకు విత్తనాలు నాటితే ఆ తరువాత వర్షాలు పడకపోతే విత్తనాలు మురిగిపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో మళ్లీ విత్తనాలు నాటుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. దీంతో రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పంట సాగు కోసం రైతులు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే మంచిది.

Updated Date - Jun 12 , 2024 | 10:47 PM