Share News

Kumaram Bheem Asifabad: అతివలకు బీమా..

ABN , Publish Date - Sep 02 , 2024 | 10:55 PM

వాంకిడి, సెప్టెంబరు 2: మహిళాశక్తి పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. ఉచితంగా రుణబీమా, ప్రమాదబీమా పేరుతో రెండురకాల వసతులను కల్పిస్తోంది.

Kumaram Bheem Asifabad:  అతివలకు బీమా..

- అవగాహనతోనే ధీమా

- స్వయం సహాయక సంఘాల సభ్యులకు చేకూరనున్న ప్రయోజనం

వాంకిడి, సెప్టెంబరు 2: మహిళాశక్తి పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. ఉచితంగా రుణబీమా, ప్రమాదబీమా పేరుతో రెండురకాల వసతులను కల్పిస్తోంది. పొదుపుసంఘం సభ్యురాలు మృతిచెందితే రుణం చెల్లించడం కుటుంబసభ్యులకు భారంగా మారుతోంది. అలాగే అప్పుతీసుకున్న మహిళ ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రుణమాఫీతోపాటు ప్రమాదబీమా ద్వారా ఆర్థికసాయం అందనుంది. మార్చిలోనే రుణబీమా ప్రకటించగా తాజాగా ప్రమాదబీమాకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీచేసింది. ఈ రెండు పథకాలు గడిచిన మార్చి నుంచి అమల్లోకి వస్తున్నాయి.

- 87,000 మందికి ప్రయోజనం..

జిల్లా వ్యప్తంగా 15మండలాల్లో 7946స్వయం సహాయక సంఘాలకు చెందిన 87వేలమంది సభ్యులు ఉన్నారు. వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చిరు వ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, సీఐఎఫ్‌, మహిళాశక్తి పథకాల ద్వారా వివిధ రకాల రుణాలు అందజేస్తున్నారు.

- ప్రమాద బీమా రూ.10లక్షలు

పొదుపు సంఘాల మహిళలు ప్రమాదవశాత్తు మృతిచెందితే అలాంటి వారి కటుంబాలకు రూ.10లక్షల ఉచితబీమా వర్తింపచేయనున్నారు. ఒకవేళ వంద శాతం వైకల్యం కలిగినా రూ.10లక్షలు అందిస్తారు. 50శాతం వైకల్యం కలిగితే రూ.5లక్షలు చెల్లిస్తారు. మృతిచెందిన మహిళలకు పొదుపు అప్పు ఉంటే అది కూడా మాఫీ చేస్తారు. గాయాలైన మహిళ అంగవైకల్యం తెలుపుతూ సదరం ధ్రువపత్రాలు, చికిత్స పొందిన అసుపత్రి పత్రాలు సమర్పించాలి. మరణించిన వారి పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. 18 నుంచి 60ఏళ్ల వయసున్న పొదుపు మహిళలకు ఇది వర్తిస్తుంది.

-రుణ బీమా రూ.2లక్షలు

గ్రూపుగా ఒక్కో సంఘానికి రూ.5నుంచి రూ.20లక్షల వరకు ప్రస్తుతం రుణాలు అందిస్తున్నారు. రుణం పొందిన మహిళల్లో ఎవరైనా మరణిస్తే వడ్డీతో కలిపి ఆమె కుటుంబ సభ్యులు చెల్లించాల్సి వచ్చేది. అలా చెల్లించకపోతే ఆ ప్రభావం గ్రూపు సభ్యులపై పడేది. ప్రస్తుతం పొదుపు మహిళలకు ప్రభుత్వం రూ.2లక్షల వరకు రుణబీమా వర్తింపుచేస్తుంది. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి పథకాల ద్వారా రుణం పొందిన మహిళ చనిపోతే ఆమె కట్టాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది.

- అవగాహన అవసరం

ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు పథకాలలో అర్హత సాధించాలంటే తప్పనిసరిగా అన్ని గ్రూపులవారు నెలవారీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన వివరాలు మినిట్స్‌ పుస్తకంలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. పొదుపురుణం క్రమం తప్పకుండా చెల్లిస్తుండాలి. వీటి వివరాలు ఉండాలి. అయితే ఇలాంటి వాటిపై మహిళల్లో అవగాహన లేదు. రుణం పొందే సమయంలో మాత్రమే వీవోలు నమోదు చేస్తున్నారు. దీనిపై సెర్ప్‌, మెప్మా అధికారులు దృష్టిసారించాలి.

- ఎంతో ప్రయోజనం..

- మహేష్‌, ఏపీఎం, వాంకిడి

మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు రెండురకాల బీమా సౌకర్యం కల్పించడంవల్ల ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ నిర్ణయంతో వారి కుటుంబాలకు, రుణం ఇచ్చిన బ్యాంకులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. దీనిపై మహిళా సంఘాలకు అవ గాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Sep 02 , 2024 | 10:55 PM