Share News

Kumaram Bheem Asifabad: ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:23 PM

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మహిళలు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మగవారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదకరగా ఫుట్‌బోర్డు ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. రద్దీగా ఉండే రూట్లలో అదనపు బస్సులను నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Kumaram Bheem Asifabad:  ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ

-మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల తాకిడి

-స్థాయికి మించి ప్రయాణాలు

-అదనంగా బస్సులు నడిపించాలని డిమాండ్‌

-పట్టించుకోని అధికారులు

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మహిళలు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మగవారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదకరగా ఫుట్‌బోర్డు ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. రద్దీగా ఉండే రూట్లలో అదనపు బస్సులను నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

కాగజ్‌నగర్‌, జూలై 8: ప్రభుత్వం గతేడాది డిసెంబరు 9మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకంతో ఆర్టీసీకి ఒక్కసారిగా పూర్వవైభవం వచ్చినట్లయింది. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించటంతో బస్సులు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ఆర్టీసీ బస్సు సామర్థ్యం 58సీట్లకు పరిమితి ఉండగా, ప్రస్తుతం అంతకు మించి ప్రయాణాలు సాగిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతోందనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

ప్రయాణికుల భద్రతేది..

జిల్లాలో ఆసిఫాబాద్‌ బస్సు డిపో ద్వారా వివిధ రూట్లలో బస్సులు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చుతున్నాయి. ముఖ్యంగా సిర్పూరు నుంచి కౌటాల, చింతలమానేపల్లి, దహెగాం రూట్లలో వెళ్లే పల్లెవెలుగు బస్సుల్లో రద్దీ అధికంగా ఉంటోంది. ఒక్కొక్క బస్సులో స్థాయికి మించి ప్రయాణికులు వెళుతున్నారు. అలాగే ఫుట్‌ బోర్డు ప్రయాణాలు చేస్తున్నారు. ఒకవైపు రద్దీ అధికంగా ఉండటంతో అధికారులు కూడా చేసేదీ ఏమీ లేక బస్సుల్లోకి అనుమతిస్తున్నారు. కాగజ్‌నగర్‌ నుంచి కౌటాల మీదుగా ప్రయాణాలు చేసేందుకు పలుచోట్ల రోడ్డు సౌకర్యం బాగా లేదు. అలాగే ఆర్టీసీ బస్సులు కూడా ఏ మాత్రం కండీషన్‌లో లేవని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఆదాయం కోసం చూడకుండా ప్రయాణికుల భద్రతను దృష్టిలోపెట్టుకొని ఆసిఫాబాద్‌, సిర్పూరు నియోజకవర్గాల్లో రద్దీ ఉండేమార్గాలను ముందస్తుగా గుర్తించి ఈ మార్గాల్లో అదనపు ట్రిప్‌ల ద్వారా బస్సులను నడిపించాలని అంతా డిమాండు చేస్తున్నారు. ట్రిప్‌లు పెంచకుండా ఉన్న బస్సుల ద్వారానే ప్రయాణాలు చేస్తే ముందస్తు చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. సామర్థ్యం కంటే అధికంగా ప్రయాణిలకులను తీసుకెళ్తే ప్రమాదాలు జరిగితే బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి బస్సుల్లో స్థాయికి మించి ప్రయాణాలు పూర్తిగా తగ్గించాలని, అదనంగా బస్సులను నడిపిం చాలని అంతా కోరుతున్నారు.

అన్ని చర్యలు తీసుకుంటాం..

- విశ్వనాథ్‌, ఆర్టీసీ డీఎం, ఆసిఫాబాద్‌

ఆర్టీసీ బస్సుల్లో ఫుట్‌ బోర్డు ప్రయాణం చేయకుండా చూసుకోవాలని కండక్టర్‌కు సూచిస్తున్నాం. అలాగే కాగజ్‌నగర్‌-బెజ్జూరు, కాగజ్‌నగర్‌-పెంచికల్‌పేట ప్రాంతాలకు రద్దీ అధికంగా ఉంటుంది. ఈ రూట్లో అదనంగా బస్సులు వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. బస్సు సామర్థ్యం మించి ప్రయాణీకులు వెళ్లకుండా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Jul 08 , 2024 | 11:23 PM