Share News

Kumaram Bheem Asifabad: కౌలు రైతుల ఎదురుచూపులు

ABN , Publish Date - Feb 28 , 2024 | 10:43 PM

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 28: ప్రభుత్వం ప్రకటనతో కౌలు రైతుల్లో సంతోషం నెలకొంది. ఉపాధి మార్గం లేక సొంత భూములు లేక భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నారు కౌలు రైతులు.

Kumaram Bheem Asifabad:   కౌలు రైతుల ఎదురుచూపులు

- సహాయం అందిస్తామని ప్రకటించిన సర్కారు

- ఖరారు కాని రైతు భరోసా విధివిధానాలు

- జిల్లాలో సుమారు 20వేలకు పైగా కౌలు రైతులు

- ఆరుగ్యారంటీల్లో నాలుగింటి అమలు

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 28: ప్రభుత్వం ప్రకటనతో కౌలు రైతుల్లో సంతోషం నెలకొంది. ఉపాధి మార్గం లేక సొంత భూములు లేక భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నారు కౌలు రైతులు. ఏడాదంత కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాలు ధర లేకపోయిన ప్రతికూల వాతవరణంలో గిట్టుబాటు తగ్గి అప్పుల్లో కూరుకుపోతున్నా ఏ ప్రభుత్వం కనికరం చూపలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లపాలనలో కౌలురైతులకు మొండిచేయి చూపింది. రాష్ట్రంలో నూతనంగా ఆధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కౌలురైతులను అదుకుంటామని రైతుభరోసా పథకం ద్వారా రైతులతో పాటు కౌలురైతులకు సైతం ఏడాదికి రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఇప్పటికే నాలుగు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టగా రైతు భరోసా కూడా అమలవుతుందన్నా సంతోషంలో రైతులు ఉన్నారు. కానీ విదివిధానాలను మాత్రం ఇప్పటికి ప్రకటించలేదు.

జిల్లాలో 20వేల కౌలు రైతులు..

జిల్లాలో అనధికారిక లెక్కల ప్రకారం సుమారు 20వేలకు పైగా కౌలు రైతులు ఉంటారు. వీరిలో అధికశాతం మంది పత్తిపంటను సాగు చేస్తు న్నారు. వర్షధార పంటలు ఇతర పంటలతో పోలిస్తే ఎక్కువ లాభాలు వచ్చే ఆవకాశాలు ఉండటంతో కౌలురైతులు పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో కౌలు భూముల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భూముల స్వభావాన్ని బట్టి ఎకరానికి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు కౌలు చెల్లించాల్సి వస్తుంది. ఇకగ్రామాలకు ఆనుకొని ఉన్న భూములు సారవంత మైన నల్లరేగడి, ఎర్రరేగడి భూములకు ఎకరానికి రూ.20వేల వరకు డిమాండ్‌ ఉంది. మూడేళ్ల క్రితం పత్తి క్వింటాళుకు రూ.11వేల వరకు ధర పలుకగా భూ యాజమానులు కౌలు ధరలు భారీగా పెంచారు. ఇది ఏటేటా పెరుగుతూనే వస్తోంది.

ఖరారు కాని విధివిధానాలు:

కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించే రైతుభరోస పథకంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి విధివిధానాలను ప్రకటించలేదు. ఈ పథకం అర్హుల గుర్తింపునకు ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకుంటుందోనని కౌలు రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. వచ్చే వానాకాలం సీజన్‌కోసం గ్రామాల్లో భూములను కౌలుకు తీసుకునే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నది. ప్రభుత్వం కౌలు రైతులకు సైతం ఆర్థిక భరోస కల్పిస్తామని ప్రకటించడంతో భూయాజమానులు కౌలు పత్రాలు రాసి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. కౌలు పత్రాలు రాసి ఇస్తే రైతు భరోస పథకానికి ఎక్కడ దూరమవుతోమోనని భూ యాజమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం కౌలురైతులను పూర్తిగా విస్మరించింది. భూ యాజమానులకు పంట పెట్టుబడి సహాయం అందించగా కౌలు రైతులకు ఎలాంటి సహాయం అందించలేదు.

ప్రభుత్వం ఆదుకోవాలి..

లట్కారీ శంకర్‌, కౌలురైతు, చింతలమానేపల్లి

ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలి. గతంతో పోలిస్తే ఈసారి భూముల కౌలు ధరలు బాగా పెరిగాయి. ఐదేకరాల భూమిని ఎకరానికి రూ. 15వేల చొప్పున కౌలుకు తీసుకున్నాను. ఇప్పటివరకు ఎలాంటి లాభం రాలేదు. సొంత భూమి లేకపోవడం మరో ఉపాధి మార్గం లేక తప్పని పరిస్థితిలో వ్యవసాయం చేయాల్సి వస్తోంది. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకొని ఇచ్చిన హామీని నెరవేర్చాలి.

ఏటేటా కౌలు ధరలు పెరుగుతున్నాయి..

గుండా సంతోష్‌, కౌలురైతు, ఆసిఫాబాద్‌

ప్రతిఏటా కౌలు ధరలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఎకరానికి రూ. 10నుంచి రూ. 15వేల వరకు ధర పలుకుతున్నది. గ్రామాలకు ఆనుకొని ఉన్న భూములకు డిమాండ్‌ చాలా ఉంది. అధిక ధరలకు కౌలు తీసుకొని సాగు చేస్తే వర్షాభావ పరిస్థితుల్లో దిగుబడి రాక నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి పెట్టుబడి సహాయం అందించాలి.

Updated Date - Feb 28 , 2024 | 10:43 PM