Share News

Kumaram Bheem Asifabad: బీఆర్‌ఎస్‌లో ఉన్నా బహుజన వాదినే

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:19 PM

కాగజ్‌నగర్‌, మార్చి 28: తన జీవితం బహుజనుల కోసమేనని, తాను బీఆర్‌ఎస్‌లో ఉన్నా కూడా బహుజనవాదిగానే ఉంటానని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. గురువారం కాగజ్‌నగర్‌ సంతోష్‌ ఫంక్షన్‌ హాలులో సిర్పూరు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Kumaram Bheem Asifabad:  బీఆర్‌ఎస్‌లో ఉన్నా బహుజన వాదినే

-బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

కాగజ్‌నగర్‌, మార్చి 28: తన జీవితం బహుజనుల కోసమేనని, తాను బీఆర్‌ఎస్‌లో ఉన్నా కూడా బహుజనవాదిగానే ఉంటానని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. గురువారం కాగజ్‌నగర్‌ సంతోష్‌ ఫంక్షన్‌ హాలులో సిర్పూరు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బహుజన వాద బలోపేతం కోసం తాను బీఎస్పీ అధినాయకత్వం ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తీసుకొని పొత్తును విడగొట్టిందన్నారు. దీంతో తాను పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బహుజన, తెలంగాణ వాదాన్ని అణగదొక్కేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగినట్టు తెలిపారు. రాష్ట్రంలో 186గురుకులాలు మంజూరై నట్టు పేర్కొన్నారు. దీంతో ఎంతో మంది విద్యార్థులు భవిష్యత్తు మారిందన్నారు. తెలంగాణ సాధించకున్న తర్వాత ఏర్పడిన పరిస్థితులు పూర్తిగా మారినట్టు గుర్తు చేశారు. బహుజన వాదం బలోపేతం కావాలంటే కేవలం రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఆదరించి ఓటేయాలన్నారు. తాను ద్రోహినని మాజీఎమ్మెల్యే కోనప్ప పేర్కొనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో తాను పొత్తులపై మాట్లాడుతుంటే ఇక్కడ ఆయన కాంగ్రెస్‌లోకి జంప్‌ కావటం ఎవరి ద్రోహో ప్రజలందరికీ అర్థం అవుతోందన్నారు. వారు అవినీతి, అక్రమాలు కప్పి పుచ్చుకునేందుకు పార్టీ మారినట్టు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. రథసారధి కేసీఆర్‌ చేపిట్టన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవన్నారు. తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఏం అమలు చేస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీపై ముప్పెటదాడి చేయాలంటే కేవలం ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ చేపట్టిన సంక్షేమ పథకాలతో మేలు జరిగినట్టు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికీ గ్యారంటీ లేదన్నారు. ఇక ఆరుగ్యారంటీలు ఏం అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ ఈ ప్రాంత సమస్యలు ఢిల్లీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఆదరించాలన్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌లోకి ప్రస్తుతం పులులు వస్తున్నాయని, ఇక్కడున్న మేకలు మాత్రం ఇతర పార్టీలోకి పోయినట్టు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నిరుపేదలకు అండగా ఉంటుందన్నారు. నాయకులు పోయినా కూడా కార్యకర్తలుంటున్నారంటే కేవలం తాము చేపట్టిన సంక్షేమ పథకాల వల్యే అని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ కూడా చేపట్టలేదన్నారు. తప్పకుండా ఆదరించి బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కౌన్సిలర్లు, మాజీకౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీలోని నాయకులు పలువురు బీఆర్‌ఎస్‌లోకి చేరటంతో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్‌లోకి చేరిన తర్వాత తొలిసారిగా కాగజ్‌నగర్‌కు రావటంతో నాయకులు, కార్యకర్తలు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను గజమాలతో సత్కరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు లెండుగురే శ్యాంరావు, శరత్‌ ముదిరాజ్‌, సీపీ రాజ్‌కుమార్‌, జడ్పీటీసీ పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 11:19 PM