Kumaram Bheem Asifabad :బయటి మార్కెట్‌లో ఈఎస్‌ఐ మందులు
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:11 PM
కాగజ్‌నగర్, అక్టోబరు 25: ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో రోగులకు ఇవ్వాల్సిన మందులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. మూడురోజుల క్రితం కరీంనగర్ జిల్లాలోని ఉస్మాన్‌పురవద్ద గల మెడికల్ షాపులో కాగజ్‌నగర్ డిస్పెన్సరీ ఫార్మాసిస్టు మురళి ఈఎస్‌ఐ మందులు అమ్ముతుండగా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు.

-కరీంనగర్‌లో అమ్ముతుండగా పట్టుకున్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు
కాగజ్‌నగర్, అక్టోబరు 25: ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో రోగులకు ఇవ్వాల్సిన మందులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. మూడురోజుల క్రితం కరీంనగర్ జిల్లాలోని ఉస్మాన్‌పురవద్ద గల మెడికల్ షాపులో కాగజ్‌నగర్ డిస్పెన్సరీ ఫార్మాసిస్టు మురళి ఈఎస్‌ఐ మందులు అమ్ముతుండగా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. ఈ అమ్మకాల్లో రూ.4.80లక్షల విలువగల డ్రగ్స్ అమ్మినట్టు తెలుస్తోంది.
పక్కాప్రణాళిక ప్రకారం కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కార్తీక్, భరద్వాజ్, శ్రవణ్, చందన కాగజ్‌నగర్ ఈఎస్సై నుంచి మందులు తరలిస్తున్న వాహనాన్ని వెంబడించి పట్టుకొని ఈ దందాలో పాల్గొన్న వారందరిపై కేసులు నమోదు చేశారు. కార్మికులకు, కార్మికుల కుటుంబాలకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన ఈఎస్‌ఐ డిస్పెన్సరీ మందులను బయటి మెడికల్ షాపులకు విక్రయిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. రోగులకిచ్చే మందులను సొంతానికి అమ్ముకోవటం అధికారు తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజులుగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కాగజ్‌నగర్ ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో స్టాక్ ఎంత ఉన్నది..? ఎంత మేర రోగులకిచ్చారు..? అనే కోణంపై సమగ్ర విచారణ జరిపారు. ఈ నివేదికలను ఈఎస్‌ఐ డైరెక్టర్‌కు అందజేశారు. డిస్పెన్సరీ ఫార్మాసిస్టు మురళిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నారు.
ఇంకా ఎంత మంది ఉన్నారు?
కాగజ్‌నగర్ ఈఎస్‌ఐ డిస్పెన్సరీలోని మందుల అమ్మకాల్లో ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ డిస్పెన్సరీలో ఎప్పటినుంచి ఈ వ్యవహారం నడుస్తోందనే విషయంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇలా ఒక్క కరీంనగర్‌లోనే విక్రయిస్తున్నారా.. మరెక్కడైనా విక్రయిస్తున్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇంకా ఎంతమంది ఈ వ్యవహారంలో ఉన్నారనే విషయమై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని ఈఎస్‌ఐ కార్డుదారులు డిమాండు చేస్తున్నారు. ఈఎస్‌ఐ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. నెలనెలా తనిఖీలు చేసి.. ఎంతస్టాక్ ఉంది..? ఎంత మిగిలింది..? అనే కోణంలో ప్రతినెల నివేదికలు తెప్పించుకుని విచారణ జరిపిస్తే దొడ్డిదారిన అమ్మకాలు జరిగేవి కావని పలువురు పేర్కొంటున్నారు.
పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నాం..
డాక్టర్ జగన్, ఈఎస్‌ఐ సూపరింటెండెంట్
ఈఎస్‌ఐ డిస్పెన్సరీలోని మందులను బయట విక్రయించడంపై విచారణ చేస్తున్నాం. స్టాక్‌పై కూడా విచారణ చేపడుతున్నాం. ఈ విషయాన్ని ఈఎస్‌ఐ డైరెక్టర్‌కు సమాచారం అందించాం. పూర్తి విచారణ జరిపి బాఽధ్యులపై చర్యలు తీసుకుంటాం.