Share News

Kumaram Bheem Asifabad: అభయ‘హస్తం’ డబ్బులు ఇచ్చేనా?

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:38 PM

పెంచికలపేట, ఏప్రిల్‌ 12: స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం ఉన్న మహిళలకు వృద్ధాప్యంలో చేయూత అందించేలా గతంలో ఉమ్మడిరాష్ట్రంలోని ఆనాటి కాంగ్రెస్‌ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని ప్రారంభించింది.

 Kumaram Bheem Asifabad: అభయ‘హస్తం’ డబ్బులు ఇచ్చేనా?

- ఉమ్మడిరాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నగదు జమ

- ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పథకం రద్దు

- జమ చేసిన నగదు చెల్లించాలంటున్న మహిళలు

- కొత్త సర్కారుపైనే ఆశలు

పెంచికలపేట, ఏప్రిల్‌ 12: స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం ఉన్న మహిళలకు వృద్ధాప్యంలో చేయూత అందించేలా గతంలో ఉమ్మడిరాష్ట్రంలోని ఆనాటి కాంగ్రెస్‌ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల కోసం మహిళలు ఈ పథకానికి డబ్బులు కూడా చెల్లించారు. తద్వారా మహిళా సభ్యుల పిల్లలకు ఉపకార వేతనాలు, వృద్ధాప్యంలో పింఛన్‌తోపాటు ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. తక్షణహాయం కింద అంత్యక్రి యలకు రూ.5వేలు ఇచ్చేవారు. అయితే ప్రత్యేకరాష్ట్రం ఏర్పడడం, తెలంగాణలో కొత్త ప్రభుత్వపాలన ప్రారంభమైన తర్వాత అభయహస్తం పథకాన్ని నిలిపివేసింది. దీంతో అప్పటివరకు అభయహస్తం కింద డబ్బులు చెల్లించిన మహిళలు తమ నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వచ్చారు. 2022మార్చిలో అభయహస్తం నగదు చెల్లించిన మహిళలను గుర్తించి వారికి తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఇంతవరకు చెల్లించలేదు.

పథకం ప్రారంభమైందిలా..

అభయహస్తం పథకాన్ని 2009లో ప్రారంభించగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండి 18నుంచి 60ఏళ్ల లోపు మహిళలను అర్హులుగా గుర్తించారు. పొదుపుసంఘాల్లోని మహిళా సభ్యులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. మహిళా సభ్యులు ఏటా రూ.365చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం రూ.360 జమ చేస్తూ ఉండేది. ఇలా జమ చేసిన డబ్బులతో 60ఏళ్లు నిండి తరువాత అభయహస్తం పథకం పెన్షన్‌ కింద ప్రతినెల రూ.500చొప్పున చెల్లించేవారు. అయిదేళ్ల పాటు వృద్ధులకు రూ.500 చొప్పున పెన్షన్‌ చెల్లించారు. ఆ తరువాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం, ప్రభుత్వం మారడంతో రాష్ట్రంలో ఆసరా పెన్షన్‌ అమలు చేయడం వృద్ధాప్య పింఛన్‌ కింద రూ.2016కు పెంచడంతో ఈ పథకం మూలన పడింది.

36,078 మంది సభ్యులకు లబ్ధి..

అభయహస్తం పథకానికి తాము చెల్లించిన నగదును తిరిగి ఇవ్వాలని చాలా కాలం నుంచి స్వయం సహాయక సంఘాల మహళలు కోరుతున్నారు. అయితే ఈ పథకం కింద కట్టిన డబ్బులకు వడ్డీతో కలసి ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా 36,078 మంది అభయహస్తం పథకం కింద రూ.9,17,92,000నగదు చెల్లించారు. సంబంధితశాఖ అధి కారులు లబ్ధిదారులను గుర్తించి సభ్యుల వివరాలు వారి బ్యాంకు ఖాతా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిపారు.

కొత్త ప్రభుత్వంపైనే ఆశలు..

అభయహస్తం పథకం ఉమ్మడిరాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అభయహస్తం డబ్బులు తిరిగి చెల్లిస్తారని లబ్ధిదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

డబ్బులు చెల్లించాలి..

- బోట్లకుంట ఎల్లమ్మ, దహెగాం

అభయహస్తం కింద పదేళ్ల క్రితం నగదు చెల్లించాం. ఇప్పటివరకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని కాలయాపన చేస్తున్నారే తప్ప ఇవ్వలేదు. ఇప్పటికైనా మా డబ్బులు తిరిగి చెల్లించాలి.

కొత్త ప్రభుత్వం డబ్బులు చెల్లించాలి..

- చౌదరి బాయమ్మ, పెంచికలపేట

2009లో పథకం కింద నగదును చెల్లించాం. తెలంగాణ వచ్చిన తరువాత ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. దీంతో మేము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతూనే ఉన్నాం. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాం. కొత్త ప్రభుత్వం అయినా మా డబ్బులు తిరిగి చెల్లించాలి.

Updated Date - Apr 12 , 2024 | 10:38 PM