Share News

Kumaram Bheem Asifabad: పల్లెల్లో అస్తవ్యస్తంగా పారిశుధ్యం

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:06 PM

చింతలమానేపల్లి, ఏప్రిల్‌ 18: గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ప్రత్యేక పాలనకు జిల్లాలో సరిపడా గెజిటెడ్‌ అధికారుల కొరత ఉండడంతో ఒక్కో అధికారికి నాలుగైదు గ్రామపంచాయతీల బాధ్యతలు అప్పగించారు.

 Kumaram Bheem Asifabad:  పల్లెల్లో అస్తవ్యస్తంగా పారిశుధ్యం

- జిల్లాలో ప్రత్యేకాధికారులతో పాలన

- సిబ్బందికి సైతం వేతనాలు సకాలంలో రాకపోవడంతో నిరాసక్తి

- జిల్లాలో 335 గ్రామపంచాయతీలు

చింతలమానేపల్లి, ఏప్రిల్‌ 18: గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ప్రత్యేక పాలనకు జిల్లాలో సరిపడా గెజిటెడ్‌ అధికారుల కొరత ఉండడంతో ఒక్కో అధికారికి నాలుగైదు గ్రామపంచాయతీల బాధ్యతలు అప్పగించారు. పంచా యతీ అధికారులు, గ్రామ సిబ్బందితో కలిసి అభివృద్ధి పనులు చేపట్టాలి. అయితే ప్రత్యేకాధికారుల పాలన కొనసాగి మూడు నెలలపైనే కావస్తున్నా గ్రామాలను వారు సందర్శించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఒక్కో అధికారికి మూడు, నాలుగు జీపీల బాధ్యతలు అప్పగించ డంతో ఏ గ్రామాన్ని సరిగా పర్యవేక్షించలేకపోతున్నారు. అలాగే చాలామంది తహసీల్దార్లు, డిప్యూటీతహసీల్దార్లు, పాఠశాల గెజిటెడ్‌ హెచ్‌ఎంలు, ఇంజనీ రింగ్‌ విభాగం నుంచే ప్రత్యేకాధికారులు ఉండండంతో వారు నిర్వహిస్తున్న శాఖ పనితీరు చూసుకోవడం, మళ్లీ గ్రామపంచాయతీల బాధ్యతలు అద నంగా చూడడం వారికి భారమవుతోంది. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్థంగా తయారవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు..

జిల్లాలో 335 గ్రామ పంచాయతీలుండగా, 124మంది గెజిగెడ్‌ అధికారులు ప్రత్యేకాధికారులుగా నియమితులయ్యారు. అయితే గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేకాధికారులు తమ సెల్‌ఫోన్‌ ద్వారా గ్రామాల పరిస్థితులు ఆరా తీయడం, సూచనలు చేయడం వంటివి మాత్రమే చేస్తున్నారు. అయితే ప్రత్యేకాధికారులుగా నియమితులైన అధికారులు విధిగా వారంలో కనీసం రెండుసార్లు అయినా తమకు కేటాయించిన గ్రామ పంచాయతీలను సందర్శించి అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి. కానీ నెల రోజులకోసారి కూడా గ్రామ పంచాయతీల ముఖం చూడడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

పారిశుధ్యం అస్థవస్థం..

జిల్లాలోని చాలా గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం అస్థవ్యస్థంగా మారింది. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, జీపీల్లో పనిచేస్తున్న కార్మికులకు సైతం నెలనెలా వేతనాలు రాకపోవడంతో వారు కూడా పనులు చేయడానికి నిరాసక్తి కనబరుస్తున్నారు. రోజుల తరబడి మురికి కాలువల్లో పూడిక తీయక దుర్గంధం వెదజల్లుతోంది. కొన్నిగ్రామాల్లో పందుల స్వైరవిహారంతో గ్రామాలు కంపు కొడుతున్నాయి. దీంతో దుర్వాసనతోపాటు దోమలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చెత్తా చెదారం కూడా ఎక్కడికక్కడే పేరుకుపోతోంది. దీనికి తోడు తాగునీరు కోసం మిషన్‌ భగీరథ ద్వారా పంపిణీ చేసే నీరు కూడా చాలా గ్రామాల్లో సరఫరా కావడం లేదు. తాగునీటి వనరులు మరమ్మతులకు గురైనా పట్టించు కోవడం లేదన్న విమర్శలున్నాయి. పారిశుధ్యం, తాగునీరు వంటి వాటిపై ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం..

- భిక్షపతిగౌడ్‌, డీపీవో

జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పారిశుధ్యంపై ప్రత్యేకదృష్టి సారిస్తున్నాం. ప్రతి గ్రామపంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉంటూ పారిశుధ్యానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గ్రామపంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులకు వేతనాలు సకాలంలో అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఈ వారం రోజుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతాం.

Updated Date - Apr 18 , 2024 | 11:06 PM