Share News

Kumaram Bheem Asifabad: పత్తిదే.. పెత్తనం!

ABN , Publish Date - May 30 , 2024 | 11:03 PM

చింతలమానేపల్లి, మే 30: వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జిల్లాలో మళ్లీ ఈ ఏడాది పత్తి పంటదే పెత్తనంగా కన్పిస్తున్నది. వాణిజ్య పంటగా సాగుచేసే పత్తి పంట వైపే రైతులు మొగ్గుచూపుతున్నారు.

 Kumaram Bheem Asifabad: పత్తిదే.. పెత్తనం!

- మద్దతుకు మించి ధరలు ఉండడమే ప్రధాన కారణం

- జిల్లాలో అధికశాతం రైతులు పత్తి సాగుకే మొగ్గు

- పొంచి ఉన్న నకిలీ ముప్పు

- జిల్లాలో 3.5లక్షల ఎకరాల్లో పత్తి సాగు

చింతలమానేపల్లి, మే 30: వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జిల్లాలో మళ్లీ ఈ ఏడాది పత్తి పంటదే పెత్తనంగా కన్పిస్తున్నది. వాణిజ్య పంటగా సాగుచేసే పత్తి పంట వైపే రైతులు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం 4.6లక్షల ఎకరాలు కాగా ఇందులో అధికంగా 3.5లక్షల ఎకరాల్లో పత్తి పంటనే సాగయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అఽధికారులు చెబుతున్నారు. నాలుగైదు ఏళ్ల నుంచి పత్తిపంట సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతూ వస్తోంది. దీనికి తోడు ధరలు పెరుగుతుండడంతో పత్తి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో పత్తి పంట తర్వాత 58వేల ఎకరాల్లో వరి, 50వేల ఎకరాల్లో కంది, సోయా, ఇతర పంటల సాగవుతున్నాయి. అయితే కొన్నేళ్లుగా సాంప్రదాయ పంటలతో నష్టపోవాల్సి వస్తోందని ప్రభుత్వమే వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తూ వస్తోంది. దీంతో ఇతర పంటల సాగు గణనీయంగా పడిపోతోంది.

పత్తి పంట ధరలు పైపైకి..

రెండు మూడేళ్లుగా పత్తి ధరలు భారీగానే పెరుగుతున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్‌ ఉంది. క్వింటా పత్తి ధర రూ.10నుంచి 12వేల వరకు పలుకుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు మించి పలకడంతో రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. గతేడు ప్రారంభం నుంచి కొనుగోళ్లు ముగిసేంత వరకు ప్రభుత్వ మద్దతు ధరకంటే ఎక్కువగానే ధర పలికింది. తెల్లబంగారం రైతుల ఇళ్లల్లో సిరులు కురిపిస్తోంది. అయితే జిల్లాలో సైతం నల్లరేగడి భూములు పత్తికి అనుకూలంగా ఉండడంతో వర్షాధార పంటగా భావించే పత్తిపంటను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా తొలకరి వర్షాలు కురవగానే పత్తి విత్తనాలు విత్తేందుకు సిద్ధం అవుతున్నారు.

నకిలీ విత్తనాలతో గుబులు..

జిల్లాలో నకిలీ విత్తనాలతో రైతుల్లో గుబులు మొదలైంది. ఏటా ఎక్కడో ఒకచోట నకిలీ విత్తనాలు లభించడంతో ఏవి మంచివో..ఏవి చెడ్డవో నకిలీవో..అని రైతుల్లో గుబులు మొదలైంది. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీస్‌, వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టి భారీ ఎత్తున నకిలీ విత్తనాలను పట్టుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని చింతలమానేపల్లి, సిర్పూర్‌(టి), బెజ్జూరు, తదితర మండలాల్లో నకిలీ విత్తనాలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠాపై కేసులు నమోదు చేశారు. అయితే నాణ్యమైన విత్తనాల కొనుగోలుతోపాటు ఎరువులు, పురుగు మందులు మంచి కంపెనీలకు చెందినవి వాడితేనే ఫలితం ఉంటుందని, ప్రభుత్వ అనుమతి ఉన్న షాపుల్లో కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని కొన్ని ఫర్టిలైజర్‌ షాపుల్లో కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీ రేటుకంటే ఎక్కువ ధరకు విత్తనాలు అమ్ముతు న్నారన్న ఆరోపణలున్నాయి. రైతులు బీటీ-2 ప్రభుత్వ అనుమతి ఉన్న విత్తనాల సాగు చేస్తే దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నది. దీనికి తోడు వాతావరణ పరిస్థితులు, చీడ, పీడల భయం, గులాబీ రంగు పురుగు భయం రైతులను వెంటాడుతోంది. దీంతో రైతులకు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

ఈ ఏడాది పత్తి పంటనే సాగు చేస్తా..

- నారాయణ, రైతు, చింతలమానేపల్లి

నాకున్న ఐదు ఎకరాల్లో ఈ ఏడాది పత్తి పంటనే సాగుచేస్త. గతేడు కూడాపత్తి పంటనే సాగు చేసిన. గతంలో వర్షాభావం, చీడ, పీడల వల్ల ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. కానీ ప్రభుత్వ ధర కంటే ఎక్కువ ధర వచ్చింది. ఈ ఏడాది మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్తా.

విత్తనాల ఎంపికనే ప్రధానం..

- విజయ్‌, ఏఈవో

పత్తి పంట సాగులో రైతులకు విత్తనాల ఎంపికనే ప్రధానమైంది. విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు లీసుకోవాలి. తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. సరైన తేమలోనే విత్తనాలను విత్తుకోవాలి. అంతర్జాతీయ మార్కెల్లో పత్తికి మంచి డిమాండ్‌ ఉండడంతో పత్తికి అధిక ధర లభిస్తోంది.

Updated Date - May 30 , 2024 | 11:03 PM