Share News

Kumaram Bheem Asifabad: ముగిసిన సీఎంఆర్‌ గడువు

ABN , Publish Date - Mar 01 , 2024 | 10:56 PM

కాగజ్‌నగర్‌, మార్చి 1: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైస్‌ మిల్లర్లకు ఇవ్వగా వీటిని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) చేసి ఎఫ్‌సీఐ ద్వారా ఎంఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు, రేషన్‌ దుకాణాలకు పంపిణీ చేస్తారు.

 Kumaram Bheem Asifabad: ముగిసిన సీఎంఆర్‌ గడువు

-ఇంకా రావాల్సిన బియ్యం 1.50లక్షల క్వింటాళ్లు

-రైస్‌ మిల్లర్లలో గుబులు

-క్రిమినల్‌ కేసులు పెట్టేందుకు చర్యలు?

కాగజ్‌నగర్‌, మార్చి 1: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైస్‌ మిల్లర్లకు ఇవ్వగా వీటిని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) చేసి ఎఫ్‌సీఐ ద్వారా ఎంఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు, రేషన్‌ దుకాణాలకు పంపిణీ చేస్తారు. 2022-23లో యాసంగి సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్‌ చేసేందుకు 1,62,110 క్వింటాళ్ల ధాన్యాన్ని జిల్లాలోని రైస్‌మిల్లర్లకు అధికారులు అప్పజెప్పారు. ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు ఫిబ్రవరి 29 వరకు చివరి గడువు ఇచ్చారు. వారంరోజులుగా ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు బృందాలుగా ఏర్పడి రైస్‌ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు 1.50లక్షల క్వింటాళ్ల బియ్యం ఇంకా మిల్లర్ల నుంచి రావాల్సి ఉన్నట్టు తేల్చారు. కాగా సిర్పూరులోని రెండు రైస్‌ మిల్లుల నుంచి రూ.9కోట్ల ధాన్యం దారి మళ్లినట్టు తేలింది. గడువులోగా ఇవ్వని వారిపై అధికారులు చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు రైస్‌ మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. కుమరం భీం జిల్లాలో కూడా క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

లెక్క తేలినా కూడా..

సిర్పూరులోని రైస్‌మిల్లుల్లో రూ. కోట్లు విలువ చేసే సీఎంఆర్‌ బియ్యం దారి మళ్లినట్టు తేలింది. అయినా కూడా అధికారులు సంబంఽధిత రైస్‌మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్నది అందరి మదిలో తలెత్తుతున్న ప్రశ్న. కేవలం 6ఎ ద్వారా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. కోట్ల నిధుల ధాన్యం స్వాహాకు గురైనా కూడా ఉన్నతాధికారులు కనీసం క్రిమినల్‌ కేసులు పెట్టేందుకు కూడా ముందుకు రావటం లేదంటే అధికారుల తీరుపై అంతా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022నవంబరులో జిల్లాకేంద్రంలో ఎంఎ ల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి 8,349క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టినట్టు అధికారుల తనిఖీల్లో బయటపడితే ఇందుకు బాఽధ్యులను చేస్తూ డీఎస్‌వో, గోదాం ఇన్‌చార్జీని సస్పెండు చేశారు. డీఎస్‌వోకు మరో జిల్లాలో పోస్టింగ్‌ ఇచ్చారు. బియ్యం ఏ రైస్‌మిల్లు నుంచీ ఇంతవరకు రాలేదు. ఇందుకు బాధ్యులు ఎవరు..? ఈ కేసులో ఎంతమంది ఉన్నారు..? అన్నది ఇంతవరకు వెల్లడికాలేదంటే అధికారుల హస్తం ఏ మేరకు ఉందో ఇట్టే ఊహించుకోవచ్చు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలకు డిమాండు ఉంది. దీంతో సీఎంఆర్‌ నిల్వలను సొమ్ము చేసుకునేందుకు పన్నాగం పన్నుతున్నారు. దీనికి బదులు సేకరించిన రాయితీ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు ఇస్తున్నారు. మరో వైపు రేషన్‌ దుకాణాల నుంచి సైతం బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించి అధిక లాభాలు సొమ్ముచేసుకుంటున్నారు. మిల్లర్లపై కఠినచర్యలు తీసుకోవటానికి ఉన్నతాధికారులు ముందుకు రాకపోవటంతో వీరు ఆడిందే ఆటగా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. వీరికి రాజకీయ నాయకులు అండదండలుండటంతోనే కేసులు పెట్టాలంటే భయపడుతున్నట్టు సమాచారం. తాజాగా సిర్పూరు(టి) రైస్‌మిల్లు యాజమాని కూడా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఓ అధికారి లంచం అడిగారని తాను డబ్బులివ్వనందుకే వేధింపులకు గురి చేస్తున్నారని ప్రకటన చేయడం సంచలనం రేకెత్తింది. ఇంత జరుగుతున్నా కూడా ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నది తెలియడం లేదు. అసలు కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యం ఎటుపోయింది..? ఈ విషయంలో క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు విచారణ జరుపక పోవటం కూడా అనుమానాలకు తావిస్తోంది. వాస్తవంగా రైస్‌మిల్లులో ధాన్యం స్వాహా అయినప్పుడు క్రిమినల్‌ కేసులు బుక్‌ చేయాల్సి ఉండగా, అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించటం దారుణమని పలువురు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఈ దందా యధేచ్ఛగా కొనసాగినప్పటికీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కూడా ఏమీ మారలేదు. పెట్టుబడి లేకుండా కోట్లకు కోట్లు వెనుకేస్తున్నారు కొంతమంది రైస్‌మిల్లర్లు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్రమాలకు పాల్పడినట్టు తేలిన రైస్‌మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి బియ్యం రికవరీ చేయాలని అంతా కోరుతున్నారు. ఈ విషయమై డీఎస్‌వో తారామణిని వివరణ కోరగా రైస్‌మిల్లర్లకు ఇచ్చిన గడువు గతనెల 29తో ముగిసినట్టు చెప్పారు. బియ్యం అప్పజెప్పని రైస్‌ మిల్లర్లపై తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 10:56 PM