Kumaram Bheem Asifabad: రంగు మారుతున్న రాజకీయం
ABN , Publish Date - Mar 06 , 2024 | 09:52 PM
ఆసిఫాబాద్, మార్చి 6: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయం రంగు మారుతోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల పొత్తులతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో బీఎస్పీ దోస్తీ కుదరటం సిర్పూరు నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ క్యాడర్ అంతా గుస్సాగా ఉంది.

- బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తుతో స్థానిక నేతల గుస్సా
- సీఎంతో భేటీ అయిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప
- సిర్పూరులో బీఆర్‌ఎస్‌కు పెద్దషాక్
- మరోవైపు పొత్తుపై చర్చించకపోవడంతో బీఎస్పీ నాయకుల అసంతృప్తి
ఆసిఫాబాద్, మార్చి 6: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయం రంగు మారుతోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల పొత్తులతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో బీఎస్పీ దోస్తీ కుదరటం సిర్పూరు నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ క్యాడర్ అంతా గుస్సాగా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయన అనుచరగణంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోనప్పతోపాటు ఆయన సోదరుడు జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణరావు కలిశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సిర్పూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ తీరును అడుగడుగునా ఎండగడుతూ లోపాలను ఎత్తి చూపుతూ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ, బీఎస్పీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఈనేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో మాజీఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీజేపీ నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్యే హరీష్ బాబుపై స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు. ఆయన ఓటమికి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రధాన కారణకుడన్న విషయం తెలిసిందే. తాజాగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీఎస్పీ కలిసి పనిచేస్తుందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌పీ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియా ముందు వెళ్లడించారు. ఈ పరిణామాలను సిర్పూరు నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ, మాజీఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఓటమికి కారణమైన బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించటంతో మాజీఎమ్మెల్యే కోనప్పతోపాటు ఆయన అనుచరగణం పూర్తిగా అసంతృప్తితో రగిలిపోతోంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తాజా నిర్ణయంతో వీరంతా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి మూకుమ్మడిగా చేరనున్నారు. ఈ నిర్ణయంతో సిర్పూరు నియోకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీకి పెద్దషాక్ తగలినట్లయింది.
సీఎంతో భేటి అయిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప..
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు ఏర్పడటంతో మాజీ ఎమ్మెల్యే కోనప్ప బీఆర్‌ఎస్ పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈనేపథ్యంలో మంత్రి పొంగులేటి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటి కావటం రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కోనప్ప కాంగ్రెస్‌పార్టీలో చేరితే సిర్పూరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగలనుంది. కోనప్ప సోదరుడైన జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణరావుతో పాటు ఇటీవల నూతనంగా ఎన్నికైన కాగజ్‌నగర్ మున్సిపల్ వైస్‌చైర్మన్‌లతో పాటు నియోజకవర్గ పరిధిలోని ఆయామండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచిలు, మండలపార్టీ అధ్యక్షుడు మూకుమ్మడిగా కాంగ్రెస్‌పార్టీలో చేరనుండగా బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న క్యాడర్ అంతా మూకుమ్మడిగా బీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరితో నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీ బలోపేతం కానుంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ జెండా పట్టే వారు కూడా కరువు అవుతారని అంతా చర్చించుకుంటున్నారు.
ఆదిలాబాద్ ఎంపీ సీటు బీఎస్పీకి కేటాయించాలని డిమాండ్
కాగజ్‌నగర్: బీఆర్‌ఎస్, బీఎస్పీల పొత్తు రాష్ట్రంలో ఒక్కసారిగా చర్చకు తెరలేపింది. సిర్పూరు నియోజకవర్గంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు అంతా షాక్‌కు గురవుతున్నారు. కనీసం తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని చర్చించుకుంటున్నారు. బుధవారం మాజీ జడ్పీ చైర్మన్ సిడాం గణపతి నివాసంలో ఆయా మండలాల నాయకులు, మున్సిపాల్టీలోని 30వార్డుల బాధ్యులు కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ టిక్కెట్టు మాజీ జడ్పీచైౖర్మన్ సిడాం గణపతికి కేటాయించాలని అంతా డిమాండ్ చేశారు. పొత్తు ఎవరితో ఉన్నా సరే టిక్కెట్టు మాత్రం ఖచ్చితంగా సిడాం గణపతికి కేటాయించాలని డిమాండు చేస్తున్నారు. సిడాం గణపతికి ఉమ్మడి జిల్లాలో మంచిపట్టు ఉందని ఈ విషయంలో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నాయకులు, కార్యకర్తలు డిమాండు చేస్తున్నారు. బీఎస్పీ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనకే వదిలేస్తామని కానీ ఒక్కసారి మా అభిప్రాయం తీసుకుంటే బాగుటుండేదని పలువురు కార్యకర్తలు బాహాటంగా పేర్కొంటున్నారు. తామెంతో కష్టపడి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌పీకి ఏకంగా 40వేల ఓట్లు తెచ్చిపెట్టామని ఇప్పుడు పొత్తు విషయం తమతో చెప్పకపోవటం ఏంటనీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఇతర పార్టీల నాయకులు కూడా ఆర్‌ఎస్‌పీపై బహుజన వాదాన్ని దొరకాళ్ల వద్ద తనఖా పెట్టారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి కొంత మంది ఏకంగా తమ పార్టీలోకి రావాలని ఫోన్‌లో సందేశాలు కూడా పంపిస్తున్నారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఇక్కడి సీటు తప్పకుండా బీఎస్పీకి కేటాయించాలని, లేనిపక్షంలో తమ దారి తామే చూసుకుంటామని కొంతమంది నాయకులు పేర్కొంటున్నారు. మరో మూడు రోజుల్లో సిర్పూరు నియోజకవర్గానికి ఆర్‌ఎస్ ప్రవీన్‌కుమార్ రానున్నారని, ఆ తర్వాతనే భవిష్యత్తు కార్యచరణ తెలుస్తుందన్నారు.