Kumaram Bheem Asifabad: గాండ్రిస్తున్న బెబ్బులి..
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:22 PM
వాంకిడి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): వాంకిడి మండలంలో మళ్లీ బెబ్బులి గాండ్రిస్తోంది. వర్షాకాలం తరువాత ఆహారం, తోడు కోసం అడవిని దాటి బయటకు వస్తున్న పులులు వరుసగా పశువులపై దాడులకు దిగుతున్నాయి.
- వాంకిడి మండలంలో పశువుల మందపై దాడి
- వ్యవసాయ పనుల సమయంలో పొంచి ఉన్న ప్రమాదం
- భయందోళనలో అటవీప్రాంత ప్రజలు
వాంకిడి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): వాంకిడి మండలంలో మళ్లీ బెబ్బులి గాండ్రిస్తోంది. వర్షాకాలం తరువాత ఆహారం, తోడు కోసం అడవిని దాటి బయటకు వస్తున్న పులులు వరుసగా పశువులపై దాడులకు దిగుతున్నాయి. తాజాగా ఆదివారం మద్యాహ్నం వాంకిడి మండలంలోని ధాబా, బండకాసా గ్రామాల అటవీ ప్రాంతంలో పశువుల మందపై దాడి చేసి ఐదుపశువులను గాయపర్చింది. మొదటగా ధాబా గ్రామసమీపంలో చేనులో పశువులను మేపుతున్న నవునాత్ అనే యువకుడికి పులి కనిపించింది. వెంటనే అతను కేకలు వేస్తూ గ్రామస్థులకు తెలిపాడు. తరువాత కొంత దూరంలో పశువుల మందపై దాడి చేసి ఐదు పశువులను గాయపర్చింది. అక్కడే పశువులను మేపుతున్న ఇద్దరు కాపరులు గ్రామస్థులకు సమాచారం అందించడంతో గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో పులి అక్కడినుండి అడవి ప్రాంతానికి వెళ్లిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి పులి తిరిగి ధాబా గ్రామంగుండా అడవిలోకి వెళ్లిందని గ్రామస్థులు పేర్కొన్నారు. సోమవారం ఎఫ్‌ఆర్‌వో గోవింద్‌సింగ్ సర్దార్ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది ధాబా గ్రామసమీపంలో పులి అడుగులను గుర్తించి సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. ధాబా, బండకాసా అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నం దున గిరిజన గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
- భయందోళనలో రైతులు
వాంకిడి మండలంలోని ధాబా, బండకాసా గ్రామ సమీపంలో పశువుల మందపై పులి దాడిచేసి ఐదు పశువులను గాయపర్చడంతో పరిసర ప్రాంతాల గిరిజన రైతులు భయందోళనకు గురవుతున్నారు. గతేడాది నవంబరు మాసంలోనే మండలంలోని చౌపన్‌గూడ పంచాయతీలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన సీడాం భీము అనే రైతుపై పులిదాడి చేసి హతమార్చింది. తాజాగా పశువులపై పులిదాడి చేయడంతో ఎప్పుడు ఎం జరుగుతుందో అన్న భయంతో గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. చేన్లలో పత్తి తీయడానికి వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. పులి అడుగులను గుర్తించిన అటవీశాఖ అధికారులు పులి పరిసర ప్రాంతంలోనే సంచరిస్తున్నట్లు గుర్తించడంతో గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో చాలావరకు పత్తి చేలు అడవులను ఆనుకుని, గుట్ట ప్రాంతాల్లోనే ఉన్నాయి. రైతులు వ్యవసాయ పనులతో బిజీగా ఉన్న సమయంలోనే పులుల సంచారం పెరగడంతో ప్రమాదం పొంది ఉంది.
- గాయపడిన పశువులకు నష్టపరిహారం అందించాలి..
- పశువుల యజమానులు
ఆదివారం పులిదాడిలో గాయపడిన పశులకు నష్టపరిహారం అందించాలని పశువుల యజమానులు డిమాండ్ చేశారు. పులిదాడిలో గాయపడిన ఐదుపశువుల్లో మూడు పశువుల పరిస్థితి విషమంగా ఉందన్నారు. అవి బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని యజమానులు ఆందోళన వ్యకం చేస్తు న్నారు. అటవీశాఖ అధికారులు గాయపడిన పశువులకు నష్టపరిహారం అందించి మెరుగైన చికిత్సలు అందించాలని కోరారు.