Kumaram Bheem Asifabad: ఆయుష్మాన్ ‘యోగా’
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:05 PM
బెజ్జూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు రావడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తోడవుతున్నాయి. ఆహారపు అలవాట్లు, తినే తిండిలో విపరీతంగా కల్తీ వెరసి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

- జిల్లాలో 9కేంద్రాలు ఏర్పాటు
- యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
- గ్రామాల్లో సద్వినియోగం చేసుకుంటున్న యువత
బెజ్జూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు రావడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తోడవుతున్నాయి. ఆహారపు అలవాట్లు, తినే తిండిలో విపరీతంగా కల్తీ వెరసి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాంకేతిక రంగంలో అనేక మార్పులు రావడంతో సరైన తిండి, నిద్ర లేక, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం ఇలా ప్రతి ఒక్కరి జీవనశైలి మారిపోయింది. దీనితో మనిషి రోగాల కుప్పగా మారుతున్నాడు. వీటన్నింటికి ప్రధానకారణం మనిషికి సరైన వ్యాయామం లేకపోవడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వమే గ్రామాల్లో ఆయుష్ ఆరోగ్య యోగా కేంద్రాలను ప్రారంభించింది.
యోగాతో ప్రశాంతత, ఆధ్యాత్మికత..
నిత్యం యోగాసనాలు, ధ్యానం చేయడంతో శరీరంలో ప్రతికూల ప్రభావం తొలగి ప్రశాంతత, ఆధ్యాత్మికత చేకూరుతుందనేది నిరూపిత సత్యం. నిత్యం యోగాతో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం మనిషిని శక్తివంతం చేయడంతోపాటు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడతాయి. ఆరోగ్య జీవనానికి దోహదపడే యోగాను ప్రజలకు నేర్పించేందుకు జిల్లాలోని ఆయుష్ ఆరోగ్యమందిరాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఔత్సాహికులు ఉదయం, సాయంత్రం ఉచితంగా శిక్షణ పొందుతూ తేలికపాటి ఆసనాలు నేర్చుకుంటున్నారు.
ఉదయం సాయంత్రం గంటపాటు..
ప్రజల ఆరోగ్య సంరక్షణకు కేంద్రప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. రూ.5లక్షల వరకు ఉచితవైద్యం అందించేందుకు ఏర్పాటు చేసింది. వైద్యం వరకు వెళ్లకుండా మానసిక, శారీరకంగా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని ఆయుష్ ఆరోగ్య మందిరాల్లో యోగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయుష్‌విభాగం కేంద్రాలను ఏర్పాటు చేసి యోగా నేర్పిస్తున్నారు. జిల్లాలో 9కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం గంటపాటు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఏడాదిపాటు బృందాల వారీగా యోగాసనాలు నేర్పించనున్నారు.
ఎక్కడెక్కడంటే..
జిల్లాలోని ప్రభుత్వ ఆయుర్వేద, హోమియో, యునాని ఆరోగ్యకేంద్రాల్లో ఆయుష్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి యోగా శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని బెజ్జూరు, గురుడుపేట, బీబ్రా, చిర్రకుంట, కెరమెరి, వాంకిడి, పంగిడి, కాగజ్‌నగర్, సిర్పూర్(టి) గ్రామాల్లో ఆరోగ్యకేంద్రాల్లో ఏర్పాటు చేసిన యోగా కేంద్రాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గతంలో గ్రామీణ ప్రాంతాల్లో యోగా కేంద్రాలు, శిక్షకులు లేక ఆరోగ్యంపట్ల అవగాహన లేకుండా పోయింది. కేంద్రం ఈ పథకం ఏర్పాటు చేసిన పక్షంలో గ్రామీణ యువతసైతం ప్రతిరోజు యోగాకేంద్రాల్లో శిక్షణ తీసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపెడుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
- సందీప్‌కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారి
మారుమూల గ్రామాలకు యోగా చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 9కేంద్రాల్లో యోగా తరగతులు కొనసాగుతున్నాయి. ఒక్కో కేంద్రంలో ఇద్దరు శిక్షకులను నియమించి ఆసనాలు చేయిస్తున్నాం. జిల్లాలోని ప్రజలు యోగా నేర్చుకుంటూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలి.
యోగా దివ్య ఔషదం..
- రాచకొండ నాగేష్, బెజ్జూరు
మనుసుకు ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దివ్య ఔషదంగా పనిచేస్తుంది. మెదడుకు పదును పెట్టడానికి యోగాభ్యాసం ఎంతో ఉపకరిస్తుంది. నేటితరం మొబైల్‌ఫోన్లు, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. దీంతో అనేక మానసిక, శారీరక సమస్యలు ఎదురవుతున్నాయి. ఎంత ఒత్తిడి ఉన్నా ఉదయం గంటపాటు యోగా చేస్తే రోజంతా ఉత్సాహంగా గడుపవచ్చు.