Share News

Kumaram Bheem Asifabad: ఆశ్రమం వెనుక బాలుడి అస్తికలు

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:00 PM

రెబ్బెన, ఏప్రిల్‌ 18: రెబ్బెన మండలం పాసిగాం గ్రామంలోని ఓఆశ్రమం వెనకాల గురువారం పోలీ సులు ఓ బాలుడి అస్తికలను వెలికితీయడం కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు డీఎస్పీ సదయ్య కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.

 Kumaram Bheem Asifabad:  ఆశ్రమం వెనుక బాలుడి అస్తికలు

- వైద్యం వికటించడంతో మృతి

- వైద్యుడితో కలిసి పూడ్చిపెట్టిన తండ్రి

- నాలుగేళ్ల క్రితం ఘటన

- అస్తికలను వెలికితీసిన పోలీసులు

- తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వైనం

రెబ్బెన, ఏప్రిల్‌ 18: రెబ్బెన మండలం పాసిగాం గ్రామంలోని ఓఆశ్రమం వెనకాల గురువారం పోలీ సులు ఓ బాలుడి అస్తికలను వెలికితీయడం కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు డీఎస్పీ సదయ్య కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా నంబాల గ్రామానికి చెందిన సుల్వ శ్రీనివాస్‌, మల్లేశ్వరికి.. రిషి(11), అఖిల్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. రిషి కాళ్లకు తిమ్మిర్ల సమస్య ఉండగా తండ్రి శ్రీనివాస్‌ 2020నవంబరులో పాసిగాం శివారులోఉన్న ఆశ్రమంలో చేర్పించాడు. ఈ ఆశ్రమాన్ని అదే గ్రామానికి చెందిన భీం రావు నిర్వహిస్తూ అనారోగ్య సమస్యలతో ఆశ్రమానికి వచ్చే వారికి నాటువైద్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆశ్రమంలో చేరిన రిషికి సైతం భీంరావు తనకు తెలిసిన నాటువైద్యం చేశాడు. అది వికటించటంతో రిషి మృతిచెందాడు. విషయం బయటికి పొక్కితే ఆశ్రమానికి చెడ్డపేరు వస్తుందనే నెపంతో బాలుడి మృతదేహాన్ని ఆశ్రమం వెనుకభాగంలో పాతిపెట్టారు. అప్పటికే భీంరావు మాయలో ఉన్న శ్రీనివాస్‌ సైతం తన సొంత కుమారుడిని ఎవరికీ తెలియకుండా పాతిపెట్టేందుకు భీంరావుకు సహకరించాడు. కుమారుడి మృతి విషయం తెలియని తల్లి మల్లేశ్వరి తన కుమారుడి కోసం పలుమార్లు భర్తను ప్రశ్నించగా ఆశ్రమంలో ఉన్నాడని బుకాయించాడు. ఇలా నాలుగేళ్లుగా మభ్యపెడుతూ రాగా కుమారుడిని ఆచూకీపై తల్లికి అను మానం వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయిం చగా వారు రంగంలోకి దిగి నిర్వాహకుడితో పాటు భర్త శ్రీనివాస్‌ను విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది.

నాలుగేళ్ల తర్వాత..

ఆశ్రమ నిర్వాహకుడితోపాటు బాలుడి తండ్రిని గురువారం పోలీసులు పాసిగాం శివారులో ఉన్న ఆశ్రమానికి తీసుకెళ్లారు. వారు బాలుడిని పాతిపెట్టిన స్థలాన్ని చూపించారు. రెబ్బెన తహసీల్దార్‌ జ్యోత్స్న సమక్షంలో బాలుడిని పూడ్చిపెట్టిన స్థలంలో నాలుగు ఫీట్ల మేర తవ్వారు. దీంతో మృతదేహం అస్తికలు బయటపడ్డాయి. ఫోరెన్సిక్‌ వైద్యులు సురేందర్‌రెడ్డి మృతదేహానికి సంబంధించిన అస్తికలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. పరీక్షల అనంతరం లభ్యమైన అస్తికలు ఎవరివి అనే విషయాన్ని డీఎన్‌ఏ పరీక్ష చేయిస్తామని సీఐ చిట్టిబాబు తెలిపారు. డీఎన్‌ఏ, ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 18 , 2024 | 11:00 PM